భూ సేకరణ దేనికి? రాజధానికా, విదేశీ కంపెనీలకా?

అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కొత్త రాజధాని అంశం రాష్ట్రంలో చర్చనీ యాం శంగా ఉంది. మంచి రాజధాని కావాలనే ప్రజల ఆకాంక్షను పాలక తెలుగుదేశం ప్రభుత్వం తన ప్రయోజనాల కోసం వాడు కుంటోంది. భూములు తీసుకో కపోతే రాజధాని నిర్మాణం ఆగిపోతుందని ముఖ్యమంత్రి, మంత్రులు బుకాయిస్తున్నారు. అది నిజమా, కాదా? వాస్తవం ఏమిటి? రాజధాని నిర్మాణానికి 98 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, మిగిలిన రెండు శాతం మంది భూములివ్వడం లేదని, అందుకే 3,800 ఎకరాల భూమిని బలవంతంగా సేకరిస్తామని చెబుతు న్నారు. దీనికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం(20వ తేదీన) జీవో 304ను విడుదల చేసింది. దీని ఆధారంగా గ్రామాల్లో నియమించిన భూ సేకరణ అధికారులు 26 రెవెన్యూ గ్రామాల పరిధిలో నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటివరకు 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సమీక రించింది. కొందరు ఇష్టపడి, మరికొందరు గత్యంతరం లేక, ఇం కొందరు భయంతో భూములిచ్చారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి సుమారు 15 వేల ఎకరాలకు పైగా అదనంగా ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 50 వేల ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం డీనోటిఫై చేస్తామని ప్రకటించింది. ఆ భూమిని రాజధాని అవసరాలకు కేటాయించే ఏర్పాట్లు జరిగిపోయాయి. వీటితోపాటు కృష్ణా జిల్లాలోనూ, నదీ తీరంలోనూ 10 వేల ఎకరాలను పర్యాటక రంగం కోసం కైవసం చేసుకోవడానికి రంగం సిద్ధమైంది. వివిధ రూపాల్లో దాదాపు లక్ష ఎకరాల భూములు రాజధాని పేరుతో సిద్ధం చేశారు. అయినా బలవంతంగా భూమిని సేకరించాల్సిన అవసరం ఏమిటి?
ప్రభుత్వ ఆదేశాలతో సింగపూర్‌ కంపెనీలు రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం మూడు గ్రామాల పరిధిలో 4,716 ఎకరాల్లో సీడ్‌ క్యాపిటల్‌ నిర్మించనున్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఐదు దశలుగా దీని నిర్మాణం జరగబోతోందని ప్రకటించారు. ఇందులో అసెంబ్లీ, రాజ్‌భవన్‌, సచివాలయం, ప్రజాప్రతినిధుల నివాసాలు, ఆఫీసులన్నీ కలిపి 140 ఎకరాల్లో కట్టబోతున్నారు. మిగిలిన భూముల్లో వాణిజ్య భవనాలు, అపార్ట్‌మెంట్లు, కన్వెన్షన్‌ సెంటర్లనూ నిర్మించనున్నారు. సమీకరించిన 33 వేల ఎకరాలలో నాలుగు వేల ఎకరాలు పోగా మిగిలిన 29 వేల ఎకరాల్లో ఇప్పట్లో అభివృద్ధి జరిగే అవకాశం లేదు. ప్రభుత్వమే 2020, 2030, 2050 ఇలా మూడు దశల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటిస్తూ వస్తోంది. అటువంటప్పుడు దేని కోసం భూమిని సేకరిస్తున్నారో చెప్పకుండా నోటిఫికేషన్లిచ్చి ప్రజలను భయపెట్టడం అన్యాయం. రాజధాని ప్రాంతంలో సమీకరించిన భూమిని 99 సంవత్సరాలపాటు స్వదేశీ, విదేశీ కంపెనీలకు లీజుకివ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే 110 జీవోను విడుదల చేసింది. రాజధాని నిర్మాణానికి, నిర్వహణకు, క్యాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌(సిసిడిఎంసి)ను ఏర్పాటు చేసింది. ఇందులో తొలుత పది మందిని సభ్యులుగా పెట్టి అనంతరం మరొకరిని పెంచింది. అంటే పదకొండు మందిలో ఏడుగురు ప్రభుత్వాధికారులుంటే నలుగురు పారిశ్రామివేత్తలు డైరెక్టర్లుగా ఉన్నారు. రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించి సింగపూర్‌తోపాటు, జపాన్‌, తదితర దేశాలకు అప్పగించనున్నారు. డెవలప్‌మెంట్‌ పార్టనర్‌గా సింగపూర్‌ ఉంటుందని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి సంబంధించి టెండర్ల తంతు జరుగుతోంది. రాజధాని ముసుగులో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోంది. అలాగే కృష్ణానదిలోని లంకలతోపాటు, గోల్ఫ్‌కోర్సు, విలాసవంతమైన విల్లాలు, క్లబ్బులు, హోటళ్లు నిర్మిస్తామని చెబుతున్నారు. ప్రజా రాజధాని కోసమే భూమిని సేకరించేటట్లయితే ఇవన్నీ ఎందుకనే ప్రశ్న ఉదయించకమానదు. విదేశీ కంపెనీల వ్యాపారం కోసం రైతుల భూములు త్యాగం చేయాలా? ఇదేనా రాజధాని నిర్మాణం?
