
బీహార్ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతే పాకిస్తాన్‌లో టపాసులు కాల్చుకుంటారంటూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు అమిత్‌షా మత శక్తులను ప్రోత్సహిస్తూ వారికి నాయకత్వం వహిస్తున్నారని శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటమే అవుతుందని, బీహార్‌లో ఢిల్లీ తరహా పరాభవమే ఎదురవుతుందని ఊహించే అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా వున్న అమిత్‌షా వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని ఆయనతో పాటు విద్వేష ప్రసంగాలు చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీపై చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.