భూ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే..

                     దీర్ఘకాలం నుంచి అమల్లో ఉన్న భూ సేకరణ చట్టం-1894 స్థానంలో సక్రమ నష్టపరిహారానికి గల హక్కు, భూ సేకరణలో పారదర్శకత, పునరావాసం చట్టం-2013 (ఎల్‌ఎఆర్‌ఆర్‌ 2013)ను తెచ్చారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత, వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, గ్రామీణ పేదలు, సంబంధిత వ్యక్తులు అందరూ సవివరంగా చర్చలు, సంప్రదింపులు జరిపిన అనంతరం ఏకాభిప్రాయంతో ఈ చట్ట తెచ్చారు. కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ రైతులు, భూమిపై ఆధారపడిన వారికి కొంతమేరకు రక్షణ కల్పించేలా, దేశ ఆహార భద్రతా ఆందోళనలను పరిష్కరించేలా ఎల్‌ఎఆర్‌ఆర్‌-2013 లో నిర్దిష్ట సూత్రాలు, నిబంధనలు పొందుపరిచారు. కానీ, ఇప్పుడు కొత్త చట్టంలో ప్రతిపాదించిన సవరణలు వీటిల్లోని కనీస రక్షణలను బలహీనపరుస్తున్నాయి. భూ సేకరణ చట్టం-1894 చట్రపరిధి దిశగా ఈ ప్రతిపాదనలు ఒక వెనుకడుగు వేయడమే. త్రిపుర ప్రభుత్వం తరపున, నీతి అయోగ్‌ పాలనా నిర్వాహక మండలి ద్వారా ఈ చట్టానికి (రెండవ సవరణ బిల్లు, 2015) సంబంధించి మా అభిప్రాయాలను ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట పరిశీలన నిమిత్తం ఉంచుతున్నాం.
                    మొదటిది, ముందస్తుగా తెలియచేయాల్సిన సమ్మతి నుంచి భూ వినియోగానికి సంబంధించిన ఐదు కేటగిరీలను మినహాయించడం. ఈ సవరణలు భూ వినియోగానికి సంబంధించి ఐదు ప్రత్యేక కేటగిరీలను సృష్టించాయి. అవి, (1) రక్షణ, (2) గ్రామీణ మౌలిక సదుపాయాలు, (3) అందుబాటు ధరల్లో గృహనిర్మాణాలు, (4) పారిశ్రామిక కారిడార్లు, (5) కేంద్ర ప్రభుత్వానికి భూమి ఉన్నచోట పిపిపి ప్రాజెక్టులతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు. ఈ కేటగిరీల కిందకు వచ్చే భూ వినియోగానికి సంబంధించి ప్రైవేటు ప్రాజెక్టులైన పక్షంలో 80 శాతం బాధిత ప్రజల, అదే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) ప్రాజెక్టులైతే 70 శాతం బాధితుల అనుమతి అవసరం లేకుండా మినహాయించారు. దీనివల్ల యజమాని అనుమతి లేకుండానే భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి గల హక్కును ఇది పునరుద్ధరిస్తోంది. ఇది, వలసవాద కాలం నాటి భూ సేకరణ చట్టంలోని నిరంకుశ నిబంధనను తిరిగి తెస్తోంది. భూ సేకరణ చట్టం-2013 అందజేసిన కనీస గ్యారంటీలను లేదా హామీలను ఇది తొలగిస్తోంది. ప్రభుత్వ అవసరాల కోసం చేసే భూ సేకరణ, ప్రైవేటు కంపెనీల కోసం చేసే భూ సేకరణ మధ్య గల తేడాలను కూడా ఈ సవరణలు తొలగిస్తాయి. పైగా ఈ సవరణలు ప్రైవేటు కంపెనీలను, హద్దులేని రీతిలో లాభాలు గడించే వాటి కార్యకలాపాలను ప్రజా ప్రయోజనాల పరిధి కిందకు తెస్తాయి. ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే బలవంతంగానైనా భూమిని సేకరించేందుకు ప్రభుత్వానికి గల విశేష హక్కును ఉపయోగించుకునేందుకు 1894 నాటి చట్టం అనుమతిస్తున్నప్పటికీ ఒక కంపెనీ ప్రైవేటు ప్రయోజనాల కోసం సేకరణ జరగరాదని, విస్తృతమైన ప్రజా ప్రయోజనాల నిమిత్తం భూ సేకరణ చేయాలని పేర్కొంటోంది. పైగా, కంపెనీల కోసం చేసే సేకరణలు తగిన పరిశీలన లేకుండా జరగరాదు.
