రాజధాని అమరావతి నిర్మాణం శంకుస్థాపనకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా ఆర్భాటం చేస్తున్నది. నభూతో నభవిష్యతి అన్నట్టు ఈ ఉత్సవం నిర్వహించడం నవ్యాంధ్రప్రదేశ్ భవితవ్యానికి బంగారు బాట అని శత విధాల ప్రచారం చేస్తున్నది. అనుకూల మీడియా కూడా అదే తరహాలో ఆకాశానికెత్తి చూపిస్తున్నది. రాజధానిగా అమరావతి ఎంపికను గాని, అక్కడ నిర్మాణం ప్రారంభిం చడాన్ని గాని వ్యతిరేకిస్తున్నవారె వరూ లేరు. కాకపోతే శ్రుతిమించిన హంగామాపై వ్యా ఖ్యలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక సినిమా షూటింగు ప్రారంభం ఆర్భాటాన్ని బట్టి పైసలు రావు. అలాగే తమ కృషిని బ్రహ్మాండంగా చూపించుకోవాలనే తాపత్రయంలో మోయ లేని ఖర్చును మీద వేసుకోవడం అవసరమా? ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే రాజధాని నిర్మాణ ప్రారంభానికి లక్షమంది, రెండు లక్షల మంది రావడం పెద్ద విషయం కాదు. ఆ మేరకు భారీగా ఖర్చు చేయడంపైనా పెద్ద ఆక్షేపణ ఉండదు. అయితే అదంతా ఒక సినిమా తతంగంలా మీడియా మిలమిలలే ప్రధానమన్నట్టు వ్యవహరించడం ఆశ్చర్యకరం. గోదావరి పుష్కరాల అనుభవాల తర్వాత- ప్రచార కండూతి వల్లకలిగే ప్రమాదాలేమిటో తెలిసిన తర్వాత కూడా నేతలు అధికారులు కళ్లు తెరవలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాటి సంద ర్భాల్లో భారీతనంతో పాటు గంభీరతనూ కాపాడుకోవాలి. ప్రజా రాజధాని అంటున్నందుకు ప్రజలు భాగం పంచుకునే నిరాడంబరత్వమూ ఉండాలి. ఆకాశవీధుల్లో డజన్ల కొద్దీ హెలి కాప్టర్లు, విమానాలు ఎగిరించి వందలమంది విఐపిలను ప్రద ర్శించి దానివల్ల ఏదో ఒరిగిపడుతుందన్నట్టు ఆర్భాటం చేయ డమే అర్థం లేని పని. మరో విధంగా చెప్పాలంటే నష్ట దాయం కూడా. ఎందుకంటే విభజన తర్వాత సమస్యల వల యంలో చిక్కుకు పోయామంటూ ఇంత హంగామా చేస్తే మీకు లోటే మిటి అని ప్రధాని నరేంద్ర మోడీ చమత్కరిస్తే చేయగలిగింది లేదు. ఈ హంగామాకు సమాంతరంగానే ఓవర్‌డ్రాఫ్టు కోసం వెళ్లడంలో వెల్లడవుతున్న సత్యం కూడా అదే.
ముఖ్యమంత్రి ప్రజా రాజధాని మంత్రజపం చేస్తూనే నూటికి రెండు వందల పాళ్లు ప్రైవేటు కార్పొరేటు షోగా ఈ శంకుస్థాపనను మార్చేశారు. ఆఖరుకు నిర్వహణ అతిథ్యం కూడా ఔట్‌సోర్సింగుకు ఇచ్చేశారంటే మరేమనుకోవాలి? ఇంత భారీ ప్రభుత్వ యంత్రాంగం కన్నా ప్రైవేటు సంస్థలకే నిర్వహణా దక్షత ఎక్కువని ఏలినవారు భావిస్తున్నారా? పెళ్లిళ్లకే క్యాటరింగు ఇస్తారని సమర్థించుకుంటున్నారు గాని వ్యక్తులుగా ఇవ్వడమూ, ప్రభుత్వం విషయమూ ఒకటే అవుతుందా? ఇక దీన్ని భావోద్వేగపరమైన అంశంగా మార్చి ఊరూరి నుంచి మట్టి తీసుకురావాలనీ, పూజలు చేయాలనీ పిలుపునిస్తున్నారు. పది రూపాయలకు ఒక ఇటుక చొప్పున ఈ ఇటుకలు తీసుకోవచ్చని 'ఆఫర్' ఇస్తున్నారు. మొత్తం కార్యక్రమం సంప్రదాయ మంత్ర తంత్రాలమయం చేసేశారు. బహుశా బిజెపితో చెలిమి ఫలితంగా వారి తరహా ఆలోచనలే చంద్రబాబును కూడా పట్టుకున్నట్టున్నాయి. ఈ ఇటుకలు, మట్టి తేవడం, పూజలు, పునస్కారాలు మత క్రతువును తలపిస్తుందే గాని లౌకిక రాజ్యంలో రాష్ట్ర రాజధానికి పునాది వేయడంలా ఉండదు. సంస్కృతి, సంప్రదాయాలపైన అంత మమకారమే ఉన్నవారు దేశభక్తిని, రాష్ట్రానురక్తిని పెంచాలను కున్నవారు నిన్నటి వరకూ సింగపూరు ప్రదక్షిణాలు చేయడమేమిటి? ఈ నేలను, దానిపై హక్కులనూ విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేసి వ్యాపారం జరపడమేమిటి?