2013లో ప్రజల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా సవరించడానికి మోడీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. దీనికోసం అడ్డదారిలో ఆర్డినెన్సులూ జారీచేసింది. పార్లమెంటు ఆమోదం పొందలేకపోయింది. ప్రజల ప్రతిఘటనతో పార్లమెంటులో భూ చట్ట సవరణలను ఉపసంహరించుకోవాల్సొచ్చింది. కొద్దికాలంలో చెల్లిపోయే ఈ ఆర్డినెన్స్‌ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం జీవో 166ను తెచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు బలవంతంగా భూములను కాజేస్తోంది. ఇది నైతికంగా చెల్లదు. 2013 చట్టం ప్రకారం బహుళ పంటలు పండే భూములను సేకరించరాదు. రాజధానిలో ఉన్న భూముల్లో సంవత్సరం పొడుగునా కూరగా యలు, ఆకుకూరలు, పళ్లు పండుతాయి. చట్ట ప్రకారం రైతుల ఆమోదం లేకుండా భూమి సేకరించరాదనే నిబంధన లున్నాయి. ప్రభుత్వ ప్రయోజనాలకు 70 శాతం, ప్రయివేటు ప్రయోజనాల కోసం 80 శాతం రైతుల ఆమోదం పొందా ల్సుంది. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, బేతపూడి, తదితర గ్రామాల్లో మెజార్టీ రైతులు భూములివ్వడానికి నిరాకరిస్తు న్నారు. సామాజిక ప్రభావ అంచనా నివేదిక రూపొందించ కుండా భూములు సేకరించ రాదని చట్టం చెబుతోంది.
భూ సేకరణ వల్ల నష్టపోయే వివిధ తరగతులు, ప్రాంతాల ప్రజలకు ప్రత్యామ్నాయం చూపాలని చట్టం పేర్కొంది. ఈ ప్రాంతంలో భూములపై కూలీలు, కౌలుదార్లు, చేతివృత్తిదారులు, చిన్నవ్యాపారులు, కార్మికులు ఎందరో ఆధారపడి జీవిస్తున్నారు. వారి పొట్టగొట్టే భూ సేకరణ తగని పని. ఇప్పటికే ఉల్లి ధర ఘాటెక్కింది. ఈ ప్రాంతంలో వందల ఎకరాల ఉల్లి తోటలను ప్రభుత్వం నాశనం చేసింది. ఈ ప్రభావం పట్టణ ప్రజలపై పడుతోంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి పట్టణాలకు కూరగాయలు, ఆకు కూరలు, పళ్ళు అందించే పంటలు నాశనం అయిపోతే పట్టణ ప్రజలపై భారం తప్పదు. ఒకవైపున రాష్ట్రంలో వర్షాలు లేక 43 లక్షల హెక్టార్ల సాగుభూమిలో 20 లక్షల హెక్టార్లలో సాగుకు అవకాశం లేకుండా పోయింది. సాగునీరొచ్చే పరిస్థితి లేదని, ప్రమాదకర స్థితిలో ఉన్నామని ఇటీవల చంద్రబాబే ప్రకటించారు. ఈ స్థితిలో రాష్ట్రంలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడవచ్చు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మూడు పంటలు పండే భూమిని సేకరించడం న్యాయసమ్మతం కాదు.
