మత సామరస్యం కోరుతూ కరపత్రాల పంపిణీ

ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకే ఇటీవల అస హన ధోరణులు, దాడులు పెరుగుతున్నాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపిఐ(ఎం) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భిన్నతంపై మతోన్మాద దాడులు, అసహన ధోరణు లకు నిరసనగా వామపక్షాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోనూ సిపిఎం ప్రచార యాత్ర లు నిర్వహిస్తోంది. అందులోభాగంగా బుధవారం శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార యాత్రలు నిర్వహించారు. అసహన ధోరణులకు వ్యతిరేకంగా, మత సామరస్యం కోరుతూ సిపిఎం శ్రీకాకుళం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని రాయివీధిలో మతసామరస్యంపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.శ్రీనివాసు మాట్లాడుతూ, ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంఘాలు, బిజెపి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. అసహజ ధోరణులు, మతోన్మాదం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధిక ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ఐక్యం కాకుండా ఉండేందుకు ప్రజల మధ్య అనైక్యతకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.