భోగాపురంలో నకిలీ నాటకం

భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణకు అధికారులు సరికొత్త తంత్రాంగాన్ని ప్రయోగిస్తున్నారు. రైతులపై ఒత్తిడి పెంచడానికి 'నకిలీ' నటకానికి తెరలేపారు. వ్యవసాయం చేయని, హక్కుదారులుగా ఉన్న కొంత మంది మత్స్యకారుల డి-పట్టా భూములు తీసుకొని భూసేకరణ జరిగిపోతుందన్న భ్రమలు కల్పిస్తున్నారు. భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు 9రెవెన్యూ గ్రామాల్లో 5311ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జారీచేసి 30రోజులు ముగిసిపోతున్నా...ఆందోళనల ఫలితంగా అధికారులు బాధిత గ్రామాల్లో అడుగు పెట్టలేక పోతున్నారు. దీంతో అధికారులు వ్యూహాత్మకంగా ఎయిర్‌పోర్టు ప్లాన్‌లో లేని గ్రామాలను ఎంచు కున్నారు. చేపలకంచేరు, దిబ్బలపాలెం గ్రామానికి చెందిన కొంతమంది మత్సకారులకు ప్రభుత్వం గతంలో డి-పట్టాలు మంజూరు చేసింది. ఆ భూములపై మత్సకారులకు హక్కు వచ్చినా, వ్యవసాయం చేయని వీరు కొంత మంది రైతులకు భూములను కౌలుకు అప్పగించారు. మత్స్యకార వృత్తిపై ఆధారపడి బతుకుతున్న వీరికి ఆ డి-పట్టా భూములతో పెద్దగా లాభం లేదు. రైతులు కూడా సక్రమంగా కౌలు చెల్లంచడం లేదు. దీంతో అధికారులు, అధికార పార్టీ నాయకులు ఈ భూములపై కన్నేశారు. డి-పట్టా భూములు కావడంతో భూసేకరణ అధికారులు తొలుత వీటిపైనే దృష్టి పెట్టి, మీరివ్వక పోయినా ప్రభుత్వం లాగేసుకుంటుందని భయపెట్టారు. హక్కుదారులుగా ఉన్న మీకు కనీసం ప్రభుత్వ ప్యాకేజీ అయినా వస్తుందని, అడ్డం తిరిగితే అదీ రాదని చెప్పే సరికి వీరిలో కొంతమంది మత్స్యకారులు భయపడి సుముఖత చూపినట్లు సమాచారం. కానీ అధికారులు నిజమైన రైతులతోనే భూసేకరణ జరిగిపోతోందన్న ప్రచారం చేస్తున్నారు.
ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా 26రోజులుగా ఉద్యమిస్తున్న అసలైన రైతులు అధికారుల దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారు. బూటకపు భూసేకరణకు ప్రజాపోరాటాలు చెక్కు చెదరవు అనడానికి భోగాపురం ఎయిర్‌పోర్టు ఉద్యమమే ఒక ఉదహరణ. రాష్ట్రంలో ఇప్పటికే ఏడు విమానాశ్రయాలు సర్వీసులు లేక ఈగలు తోలుకుంటున్న నేపధ్యంలో ఎయిర్‌పోర్టు పేరుతో భూములు తీసుకుంటామంటే ఎలా ఊరుకుంటామని రైతులు ప్రశ్నిస్తున్నారు. కానీ భోగాపురం భూసేకరణ అధికారులు రోజురోజుకూ ఎత్తుగడలు మారుస్తూ... రైతులను ఏమార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చేపల కంచేరు, దిబ్బలపాలెం గ్రామాల్లో మత్సకారులకు ప్యాకేజీ ఎర చూపారు. దీంతో ఆ గ్రామాల నుంచి 68.93సెంట్లు భూమిని 48 మంది నుంచి సేకరించారు. తాజాగా బుధవారం కౌలువాడలోని మరో 11మంది నుంచి 16.79 ఎకరాల డి-పట్టా భూమి అధికారులు సేకరించినట్లు సమాచారం. దీంతో భోగాపురంలో మొత్తం భూసేకరణ జరిగిపోతుందంటూ అధికారులు చేస్తున్న ప్రచారాలను అసలు రైతులు తిప్పికొడుతున్నారు. అదికారుల భ్రమలను నమ్మబోమంటూ ఉద్యమంలో ఉన్న రైతులు చెబుతున్నారు