భూముల రక్షణకు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం

           భూములను రక్షించుకునేందుకు అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. భూ సేకరణపై ప్రభుత్వం ముందడుగు వేస్తే రైతులకు అండగా నిలిచి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఆర్‌టిసి కాంపెక్స్‌ వద్ద సోమవారం భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. పిసిపిఐఆర్‌ కోసం ప్రభుత్వం వంద పంచాయతీల్లో లక్షా 30 వేల ఎకరాల భూమిని రైతుల వద్ద బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. నక్కపల్లి ఇండిస్టియల్‌ పార్కు పేరుతో భూసేకరణకు 2010లో నోటిఫికేషన్‌ ఇవ్వగా, దానికి వ్యతిరేకంగా ఈ ప్రాంత రైతులు భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో 2011లో హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. నాటి నుంచి వాదోపవాదాలు జరిగాయని, ఇటీవల సింగిల్‌ జడ్జి కోర్టు స్టేను కొట్టి వేసిందని పేర్కొన్నారు. కోర్టు కేసు కొట్టివేసినంత మాత్రాన ప్రభుత్వం రైతుల వద్ద బలవంతంగా భూములు లాక్కోవాలనే ఆలోచణను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం ఆలోచించడం లేదని ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో 13 జిల్లాలో 15 లక్షల ఎకరాల భూములను లాక్కొనేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రాంత రైతుల భూములను రక్షించుకునేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని, తప్పని సరిగా రైతుల పక్షాన తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి వరకు ప్రభుత్వం భూముల జోలికి వస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. పేదల వద్ద ఉన్న అసైన్డ్‌ భూములను తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం లేదన్నారు. బలవంతంగా భూములు లాక్కొనే అధికారం ప్రభుత్వానికి లేదని మాజీ ఐఎఎస్‌ అధికారి అర్జునరావు చెప్పిన 
విషయాన్ని గుర్తు చేశారు. అవసరమైతే కోర్టుకు వెళతామన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి భూములపై ఆధారపడి రైతులు, వృత్తిదారులు, కూలీలు జీవిస్తున్నారని, ఈ భూములు లాక్కుంటే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పారు. ఈ సమావేశంలో భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు లొడగల చంద్రరావు, నాయకులు గొర్ల బాబూరావు, జంపన శివాజీరాజు, తళ్ళ అప్పలస్వామి, కళ్ళేపల్లి అప్పలరాజు, అవతారం రాజు, సూరకాసుల గోవింద్‌, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, ఎ.బాలకృష్ణ పాల్గొన్నారు.