'భారత మాత'కు ఇచ్చే గౌరవం ఇదేనా?

భారత్‌ మాతాకీ జై... అనక పోతే దేశద్రోహమే అని సంఫ్‌ు పరివార్‌ అనుయా యులు ఈ మధ్య పదే పదే అంటున్నారు. దేశాన్ని తల్లిగా చూడాలా, తండ్రిగా చూడా లా? లేక తల్లితండ్రిగా చూడ కుండా వేరే పద్ధతిలో దేశ భక్తిని ప్రదర్శించే మార్గమే లేదా? అన్న చర్చ కూడా ఈ సందర్భంగా దేశంలో జరుగుతున్నది. ప్రస్తు తం ఈ చర్చల జోలికి పోవడం నా ఉద్ధేశ్యం కాదు. దేశంలోని మాతలకు (స్త్రీలను) సమానత్వం ఇవ్వకుండా, వారికి తగిన గౌరవం ఇవ్వకుండా భారత్‌ మాతాకీ జై అంటే దేశభక్తులై పోయి నట్లేనా? అన్నది నేను లేవనెత్త దలుచు కున్న చర్చ. 
సమానత్వం కోసం మహిళలు ఆందోళనలు చేస్తున్న కొన్ని ఘటనలను ఈ మధ్య వార్తల్లోకెక్కాయి. దేశంలో స్త్రీలను ఇప్పటికీ ఎంత అవమానకరంగా, ఎంత ఆక్షేపనీయంగా చూస్తున్నారో ఈ ఘటనలు నగంగా వెల్లడిస్తున్నాయి. సమంజసమైన, న్యాయబద్ధమైన మహిళల ఆకాంక్షలను హర్షించకుండా వారినోళ్ళను నొక్కేందుకు, వారి ఆందోళనలను అణచేందుకు మత ఛాందస శక్తులు, సంఫ్‌ుపరివార్‌ బృందాలు దౌర్జన్యం చేయడానికి వెనకాడటం లేదు. మహిళల దేవాలయ ప్రవేశ హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్త తృప్తి దేశారుపై దుండగులు దాడిచేయడం, ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలుగావడం ఈ శక్తులు ఎంతకైనా బరితెగి స్తాయన్న విషయాన్ని విదితం చేస్తున్నది. బిజేపి అధికారం లోకి వచ్చిన తర్వాత ఈ శక్తులు ఇంకా పెట్రేగిపోయాయి. ఈ సందర్భంలో మూడు, నాలుగు ఘటనలను ప్రస్తావిస్తాను. 
మహారాష్ట్రలో శనిసింగనాపూర్‌లోని 'శని' దేవాలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. అనేక మహిళా సంస్థలు దేవాలయంలోకి మహిళలను అనుమతిం చకపోవడం, మహిళలపట్ల వివక్ష చూపడమేనని చాలా కాలంనుండి ప్రచారం చేస్తున్నాయి. ప్రవేశ హక్కు కోసం ఆందోళన చేస్తున్నాయి. సుదీర్ఘ పోరాటం తరువాత కోర్టుకూడా మహిళల వాదంతో ఏకీభవించి సానుకూలమైన తీర్పునిచ్చింది. అయినా రాష్ట్ర బిజెపి ప్రభుత్వం కోర్టు తీర్పును అమలు చేయకుండా తప్పించుకోవాలని చూసింది. మహిళా సంస్థల, హక్కుల కార్యకర్తల ఆందోళన తో ప్రభుత్వం దిగివచ్చి మహిళలకు ప్రవేశం కల్పించక తప్పలేదు. 