రైతులను ఒప్పించి 33 వేల ఎకరాలను విజయవంతంగా సేకరించామని చెప్పే ప్రభుత్వం పూలింగ్‌ చట్టంలో ఉన్న హామీలను అమలు చేయడంలేదు. కూలీలు నెలల తరబడి పనులు కోల్పోయి అల్లాడుతున్నారు. వీరికి నెలకు రూ.2,500 పెన్షనిస్తామని చెప్పి ఇప్పటికీ పూర్తిగా ఇవ్వలేదు. ఇటీవల పంపిణీ చేస్తున్నామని చెప్పినా ఎంపిక చేసిన వాటిల్లో సగం మందికి కూడా ఇవ్వలేదు. ఉద్యోగాలిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. భూమిచ్చిన రైతులకు ప్యాకేజీ ప్రకారం ప్రత్యామ్నాయంగా భూమిచ్చే విషయం ఒక్క అడుగు ముందుకు వేయలేదు. హామీల అమలుకు డబ్బులేదని ప్రభుత్వం చేతులెత్తేసింది. సమీకరించిన భూమి ఉపయోగించుకోలేని ప్రభుత్వం కొత్త భూములు సేకరించి వారికి నష్టపరిహారం ఎలా ఇస్తుంది? కూలీలకు పనులు ఎలా చూపిస్తుంది? భూములివ్వకపోతే నిర్మాణం ఆగిపోతుందని ప్రచారం చేస్తోంది. మధ్యలో ఉన్న భూమివ్వకపోతే పనులు ఎలా జరుగుతాయని ప్రభుత్వం నమ్మబలుకుతోంది. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. భూమివ్వడానికి నిరాకరించే రైతుల గ్రామాలు రాజధాని మధ్యలో లేవు. గ్రామాలన్నీ రాజధాని తూర్పు, దక్షిణ భాగాల్లోనే వేర్వేరుగా ఉన్నాయి. సీడ్‌ క్యాపిటల్‌ గ్రామాలకు, భౌగోళికంగా ఈ గ్రామాలకు సంబంధం లేదు. రాజధాని నిర్మాణం కావాలంటే నిధులు కావాలి. కేంద్రం ఇప్పటి వరకు పైసా విదల్చలేదు. విజయవాడ, గుంటూరు నగరాలకు వెయ్యి కోట్లు ఇస్తామని మాట ఇచ్చినా పైసా విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి నిధులు లేవని చేతులెత్తేసింది. రాజధానికి ఆటంకం రైతులు కాదు, ప్రతిపక్షాలు కాదు. నిధులివ్వని మోడీ, తీసుకురావడం చేతకాని చంద్రబాబే ఆటంకం. భూమి పూజని ఒకసారి, శంకుస్థాపన అని మరోసారి, మాస్టర్‌ప్లానని ఇంకోసారి నెలల తరబడి కాలయాపన చేస్తున్నది ప్రభుత్వమే తప్ప ప్రజలు కాదు. తమ అసంతృప్తిని ప్రజలపై నెట్టడానికి చంద్రబాబు ప్రయత్నించడం దుర్మార్గం. రాజధానికి డబ్బులేదని చెప్పి రైతుల భూములను లాక్కొని ఆ భూములమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బుతో రాజధాని నిర్మించాలనే కుట్రబుద్ధితో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. భూమిని ఎలా సేకరించాలో చెప్పండి అని ప్రతిపక్షాలకు మంత్రులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటి వరకు రాజధాని విషయంలో ప్రతిపక్షాలతో ఒక్క అఖిలపక్ష సమావేశమూ జరపని ప్రభుత్వానికి సలహాల గురించి అడిగే హక్కు ఎక్కడుంది? తెలుగుదేశం నాయకులు, బడాపారి శ్రామికవేత్తలతో రాజధాని సలహా కమిటీ వేసి రాజధాని విషయం వారి సొంత వ్యవహారంలాగా చూస్తున్నారు తప్ప ప్రజల వ్యవహారంగా చూడటం లేదు. దీనిపై భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు, ఇతర ప్రాజెక్టుల కోసం లాక్కున్న భూములను తాను అధికారంలోకి రాగానే తిరిగిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన మాటలు ప్రజలింకా మరవలేదు. పాత ప్రభుత్వాల బాటలోనే ఈ పాలకులూ పయనిస్తున్నారు. గతంలో సెజ్‌లు, అభివృద్ధి పేరుతో సేకరించిన భూముల్లో సాధించిన అభివృద్ధి ఏమిటో అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్‌ కేంద్రాలు, విమానాశ్రయాలు, పరిశ్రమల పేరుతో భూదందా సాగిస్తోంది. ఇదంతా కార్పొరేట్ల కోసం, సొంత ప్రయోజనాల కోసం తప్ప మరొకటి కాదు. అందుకే వాస్తవాలు గమనించండి. భూములు కోల్పోతున్న రైతులు, కూలీలకు సంఘీభావం తెలపండి. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడం అందరి బాధ్యత. 
- సిహెచ్‌ బాబూరావు
(వ్యాసకర్త సిపిఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్‌)