భూసేక‌ర‌ణ‌ను వ్యతిరేకిస్తూ బంద్ సంపూర్ణం..

ప్రభుత్వం తలపెట్టిన బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ ఇచ్చిన బంద్‌ పిలుపు ఉండవల్లిలో సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుండే దుకాణాలన్నీ మూతపడ్డాయి. పెట్రోలు బంకుతో సహా పెద్ద వ్యాపారసంస్థలన్నీ స్వచ్ఛంధంగా బంద్‌చేసి రైతులకు తమ సంఘీభావం ప్రకటించారు. ముందుగా సిపిఎం, వైసిపి నాయకులతో కలిసి రైతులు ఉండవల్లి సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిడా సిపిఎం కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశత్వంగా ముందుకెళితే తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచైనా భూసేకరణను నిలుపుదలచేస్తామని చెప్పారు. మెరుగైన ప్యాకేజీ అంటూ ప్రభుత్వం రైతులను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాజధానికి భూములు ఇవ్వని రైతులు ఎవరూ ప్యాకేజీ అడగలేదని, తమ భూములు తమకే కావాలని కోరిన సంగతిని గుర్తుచేశారు. సింగపూర్‌, జపాన్‌వారికోసం భూములు తీసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. రాజధానికి ఎంత భూమి కావాలి, ఏఏ నిర్మాణాలు చేపడతారు అనేది ఇప్పటివరకు గ్రామసభలు పెట్టి రైతులకు చెప్పలేదని, ఇది ముమ్మాటికి రాజ్యంగ ఉల్లంఘనేని మండిపడ్డారు.