మహరాష్ట్రలోని కొల్లాపూర్‌లో వున్న మహాలకీë దేవాలయం గర్భగుడిలోనికి మహిళలకు అనుమతి నిరాకరిస్తూ దేవాలయ ధర్మకర్తలు, భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు, ఇతర సనాతన ఛాందస వాదులు అన్యాయంగా ఆటంకపరుస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రవేశం కోసం చాలాకాలం నుండి మహిళలు, మహిళా సంస్థలు ఆందోళనలు చేస్తున్నాయి. మహిళాఉద్యమ కార్యకర్త తృప్తి దేశారు నేతృత్వంలో 400 మంది మహిళలు నిర్భందాన్ని ప్రతిఘటించి దేవాలయంలోనికి ప్రవేశించారు. ప్రవేశాన్ని నిరోధించలేమని అర్ధంచేసుకున్న ధర్మకర్తలు పంజాబి, సల్వార్‌ కమీజ్‌ ధరించినవారు ప్రవేశించకూడదని చీర కట్టుకున్న వారు మాత్రమే ప్రవేశించాలని మడతపేచీ పెట్టారు. మడత పేచీతో మహిళలను నిలువరించాలన్న భావన తప్ప ఏ గొప్ప సాంప్రదాయమూ ఆ అభ్యంతరంలో ఇమడి లేదు. ఏ ఔచిత్యమూ కనపడదు. ఈరోజు దేవాలయాలలో ఆధునిక సదుపాయాలన్నింటినీ వినియో గిస్తున్నారు. విద్యుత్‌ను, యంత్రాలను, మైకులను, రంగులను, సిమెంట్‌ను వాడుకున్నారు. వాటికి అడ్డురాని సాంప్రదాయాలు మహిళల దుస్తులకు మాత్రం అడ్డు వస్తాయని చెప్పడం విచిత్రం. పురుషులు దోవతులు కట్టుకున్నా, ప్యాంట్లు వేసుకున్నా, కుర్తాలు వేసుకున్నా అనుమతిస్తున్నారు. ఒకవేళ పంచ తప్ప మిగతా ఏ దుస్తులను అనుమతించమని అన్నా, దానిని తొలగించాలి తప్ప దుస్తులపేరుతో మహిళలకు అభ్యంతరం పెట్టడం అన్యాయం. స్త్రీ దేవత కోసం నిర్మించిన దేవాలయంలోకి పురుషులు వెళ్ళవచ్చుగానీ స్త్రీలను మాత్రం నిషేేదించటం మరీ విడ్డూరం. స్త్రీ దేవతగా ఉండటానికి అభ్యంతరం లేదుగాని, పురుషులతో సమానంగా స్త్రీలు మాత్రం పూజలు చేయకూడదు. అయితే మహిళల పట్టుదల ముందు ఈ అభ్యంతరాలు నిలబడలేక పోవడం మంచి పరిణామం.
కేరళ రాష్ట్రంలోని శబరిమలై అయ్యప్ప దేవాలయం లోనికి మహిళలను అనుమతించాలా, లేదా? అన్న అంశం గురించి ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం నడుస్తున్నది. అక్కడ జరుగుతున్న వాదోప వాదాలను పరిశీలించే వారికి సమాజంలో ఇప్పటికీ పురుషాధిక్య భావజాలం మహిళలను ద్వితీయ శ్రేణి పౌరు లుగానే ఉంచాలన్న మానసిక ధోరణి ఎంత బలంగా ఉందో కళ్లకు కట్టినట్లు కనపడుతుంది. శబరిమలై అయ్యప్ప దేవాలయంలో 15-50 వయసు మధ్యలోవున్న మహిళ లను గర్భగుడిలోకి రానివ్వరు. ఈ వయసులో వున్న స్త్రీలు బహిస్టు అవుతారు కాబట్టి బహిస్టు అయిన మహిళ మైలపడినవారు గాబట్టి దేవుని సన్నిధికి రావడాన్ని నిషేధించారు. ఈ అనాగరిక చర్యను సమర్ధించుకోవడానికి చెప్పే వాదన మరింత హాస్యాస్పదంగా ఉంది. మహిళలను చూస్తే గోటక బ్రహ్మచారి అయిన దేవుడు చపల చిత్తానికి లోనవుతాడని అందుకని మహిళల ప్రవేశం నిషేధించబడిం దని ధర్మకర్తలు వాదన చేస్తున్నారు. మానవులందరినీ కాపాడే దేవుడిని ధర్మకర్తలు కాపాడాల్సిన దుస్థితి ఉందని చెప్పుకోవడమే విడ్డూరం. ఆడవాళ్లను చూస్తే దేవుని బ్రహ్మచర్యానికి చేటు రావడం ఏమిటి? ఆయన శీలాన్ని కాపాడే పని ధర్మకర్తలు తీసుకోవడం ఏమిటి? అన్న ప్రశ్నలటుంచి, ప్రకృతి సహజసిద్దమైన బహిస్టును అపవిత్రమైనదిగా చిత్రించి అసహ్యించుకోవడం, శరీర తత్వంగా ఉన్న బహిస్టును మురికిగా ముద్రవేసి మహిళలను హీనంగా చూడడం, దూరంగా ఉంచడం సాంప్రదాయం పేరుతో ఆధునిక సమాజానికి అతుకు తుందా? బహిస్టు అనేది ప్రకృతి సిద్ధమైనది. అంతే కాక జంతు జాలం పునరుత్పత్తి కొనసాగడానికి తోడ్పడుతున్న గొప్ప ప్రక్రియ. క్రమం తప్పకుండా బహిస్టు కావడమనేది ఆరోగ్యానికి నిదర్శనం. అటువంటి శరీరధర్మాన్ని మహిళ లను అణిచివేయడానికి, వారిని అసమాన దిగువస్థాయి పౌరులుగా పరిమితం చేయడానికి వినియోగించడాన్ని సహించే సమాజం ఏదీ ఆధునిక సమాజంగా వర్ధిల్లబోదు. కోర్టులో జరుగుతున్న వ్యాజ్యంపై తీర్పు ఎలా వున్నా మహిళల సమానత్వాన్ని కోరుకునే పౌరసమాజం వారి హక్కులకు అండగా నిలవడానికి ముందుకు రావాలి.