ఈ శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని మోడీ వరాల వర్షం కురిపిస్తారని తెలుగుదేశం చెబుతున్నది. అయితే వైరం ముదిరిన బిజెపి నేతల స్వరం మరో విధంగా ఉంది. మోడీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదని వారు దాదాపు కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు. నిధులు వాగ్దానం చేయొచ్చు గాని ఏదో అద్భుతాలు జరుగుతాయని నమ్మకం పెట్టుకోవద్దంటున్నారు. పైగా ఇప్పటికే తమ కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం చేసినా తెలుగుదేశం కృతజ్ఞతలేకుండా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఇచ్చిన దానికి లెక్కలు చెప్పాలని నిలదీస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చింది స్వల్పమే అయినా తెలుగుదేశం ఆ మాట చెప్పి సూటిగా చెప్పి మరిన్ని నిధుల కోసం ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధపడటం లేదు. కేంద్రం ఇచ్చే నిధులతో రాజధాని మౌలిక నిర్మాణాలు ప్రారంభించి మిగిలిన పనులన్నీ విదేశీ కార్పొరేట్లకు అప్పగించాలన్నది దాని ఆలోచనగా కనిపిస్తుంది. సింగపూర్ వస్తుందనీ, జపాన్ కూడా అంగీకరించిందని ఎన్ని కబుర్లు చెబుతున్నా తీరా ఆచరణలో ఇక్కడ వారి బినామీలకే పనులు అప్పగిస్తారు. అంటే పాలకపక్షీయులే బినామీలుగా రంగ ప్రవేశం చేస్తారు. అందులోనూ స్విస్ ఛాలెంజి పద్ధతి అంటున్నారు గనక టెండరు తక్కువ వేసిన వారికే ఇవ్వాలన్న నిబంధన కూడా ఉండదు. అరుదైన, అసాధారణమైన ఆపరేషన్లకు ఉద్దేశించిన స్విస్ ఛాలెంజి టెండరు పద్ధతిని సాధారణమైన రాజధాని నిర్మాణాలకు అన్వయించడంలో చాలా రాజకీయముంది.ఈ క్రమంలో కేంద్రంతో నిమిత్తం లేకుండా ముఖ్యమంత్రి నేరుగా సింగపూర్ ప్రధానిని, జపాన్ ప్రధానిని ఆహ్వానించడం కూడా విమర్శా పాత్రమైంది. అంతేగాక ఆ దేశాలు అంగీకరించే అవకాశం కూడా తక్కువగానే ఉంటుంది. ఇంతా చేసి ఆ దేశాలకు సంబంధించిన సంస్థలు తప్ప అధికారికంగా ప్రభుత్వాలు నిర్మాణం చేపట్టే అవకాశం ఉండదు. కానీ వారిని ఆహ్వానించడం ద్వారా ఆ అభిప్రాయం కలిగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
ఈనాటి ప్రపంచీకరణ, సరళీకరణ యుగంలో ఎవరైనా లాభాల కోసం వస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమతోనో లేక చంద్రబాబు నాయుడు దక్షతకు మురిసిపోవడం వల్లనో రారు. బంగారు పంటలు పండే భూములను సమీకరణ పేరిట సేకరించి వారికి లాభాల పంటలు పండించేందుకై ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నది. గతంలో పైసా పరిహారం ఇవ్వకుండా లక్ష ఎకరాలు సేకరించడం చంద్రబాబు సమర్థత అని ఆయన భక్తులు కీర్తనలు పాడారు. ఇక్కడ సేకరించిన భూమి ప్రధాన పెట్టుబడి అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ భూమిని విదేశీ కంపెనీల చేతికి ఇచ్చి బంగారుబాతు లాంటి వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే సంధానకర్తగా వ్యవహరిస్తున్నది! వారు ఎక్కడ ఎలాటి నిర్మాణాలు చేస్తారు, రైతులకు చెప్పినట్టు వాణిజ్య భూమి వాటా