ఈ సవరణ భూ సేకరణ పరిధిని విస్తృతం చేస్తోంది. పైగా పెద్ద మొత్తంలో భూమిని తీసుకునే ప్రాజెక్టులన్నీ బాధితుల సమ్మతి, ఆమోదం పొందనవసరం లేదంటూ మినహాయిస్తోంది. బాధితులకు ముందస్తుగా తెలిపి వారి నుంచి అనుమతి, ఆమోదం తీసుకున్న తర్వాతనే భూ సేకరణ జరగాలని మేం అభిప్రాయపడుతున్నాం. నిర్వాసితులు తక్కువగా ఉండాలి. పైగా అలా సేకరించిన స్థలంలో ప్రజాస్వామ్యయుతమైన ప్రజా ప్రయోజనం ఉండాలి. ప్రభుత్వ ప్రయోజనాలకు, పునరావాసం, సామాజిక ప్రభావ అంచనాలు, తదితరాలకు పంచాయతీలు, గ్రామసభలతో చర్చలు జరిపి, అనుమతి పొందేలా హామీ ఉండాలి. ప్రధాన చట్టంలో పేర్కొన్న విధంగా బాధితుల నుంచి ముందస్తు అనుమతి కోరకుండా మినహాయింపు ఉండరాదు.
                  రెండు, సామాజిక ప్రభావ అంచనాల నుంచి మినహాయింపు. భూమి అవసరమైనపుడు బాధిత కుటుంబాలను గుర్తించేందుకు అవసరమైన సామాజిక ప్రభావ అంచనాలకు, సామాజిక ప్రభావాన్ని విశ్లేషించేందుకు తప్పనిసరిగా అవసరమైన ఐదు కేటగిరీల భూ వినియోగం నుంచి ఈ సవరణలు మినహాయించారు. పిఎస్‌యులకు, ప్రభుత్వానికి అవసరమైన భూ సేకరణ, ప్రైవేటు కంపెనీలకు లేదా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణకు మధ్య తేడా ఇక ఎంతమాత్రమూ ఉండదు. విచక్షణారహిత భూ సేకరణ నుంచి ఉన్న కొన్ని రక్షణలను తొలగించారు. ఎన్ని కుటుంబాలు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి, స్వాధీనం చేసుకునే భూమికి కనీస అర్హత ఉందా, లేదా, ప్రత్యామ్నాయ ప్రదేశాలు లేదా స్థలాలు అందుబాటులో ఉన్నాయా, లేదా, ప్రజల విస్తృత ప్రయోజనాల నిమిత్తం ఏదైనా ప్రాజెక్టు చేపడుతున్నారా, లేదా అనేది నిష్పాక్షికంగా అంచనావేయాలి. ఇటువంటి సామాజిక ప్రభావ అంచనా తప్పనిసరిగా జరగాలి, దీనికి కట్టుబడి ఉండాలి. దీన్ని కొట్టిపారేయడానికి ఎలాంటి అవకాశం ఉండరాదు.
                 మూడు, ఆహార భద్రతకు రక్షణ కల్పించే నిబంధనల నుంచి మినహాయింపు. బహుళ పంటలు సాగయ్యే భూమికి రక్షణ కల్పించడం ద్వారా ఆహార భద్రతను పరిరక్షించేందుకు ప్రత్యేక నిబంధనల నుంచి ఐదు కేటగిరీల భూ వినియోగాన్ని ఈ సవరణలు మినహాయిస్తున్నాయి. ఎలాంటి ఆంక్షలు లేకుండా బహుళ పంటలు పండే, సాగు భూమిని సైతం ఇప్పుడు స్వాధీనం చేసుకోవచ్చు. ఆహార భద్రతపై చాలా తీవ్రంగా రాజీ పడుతున్నారు. బహుళ పంటలు పండే సాగు భూమిని స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు సాధ్యమవుతుంది. అలాగే వర్షాధార భూములను పారిశ్రామిక కారిడార్ల కోసం, మౌలిక సదుపాయాలు కల్పించే ప్రాజెక్టులకు, పిపిపి ప్రాజెక్టులకు తీసుకోవచ్చు. బహుళ పంటలు పండే, సాగు భూములతో పాటుగా వర్షాధార భూములు, బీడు భూములు, వరి పంట పండే భూములు, ఉమ్మడి ఆస్తుల వనరులు ఆహారం, జీవనోపాధి భద్రతతో అనివార్యంగా ముడిబడి ఉన్నాయి. వీటిని వేరు చేసి చూడలేం. అటువంటి భూములను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి భూములను స్వాధీనం చేసుకోవడం లేదా సేకరించడాన్ని ఎంత మాత్రం అనుమతించరాదు.
