భూ సమీకరణపై మైండ్ గేమ్..

రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ ఇంకా కొనసాగుతోంది. 95 శాతం మంది భూములివ్వగా ఐదు శాతం మందే వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నదీ తాజా గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. మరో 20 రోజుల్లో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలోనూ సమీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. మొత్తం 37,724 వేల ఎకరాల పట్టా భూమి సమీకరించాలని నోటిఫికేషన్‌ ఇవ్వగా ఇందులో 31,359 ఎకరాలకే అంగీకార పత్రాలిచ్చారు. అందులోనూ 29,854 ఎకరాలకే హక్కుదారులను నిర్థారించారు. ఇందులో 27,082 ఎకరాలకే ఒప్పంద పత్రాలందాయి. కానీ మంత్రులు మాత్రం ఇప్పటికి మొత్తం భూమికి ఒప్పంద పత్రాలు అందాయని చెబుతున్నారు. ఇప్పటికీ పట్టాభూమిలో 6,500 ఎకరాలకు అంగీకార పత్రాలే అందలేదు. అంగీకార పత్రాలందిన వాటిల్లోనూ ఇంకా 4,277 ఎకరాలకు ఒప్పంద పత్రాలు అందాల్సి ఉంది. 9.3 అంగీకార పత్రాలిచ్చి హక్కులు నిర్థారించిన భూముల్లోనూ 2,772 ఎకరాలకు ఒప్పంద పత్రాలందలేదు. మొత్తం పరిశీలిస్తే 37,724 ఎకరాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా 27,082 ఎకరాలకే ఒప్పంద పత్రాలందాయి. మరోవైపు గ్రామ కంఠాల వివాదం కొనసాగుతోంది. 29 గ్రామాల పరిధిలో 2042 ఎకరాల అసైన్డ్‌ భూములున్నట్టు గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకూ 970 ఎకరాలకు హక్కుదారులను నిర్థారించారు. మొత్తం 938 ఎకరాలకే ఒప్పంద పత్రాలందాయి. దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా ఈ భూములు అసలైన లబ్ధిదారుల నుంచి ఇతరుల చేతిలోకి వెళ్ళడంతో తీవ్ర వివాదాలు చెలరేగాయి. దీంతో వీటిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు గణాంకాలను మార్పుచేసి ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకుంటున్నా వాస్తవంగా సుమారు 10 వేల ఎకరాల పట్టాభూమి ప్రభుత్వానికి అందాల్సి ఉంది.