భూ బ్యాంక్‌ పేరిట భూములు గుంజుకోవద్దు..

 పోడు భూములకు పట్టాలు, తునికాకు బోనస్‌ ఇవ్వాలని కోరుతూ గిరిజనులు పొలికేక పెట్టారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది గిరిజనులు తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం ముంపు మండలంలోని ఎర్రంపేట ఎంపిడిఒ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌డేను ముట్టడించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు, భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య గ్రీవెన్స్‌ డేలో ఉన్న ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి చక్రధర్‌ బాబుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అటవీహక్కుల చట్టం- 2005ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములను సర్వే చేసి, పట్టాలు ఇవ్వాలన్నారు. షెడ్యూలు ఏరియాలో భూ బ్యాంక్‌ ద్వారా గిరిజన భూములను అన్యాయంగా సేకరించడాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పీసా చట్టం అమల్లో ఉన్న మన్యంలో గ్రామ సభల తీర్మానం లేకుండా భూములెలా సేకరిస్తారని ప్రశ్నించారు.