మతోన్మాదాన్ని ఎదుర్కొంటున్నందుకే బిజెపి దాడులు

దేశ సమగ్రత, సమైక్యతల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న సిపిఎంపై కుట్ర చేయటానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌, బిజెపి శక్తులు యత్నిస్తున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్‌.పుణ్యవతి అన్నారు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌.ఎస్‌.ఎస్‌, బిజెపి, ఎబివిపి గూండాలు దాడికి యత్నించటాన్ని నిరసిస్తూ ఆదివారం పాతగుంటూరు సిఐటియు కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ బస్‌స్టేషన్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. పుణ్యవతి మాట్లాడుతూ పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి జరగటం ప్రధానికి తెలియకుండా జరగే అవకాశం లేదని, మోడీ ప్రోద్భలంతోనే ఇది జరిగిందన్నారు. గాంధీని చంపిన గాడ్సే వారసులు రాజ్యమేలడం దేశ లౌకిక విధానానికి తీవ్ర విఘాతమని లౌకిక, ప్రజాతంత్ర శక్తులు గమనించాలని కోరారు. బిజెపి అనుసరిస్తున్న విధానాల ఫలితంగా మోడీ సొంత రాష్ట్రంలోనా బిజెపి పీఠం కదులుతోందన్నారు. ఇప్పటికైనా తన మత విధానాలు మార్చుకోవాలని, లేకుంటే ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాల్లో కేరళలో సిపిఎం నేతృత్వంలోని ఎల్‌.డి.ఎఫ్‌ విజయం సాధించిందని, విజయోత్సవ సభపై బిజెపి శక్తులు బాంబు విసరడంతో సిపిఎం కార్యకర్త మృతి చెందాడన్నారు. బిజెపి అధికారం చేపట్టాక దేశంలో మతోన్మాద దాడులు సృష్టించి లాభపడాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. జెఎన్‌యులో కలహాలు, హెచ్‌సియులో రోహిత్‌ మృతికి ముందు, తర్వాత పరిణామాలు ఒక పథకం ప్రకారం జరిగినవేనన్నారు. బిజెపి మతోన్మాద విధానాల్ని సిపిఎం గట్టిగా ఎదుర్కొంటుందన్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం జాతీయ కార్యదర్శి ఏచూరికి వందల సంఖ్యలో బెదిరింపు ఫోన్లు వచ్చాయని, కార్యాలయంపై పలుమార్లు దాడులకు ప్రయత్నించారని చెప్పారు. బిజెపి తన విధానాలు మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై. నేతాజీ మాట్లాడుతూ బిజెపి దేశ లౌకిక, ప్రజాస్వామ్య విధానాల్ని తుంగలో తొక్కి నిరంకుశంగా పాలిస్తుందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చీలికలు తీసుకురావాలని కుట్రలు పన్నుతుందన్నారు. దీన్ని ఎండగట్టంలో సిపిఎం అగ్రభాగాన నిలుస్తుందన్నారు.