                నాలుగు, ప్రజా ప్రయోజనాల నిర్వచనాన్ని విస్తరించాలి. ప్రజా ప్రయోజనాన్ని తప్పనిసరిగా నిర్వచించాలి. పెద్ద సంఖ్యలో ప్రజల సంక్షేమానికి, వారి ప్రత్యక్ష ప్రయోజనాలకు ఏవైతే ఉపయోగపడతాయో అవన్నీ ప్రజా ప్రయోజనాల కిందకే వస్తాయి. సాధారణ ప్రజానీకానికి ఉపయోగపడేలా ఉండాలి తప్పితే ప్రైవేటు లబ్ధి ఇందులో ఎంత మాత్రం చేర్చరాదు. ప్రజాస్వామ్య సిద్ధాంతాలు, పద్ధతుల ఆధారంగా ప్రజా ప్రయోజనాలు ఉండాలి. పటిష్టంగా, పకడ్బందీగా నిర్వచించాలి. లక్ష్యాలు ఏర్పరచాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఆమోదం పొంది ఉండాలి. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఉండాలి. లక్ష్య, ప్రజాస్వామ్య, వికేంద్రీకరించబడిన సామాజిక ప్రభావ అంచనాల అధ్యయన క్రమాల ద్వారా ప్రజా ప్రయోజనం స్పష్టం చేయాలి. వీటిని బాధితులు, స్వతంత్ర నిపుణులు ధృవీకరించాలి. ప్రధాన చట్టంలో ప్రజా ప్రయోజనం నిర్వచనం కూడా ఉన్నందున దాదాపు ప్రతిదీ ఈ పరిధిలోకి అనుమతిస్తోంది. సవరణలు ఇస్తున్న మినహాయింపులు, వివిధ కార్యకలాపాల నిమిత్తం భూ సేకరణ పరిధిని మరింతగా విస్తరిస్తున్నాయి. పైగా ఈ కార్యకలాపాలన్నీ ప్రజా ప్రయోజనాల పరిధిలో ఉంచుతున్నారు.
             అయిదు, పారిశ్రామిక కారిడార్ల విస్తరణ. పారిశ్రామిక కారిడార్ల విస్తరణకు ఈ సవరణలు అనుమతిస్తున్నాయి. ఇటువంటి పారిశ్రామిక కారిడార్ల కోసం రోడ్లు లేదా రైల్వే లైనుకు ఇరు పక్కలా ఒక కిలోమీటరు వరకు గల భూమిని తీసేసుకుంటున్నారు. దీనివల్ల పెద్ద మొత్తంలో వ్యవసాయ భూమి భూ సేకరణ కిందకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మేం అభిప్రాయపడుతున్నాం. ఇదంతా భూ మాఫియా, రియల్‌ ఎస్టేట్‌దారులకు సాయపడేందుకే ఉద్దేశించబడింది. దీనివల్ల లక్షలాదిమంది ప్రజలు నిర్వాసితులవుతారు. వారి ప్రధాన జీవనోపాధి పోతుంది. దేశ ఆహార భద్రత కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. పారిశ్రామిక కారిడార్ల కోసం సేకరించే భూమి అవసరమైన మేరకే చట్టబద్ధంగా ఉండేలా చూడాలి.
            ఆరు, వినియోగించని భూమి తిరిగి అప్పగింత. ప్రభుత్వం సేకరించిన భూమిని దీర్ఘకాలం పాటు వినియోగించకుండా ఉంచేందుకు ఈ సవరణలు అనుమతిస్తున్నాయి. ఏ ప్రాజెక్టునైనా ఏర్పాటుచేసేందుకు పేర్కొన్న నిర్దిష్ట కాలం లేదా అయిదేళ్ళ వరకు కాలపరిమితిని పెంచడం, వీటిల్లో ఏది ఆలస్యంగా ఉంటే ఆ మేరకు భూమిని వినియోగించకుండా ఉంచవచ్చని సవరణలు పేర్కొంటున్నాయి. ఇలా సుదీర్ఘకాలం భూమిని అట్టిపెట్టడం వల్ల అది వినియోగంలో లేకపోయినప్పటికీ ఊహాజనిత కార్యకలాపాలను ప్రోత్సహించడానికి సవరణలు హామీ కల్పిస్తున్నాయి. ఇప్పటికే, ఇటువంటి భూములు జప్తుల్లోకి వెళ్ళడం, పెద్ద మొత్తంలో డబ్బు సమీకరించడం వంటి వాటికి ఉపయోగిస్తున్నారని కాగ్‌ నివేదికలు పేర్కొంటున్నాయి. భూమిని ఏ ప్రయోజనం కోసం సేకరించారో దానికి వాడనప్పుడు మూడేళ్ళలోగా సదరు భూమిని అసలు యజమానికే అప్పగించాలి లేదా భూమిలేని కుటుంబాలకు తిరిగి పంపిణీ చేయాలి. తిరిగి సాగుకు ఉపయోగపడేలా భూమిని సిద్ధం చేసేందుకు అయ్యే ఖర్చంతటినీ ప్రాజెక్టు నిర్మించకుండా విఫలమైన కంపెనీలే భరించాలి. భూమిని సరిదిద్దుకునేందుకు డీఫాల్ట్‌ కంపెనీలపై ప్రత్యేక శిక్షాత్మక సెస్‌ను విధించాలి.
