భోగాపురం గ్రామాలలో ఉద్రిక్తత..

విమానాశ్రయ ప్రభావిత గ్రామాల్లో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనమిక్‌ సర్వే (రైట్స్‌) (న్యూఢిల్లీ) బృందం చేపట్టిన సర్వేను బాధితులు అడ్డుకున్నారు. సర్వే రాళ్లను మహిళలు పీకేశారు. గురువారం పలు గ్రామాల్లో సర్వే చేసి బౌండరీలు ఏర్పాటు చేసిన రైట్స్‌ బృందం సభ్యులు శుక్రవారం కొంగవానిపాలెం, దిబ్బలపాలెం ప్రాంతాల్లో పలు చోట్ల రాళ్లు పాతారు. తూడెం గ్రామంలో జిరాయితీ భూముల్లో సర్వే రాళ్లు ఏర్పాటు చేయడంతో రైతులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. అడిగేందుకు వెళ్లిన వారిని పోలీసులు వెళ్లగొట్టారు. అనంతరం గ్రామ పెద్దలతో అందరూ కలిసి వెళ్లి సర్వే రాళ్లను భూముల నుంచి తొలగించారు. అక్కడి నుంచి బసవపాలెం మీదుగా వెళ్తున్న సర్వే బృందాన్ని రావాడ గ్రామస్తులు అడ్డగించి వాహనాలకు అడ్డంగా రహదారిపై పడుకొని నిరసనలు తెలిపారు. పేదల పొట్టకొట్టే విమానాశ్రయం తమకొద్దని నినాదాలు చేశారు. దీంతో కొంతమంది రైతులను, గ్రామ టిడిపి ఉపసర్పంచి అపరుభక్త పైడినాయుడును పోలీసులు బలవంతంగా లాక్కొని వెళ్లి వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.