భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన..

రాజధాని భూసేకరణ నోటిపికేషన్‌ను వ్యతిరేకిస్తూ వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఆందోళన చేస్తున్న రైతు, ప్రజా, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా అరెస్ట్‌లు చేశారు. అరెస్టు అయినవారిలో సిపిఎం క్రిడా ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, జె శివశంకర్‌, రవి, నవీన్‌, రైతు సంఘం నాయకులు గంగాధరం తదితరులున్నారు. వీరిపై 341, 143 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. రాస్తారోకో ప్రారంభం కాకముందే చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఖాకీల ప్రయత్నాలను ప్రతిఘటిస్తూ వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజలు ఆందోళనను ప్రారంభించారు. భూసేకరణ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్‌ల్లోకి కుక్కిపడేశారు. పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన తరువాత కూడా పోలీసులు నేతల పట్ల దురుసు ప్రవర్తనను కొనసాగించడంతో రైతు సంఘ నేత గంగాధర్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వైఖరికి నిరసనగా పెద్దకాకాని పోలీస్‌స్టేషన్లో ప్రజాసంఘాల నేతలు ధర్నా చేశారు.