           ఏడు, చట్టాన్ని గత కాలం నుంచి వర్తింపచేయటం. 1894 చట్టం కింద తీర్పు ఇచ్చిన నిర్దిష్ట కేసుల్లో భూ సేకరణ చట్టం-1894 వర్తిస్తుందని భూ సేకరణ చట్టం-2013 పేర్కొంటోంది. అయితే, 2013 చట్టాన్ని చేయడానికి ఐదేళ్ళు లేదా అంతకన్నా ముందుగా ఇటువంటి తీర్పు వచ్చి ఉంటేనే ఇది అమలవుతుంది. ఒకవేళ పాత చట్టం ప్రకారం భూమిని స్వాధీనం చేసుకోకపోయినా లేదా నష్టపరిహారం చెల్లించకపోయి ఉన్నా అప్పుడు 2013 చట్టం వర్తిస్తుంది.
               ఎనిమిది, వ్యవసాయ కార్మికులకు తప్పనిసరిగా ఉపాధి కల్పించడం. వ్యవసాయ కార్మికులకు తప్పనిసరిగా ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వ సవరణలు పేర్కొంటున్నాయి. అయితే, వాస్తవానికి ఇది ప్రధాన చట్టంలోని నిబంధనలను నీరు గారుస్తోంది. బాధిత కుటుంబాలకు సంబంధించి ప్రధాన చట్టంలోని నిబంననలు అలాగే కొనసాగించాలి. బాధితులకు ఉపాధి కల్పించడంతో పాటు భూమికి భూమి ఇవ్వడం అనే అవకాశం కల్పించేందుకు గల మార్గాలను కూడా అన్వేషించాలి. అలాగే అన్ని సామాజిక భద్రతా ప్రయోజనాలు బాధితులకు అందేలా చూడాలి. బాధిత కుటుంబానికి ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగేలా చూడాలి.
            తొమ్మిది, ప్రైవేటు సంస్థ అని చేర్చాలి. ప్రైవేటు కంపెనీ అని ఉన్న స్థానంలో ప్రైవేటు సంస్థ అని సవరణల్లో చేర్చారు. ప్రైవేటు సంస్థ అంటే ప్రభుత్వ సంస్థ కానిదేదైనా ప్రైవేటుదే. ఇందులో ప్రొప్రయిటర్‌, భాగస్వామ్యం, కంపెనీ, కార్పొరేషన్‌, స్వచ్ఛంద సంస్థ లేదా మరే ఇతర చట్టం కిందకు వచ్చే ఏ సంస్థ అయినా అని చేర్చాలి. ప్రైవేటు సంస్థలన్నింటి కోసం భూమిని సేకరించేందుకు ప్రభుత్వాన్ని అనుమతించడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది. అందువల్ల, ప్రతిపాదిత ఈ సవరణను ఆమోదించరాదు.
             పది, సహాయ, పునరావాస నిబనంధనల అమలు. ప్రధాన చట్టంలోని సెక్షన్‌ 113కు ప్రతిపాదిస్తున్న సవరణలు నష్టపరిహారం, సహాయ, పునరావాస చర్యలు, కార్యకలాపాలు వంటి వివిధ నిబంధనలను అమలుపరిచేందుకు గల కాల పరిమితిని పెంచుతున్నాయి. ప్రస్తుతమున్న రెండేళ్ళ కాలపరి మితిని ఐదేళ్ళకు పెంచుతూ ప్రతిపాదించారు. ప్రాజెక్టు ప్రారంభం కావడానికి ముందుగానే బాధితులకు ఇటువంటి హక్కులన్నీ సమకూర్చేలా చూడాలని మేం అభిప్రాయ పడుతున్నాం.
సాగు కార్యకలాపాల కింద రాష్ట్ర ప్రభుత్వానికి అందు బాటులో ఉన్న భూమి చాలా పరిమితంగా ఉన్నందున వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చే పరిస్థితి మాకు లేదు. మాకు ఉన్న పరిమిత వనరులతోనే రాష్ట్రం స్వావలంబన సాధించేందుకు ప్రధానంగా కృషి జరుగుతోంది. మా రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం అమలు చేయతలపెట్టిన భూ సేకరణ చట్టం సవరణ బిల్లు 2015కు మద్దతివ్వలేం.