భారత కార్మికోద్యమ చరిత్ర

ప్రముఖ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు, ప్రసిద్ధ రచయిత సుకోమల్‌ సేన్‌ బృహత్తర రచన 'భారత కార్మిక వర్గం -ఆవిర్భావం, ఉద్యమం, 1830-2010'. క్షుణ్ణంగా సవరించి, విస్తరించిన తృతీయ ప్రతికి తెలుగు అనువాదం ఇది. రచయిత తొలి ప్రతి ముందు మాటలో పేర్కొన్నట్లు ఇది సంప్రదాయ సిద్ధమైన ట్రేడ్‌ యూనియన్‌ చరిత్రలకు భిన్నమైనది. విస్తృతమైన జాతీయ, అంతర్జాతీయ నేపథ్యంలో భారత కార్మిక వర్గ పోరాటాలను రాజకీయాలు ఆర్థికాంశాల పరస్పర ప్రభావాలను గమనంలోకి తీసుకొని సాగిన రచన ఇది. భారత దేశంలో కార్మిక వర్గ ఆవిర్భావం, సంపన్న దేశాలలో కార్మిక వర్గ ఆవిర్భావానికి భిన్నమైన రీతిలో వలస పాలకులు పూర్తి ఆధిపత్యం కొనసాగుతున్న సమయంలో జరిగింది. అందుచేత భారత కార్మిక వర్గం పుట్టిన దగ్గర నుంచి ఒకవైపున వలసవాదుల రాజకీయ పాలనను రెండో వైపున దేశ, విదేశీ పెట్టుబడిదారుల ఆర్థిక దోపిడీని ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ విధంగా భారత కార్మికోద్యమం జాతీయ విముక్తి ఉద్యమంతో పెనవేసుకొని సాగింది. ఈ రకమైన సంబంధం 1947, ఆగస్టులో స్వాతంత్య్రం లభించేవరకు కొనసాగింది. ఆ తర్వాత బడా బూర్జువా వర్గ ఆధిపత్యంలో భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణం జరుగుతున్న సమయంలో భారత కార్మికోద్యమం ముందుకు సాగింది. 1970 వరకు కొనసాగిన ఈ దశను తొలి ప్రతి వివరిస్తుంది. 1970 వ దశకం తర్వాత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో చోటుచేసుకున్న మార్పుల పర్యవసానంగా ప్రపంచ కార్మికోద్యమ స్వరూప, స్వభావాలలో కూడా మార్పులు సంభవించాయి. దీనితో పాటు శాస్త్ర సాంకేతిక విప్లవం ఫలితంగా కూడ కార్మిక వర్గ నిర్మాణం మరింతగా మారిపోయింది. ఈ అంశాలను 1995 వరకు ద్వితీయ ప్రతిలో రచయిత వివరించారు.
ఈ పుస్తకం 2010 వరకు చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తుంది. నయా ఉదారవాద ప్రపంచీకరణ విధానాలు ఉధృతంగా కొనసాగుతున్న ఈ కాలంలో ప్రపంచ కార్మిక వర్గంతో పాటు భారత కార్మిక వర్గం కూడ అత్యంత క్షిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నది. భారత ప్రభుత్వ కార్మిక వర్గ వ్యతిరేక వైఖరి, విధానాలు దానికి ప్రతిగా కార్మిక వర్గ పోరాటాలు ఉద్యమాలను తగు వివరాలతో రచయిత విశ్లేషించారు అంతేకాదు ఈ ప్రతి క్షుణ్ణంగా సవరించబడింది. భారత కార్మికోద్యమం తొలిరోజుల్లో కేరళ ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం గురించి భారత దేశంలో కీలక పరిశ్రమల్లో ఒకటయిన బొగ్గు గనుల రంగంలో కార్మిక వర్గ ఉద్యమ ఆవిర్భావం గురించి కూడ వివరాలను రచయిత దీనిలో పొందుపరిచారు. ఎల్‌ఐసి ఉద్యమ నాయకులు కెకెడి హనుమంతరావు, ఎస్‌.ధనుంజయ రావు ఈ పుస్తక అనువాదకులు. భారత కార్మికోద్యమ చరిత్రను, దాని ప్రత్యేకతలను ప్రతిబింబించే ఇంతటి సమగ్ర గ్రంథం తెలుగులో మరొకటి లేదు. అలాంటి అపూరపమైన ప్రచురణ పాఠకులకు అందిస్తున్నందుకు ప్రజాశక్తి బుకహేౌస్‌వారు అభినందనీయులు.

భారత కార్మికోద్యమ చరిత్ర 
(1830-2010)- సుకోమల్‌సేన్‌, 
పేజీలు: 834
ధర: 500/-
                ప్రతులకు: ప్రజాశక్తి బుకహేౌస్‌ తెలంగాణ, ఎం.హెచ్‌.భవన్‌, ప్లాట్‌ నెం: 21/1, ఆజమాబాద్‌, ఆర్‌టిసి కళ్యాణ మండపం దగ్గర, హైదరాబాద్‌-20.