దాంపత్యంలో బలవంతపు సంభోగం గురించి రాజ్యసభలో ఈ మధ్య చర్చ జరిగింది. బలవంతపు సంభోగాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టంలో అవసరమైన సవరణ తెచ్చే ఆలోచనుందా? అని ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యకరంగాను, అన్యాయంగాను ఉన్నది. భారత దేశంలో వున్న నిరక్ష్యరాస్యత, దారిద్య్రం, పురాతన సాంప్రదాయాల మూలంగా వివాహానంతర మానభంగాన్ని నేరంగా పరిగణించలేమని ఆమె ఈసందర్భంగా చెప్పారు. అంటే కుటుంబాలలో బలవంతపు సంభోగాలు, మానభంగాలు పేదలలోనే ఉన్నట్లు, చదువులేని మగవాళ్లు మాత్రమే దానికి పాల్పడుతున్నట్లు అలువంటి భావన కల్గేట్లు చెప్పడం విడ్డూరంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న ఫిర్యాదులను చూస్తే చదువుకు, పేదరికానికి ఇటువంటి నేరాలకు ఎటువంటి సంబంధం లేదని, మేధావులు, విద్యావంతులు, ధనవంతులు కూడా ఇటువంటినేరాలకు పాల్పడుతున్నారని అర్ధమవుతుంది. అలాగే ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాల పేరుతో మహిళలపై జరుగుతున్న అకృత్యాన్ని సమర్ధించుకోవడానికి ప్రయత్నం చేయడం మరింత అభ్యంతరకరంగా ఉంది. మనదేశం అనుసరిస్తున్న శిక్షాస్మృతిని బ్రిటీష్‌వాడు ప్రవేశపెట్టాడు. శిక్షాస్మృతి విదేశాలది వాడుకోవచ్చు కానీ, విదేశాలలో నేరంగా పరిగణించబడుతున్న అంశాన్ని మనదేశంలో నేరంగా పరిగణించడానికి సాంప్రదాయం పేరుతో నిరాకరించడం అన్యాయం. ఇంగ్లాండులో 1991లో చట్టాన్ని సవరించి బలవంతపు సంభోగాన్ని కూడా నేరంగా పరిగణించారు. అదే చట్టాన్ని వాడుకుంటున్న మనం మాత్రం మార్చడానికి సిద్ధం కావడంలేదు. సంఫ్‌ు పరివార్‌ పెద్దలు మన దేశ సాంప్రదాయ దుస్తులు కాకపోయినా బ్రిటీష్‌ మిలటరీ వాడే కాకీ నిక్కర్‌ను తమ యూనిఫాంగా ఇప్పటివరకూ వినియోగిస్తున్నారు. మారిన పరిస్ధితులకు అనుగుణంగా దానిని ఇప్పుడు ప్యాంట్‌గా నిర్ణయించుకున్నారు. కానీ ఇవే శక్తులు సాంప్రదాయం పేరుతో మహిళల అణచివేతను, మహిళల వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని హరించే చట్టాలను మార్చడానికి అభ్యంతరాలు చెబుతున్నారు. సాంప్రదా యాలలో మంచివాటిని కొనసాగించటంలో తప్పులేదు. మారిన పరిస్థితులకు నప్పని వాటిని వదిలించుకోవాలి. మహిళలను అగౌరపరిచే ఘటనలు దేశంలో అనేక చోట్ల నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మహిళలను అబలలుగాను, అసమానులుగాను, అనర్హులుగాను చూసే పురుషాధిక్య భావజాలం సమాజంలో