భోగాపురం ఎయిర్‌పోర్టు సర్వేపై ఆందోళన..

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు సర్వేలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. మండల పదరిధిలోని గూడెపువలస వచ్చిన అధికారులను గ్రామ స్తులు అడ్డుకోవటానికి ప్రయత్నించటంతో పోలీసులు రెచ్చిపోయారు. రైతులను, మహిళలను, వారికి అండగా ఉన్న సిపిఎం నాయకులతో కలిపి 50 మందిని అరెస్టు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం హైకోర్టులో ఎయిర్‌పోర్టుపై న్యాయవిచారణ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న బలవంతపు సర్వేలు చర్చనీయాంశంగా మారాయి. కోర్టు తీర్పు వచ్చే వరకూ అగాలని రైతులు కోరినా అధికారులు పట్టించుకోలేదు. అడ్డుకుంటే అరెస్టులు చేసైనా సర్వే చేస్తామని అధికారులు హెచ్చరించారు. అనుమతి లేకుండా తమ భూముల్లో సర్వే ఎలా చేస్తారని రైతులు అడ్డుపడటంతో పోలీసులు రెచ్చిపోయారు. రైతులను, మహిళలను ఈడ్చుకెళ్లి అరెస్టులకు పాల్పడ్డారు.
దారిన వెళుతున్నవారిని, ఇళ్లలో ఉన్న వారిని కూడా వదిలిపెట్టలేదు. అరెస్టు చేసిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కొల్లి రామ్మూర్తి, కొండాపు లక్ష్మణరెడ్డి, అసిరప్పరెడ్డి, మట్టా నర్సింగరావు, బుజ్జమ్మ తదితరులు ఉన్నారు.