ఎప్పటికి ఎక్కడ ఏ మేరకు ఇస్తారనేది నిర్ధారణ కాకుండానే శంకుస్థాపన హడావుడి మొదలైపోయింది. ఇంతకు ముందే రైతుల గోడు పట్టించుకోని సర్కారు ఈ హడావుడి పెరిగాక స్పందిస్తుందనుకోవడం కన్నా అవివేకం ఉండదు. పైగా ఒకసారి భూమిని ప్రైవేటు సంస్థకు కట్టబెట్టిన తర్వాత ప్రభుత్వం ప్రేక్షక పాత్రకే పరిమితమవుతుం ది. రాజధాని ప్రాంత అభి వృద్ధి కమిటీ క్రిడాకు అందు లో నలభై శాతం వాటా పొందడానికి ప్రభుత్వం తంటాలు పడుతున్నదని వార్తలు వస్తున్నాయంటే అర్థమేమిటి? ఎవరి భూమిలో ఎవరు ఎవరికి వాటాలు ఇస్తారు? ఎప్పటికి పూర్తి చేస్తారు? ఈ విషయమై రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాలలో నిర్దిష్టత ఎక్కడుంది? దాన్ని పాటించకపోయినా ప్రభుత్వం తీసుకునే చర్య ఏముంది? విదేశీ కంపెనీలు స్థానిక బినామీలతో పాలక పక్ష ఘరానాలతో కలసి వ్యాపార హర్మ్యాలు కడుతుంటే నిస్సహాయంగా చూస్తూ కూచుంటారని ప్రభుత్వ ఆలోచన. అందుకు భిన్నంగా రాజధాని ప్రాంత కమిటీల ఆధ్వర్వంలోనే లేక వామపక్షాలు, రైతుసంఘాల పక్షానో నిరసనలు సాగుతుంటే సహించలేకపోతున్నది. రోజూ అరెస్టులు సాగిస్తున్నది.
ఏకపక్షంగా ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ ప్రజల గోడు వినిపించేవారిని రాజధానికి అడ్డుపడుతున్నట్టు చిత్రించడం దారుణం. పారదర్శకత అణు మాత్రం లేకుండా ప్రజా రాజధాని కడతారనుకోవడం, అందుకు విదేశీ కార్పొరేట్లు సహకరిస్తాయని ఆశలు పెట్టుకోవడం భ్రమ తప్ప ఎన్నటికీ నిజం కాబోదు. మన జుట్టు వారి చేతిలో పెట్టినట్టు భూములు, నిర్మాణ నిర్ణయాలు అప్పగించిన తర్వాత చేయగలిగింది శూన్యం. వారు ఎప్పటికప్పుడు ఏవో గొంతెమ్మ కోర్కెలతో ప్రభుత్వాన్ని, ప్రజలనూ కూడా ఇరకాటంలో పెట్టి లాభాలు పెంచుకోవడా నికే ప్రయత్నం చేస్తారు. భారతదేశంలో ఎక్కడా ఇంత వరకూ ఇలా మొత్తంగా రాష్ట్ర రాజధానినే ప్రైవేటు సంస్థలకు, అందులోనూ విదేశీ సంస్థలకు అప్పగించే ఆలోచన జరగ లేదు. ప్లాను ఉచితంగా ఇస్తారని చెప్పి భారీ పారితోషికమే ముట్టజెప్పారు. వారు ప్లాను మాత్రమే ఇస్తారు మనమే కట్టుకుంటాం అని మొదట చెప్పి ఇప్పుడు కట్టడం కోసం వారి వెంటపడుతున్నారు.
అస్బెండాజ్-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌క్రాఫ్ డెవలప్‌మెంట్ అనే సింగపూర్ సంస్థలు రంగంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారి వెనక ఎవరి ప్రయోజనాలు ఎలా నెరవేర్చుకుంటారో త్వరలోనే బయిట పడుతుంది. పైగా నిర్మాణం పూర్తయ్యాక మూలమూలనా రేపు ప్రతి వంతెన దగ్గర, ప్రతి రహదారిలో టోలుగేట్లు పెట్టి ముక్కుపిండి వసూళ్లు చేపడతారు. ఉద్యోగులకు, కార్యాల యాలకు వసతి పేరిట రియల్ ఎస్టేట్ వారి భవనాలను భారీగా తీసుకోవడం జరిగిపోతుంది. ఆ విధంగా అమరావతి నగర అపురూప శిల్పాలన్న పాట మారిపోతుంది. 'అపురూప లాభాలు' జుర్రుకునేందుకు సాధనమవుతుంది. కనుక భారీ శంకుస్థాపనతో ప్రపంచ బేహారులను ఆకట్టుకోవాలనేది ప్రభుత్వ వ్యూహం తప్ప ఇదంతా ప్రజల కోణంలో జరుగుతుందనుకుంటే పప్పులో కాలేసినట్టే!
- తెలకపల్లి రవి