విస్తారంగా ఉంది. ఈ భావజాలం ధనవంతులు, పేదవాళ్లు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల కుటుంబాలలో వేళ్లలుకుని వున్నది. ఈ పితృస్వామిక ధోరణిని ఎలా బలహీనం చేయాలి? స్త్రీ పురుష సమాన త్వాన్ని ఎలా సాధించాలి? అని ప్రయత్నం చేయాల్సిన తరు ణంలో మతం పేరుతో, సాంప్రదాయం పేరుతో మతోన్మాద శక్తులు స్త్రీలను ఇంకా అణచి ఉంచాలనే ధోరణితో వ్యవహ రిస్తున్నాయి. హిందూత్వ పేరుతో సంఫ్‌ుపరివార్‌ శక్తులు ఈరోజు చాలాచురుకుగా, దురుసుగా ఈ విషయంలో వ్యవహరిస్తున్నాయి. ఇతర మతాలకు చెందిన మతోన్మాద శక్తులు కూడా ఈ విషయంలో ఏమీ వెనుకబడిలేవు. ఉద్య మాల ప్రభావంతో ఆధునిక, శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి ప్రభావంతో పెట్టుబడిదారి ఆర్ధిక సంబంధాలు మానవ సంబంధాలన్నింటిని ప్రభావితం చేయడంతో మహిళల పరిస్థితుల్లో కొన్ని సానుకూల పరిణామాలు వస్తున్నాయి. వీటిని కూడా ముందుకు పోకుండా నిరోధించడానికి సాధ్యమైతే వెనక్కి పంపడానికి మతోన్మాద శక్తులు ప్రయత్ని స్తున్నాయి. మహిళల పరిస్థితిని దిగజార్చడానికి ఏ మాత్రం వెనుకాడని, మహిళల సమానత్వాన్ని ఏమాత్రం భరించలేని ఇటువంటి శక్తులు, మాతపేరుతో దేశభక్తిని కొలవడానికి మాత్రం సిద్ధమవుతున్నాయి. స్త్రీల సమానత్వం గురించి, అభ్యుదయం గురించి ఆలోచించని వారికి భారత్‌ మాతాకీ జై అంటేనే దేశభక్తి అని నిర్వచించే అర్హత లేదు.
''దేశమంటే మట్టికాదోరు. దేశమంటే మను షులోరు'' అని గురజాడ మహకవి అన్నారు. మనుషులను గౌరవించనివారు మట్టికో, మాతకో, పితకో జై కొడితే దేశభక్తి అనిపించుకోదు. దేశంలో దళితులను, గిరిజనులను మనుషులగా చూడని దుస్థితి ఇంకా కొనసాగుతోంది. మహిళలను ద్వితీయశ్రేణి పౌరులుగానే ఇప్పటికీ చూస్తున్నారు. మైనార్టీలను దేశపౌరులుగా చూడటానికి బిజెపి, సంఫ్‌ుపరివార్‌ శక్తులు సిద్ధంకావడం లేదు. భారతీయ సంస్కృతి పేరుతో అసమానతలను, అకృ త్యాలను సమర్ధిస్తున్నాయి. మరోవైపున దేశభక్తి గురించి, జాతీయభావం గురించి మాట్లాడుతున్నాయి. ఏ దేశంలో నైనా ఒక తగరగతిని మర్యాదగా, సమానంగా చూడకుండా హీనంగా చూస్తూ దేశభక్తినీ, జాతీయభావాన్ని పెంపొందిం చడం సాధ్యం కాదు. అందుకే అసమానతల మీద ఆధారపడి దేశభక్తిని, జాతీయభావాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిర్మించటం సాధ్యం కాదని అంబేద్కర్‌ అన్నారు.దేశమంటే మాత అనుకుంటే ఆ మాతలను సమానంగా, గౌరవంగా చూడడమే నిజమైన దేశభక్తి.
- బి. వి. రాఘవులు