భారత్, చైనాల మధ్య అభివృద్ధిలో పోలికలు ఈనాటివి కావు. రెండు దేశాలూ రెండేళ్ల తేడాతో విముక్తి పొందడం, జనాభాలో, ఆర్థికాభివృద్ధిలో దాదాపు ఒకే విధంగా ఉండడం వల్ల ఈ పోలికలు నాటి నుండి నేటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్ర పూర్వం చైనా భారత కన్నా వెనుకబడి ఉండేది. సోషలిస్టు నిర్మాణం తరువాతా, 1980 దశకంలోనూ చైనా అప్రతిహత అభివృద్ధి సాధించడంతో భారత్‌ను అధిగమించి ముందుకు పోయింది. గత 20 ఏళ్లకు పైగా రెండంకెల అభివృద్ధితో నడుస్తున్న చైనా వేగం మందగించిందనీ, భారత్ వచ్చే ఏడాది అభివృద్ధిలో దాన్ని అధిగమిస్తుందనీ ఆర్థిక పండితులు, సంస్థలు చెబుతున్నాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికంలోనే అధిగమిం చిందని కూడా కొన్ని లెక్కలు చెబుతున్నాయి. ఈ గణాంకాల విశ్వసనీయతను రాయిటర్స్ లాంటి వార్తా సంస్థలు ప్రశ్నించాయి. అది వేరే విషయం. భారత్‌లో నయా-ఉదారవాద ఆర్థిక పండితులు మాత్రం ఇదంతా మోడీ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణల ఘనత అని ఊదరగొడుతున్నారు.
అభివృద్ధి లెక్కలతో వచ్చిన చిక్కేమంటే ఆర్థికాభివృద్ధికీ- మానవాభివృద్ధికీ- మానవుడు సంతోషంగా జీవించడానికీ సంబంధంలేకుండా ఉంటుంది. ఆర్థికాన్ని రాజకీయాలు శాసిస్తున్నాయా, రాజకీయాలను ఆర్థికం శాసిస్తున్నదా అనేది ఆర్థికాభివృద్ధి ఫలాలు ఎవరికి అందుతాయో చెప్పడానికి కీలకం. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థికాంశాలు రాజకీయాలను శాసిస్తాయి. మన దేశంలో స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు ఇక్కడ రాజకీయాలను శాసిస్తున్నాయి. మన్మోహన్ అధికారంలో ఉండాలన్నా, ఆయన దిగి మోడీ రావాలన్నా అంతా వారనుసరించే ఆర్థిక విధానాలమీద ఆధారపడి ఉంటుంది. కార్పొరేట్‌లకు ఊడిగం చేయకపోతే మోడీ కూడా గద్దె మీద నిలవలేడు.
సోషలిజంలో ఆర్థికాన్ని రాజకీయాలు శాసిస్తాయి. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా సోషలిస్టు ఆర్థిక విధానాలు నడుస్తాయి. సోషలిస్టు చైనాలో ఉన్నది ప్రజా ప్రభుత్వం. ఆర్థిక సంస్కరణలు అమలు పరచాలన్నా, వద్దనుకున్నా, ఆర్థికాభివృద్ధిని వేగంగా పరుగుతీయించాలన్నా, బ్రేకులు వేయాలనుకున్నా అంతటినీ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం నడిపిస్తుంది. గత రెండున్నర దశాబ్దాలుగా రెండంకెల స్థాయిలో శరవేగంగా పరుగెత్తించిన ఆర్థికాభివృద్ధికి కాస్తా బ్రేకులు వేయాలనుకుంది చైనా ప్రభుత్వం. శీఘ్ర ఆర్థికాభివృద్ధి సంపదను పెంచుతుందేగాని ప్రజలకు పంచదు. పెరిగే సంపదను సామాన్య ప్రజలకు పంచే బాధ్యతను ప్రభుత్వాలు చేపట్టాలి. చైనా ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని చేపట్టింది గనుకనే ఆర్థికాభివృద్ధిని తగ్గించదలుచుకుంది. ఆర్థికాభివృద్ధిని 7 శాతం వద్ద ఉంచాలనీ, ప్రస్తుత పంచవర్ష ప్రణాళికలో దేశ ప్రజల ఆదాయాలను మూడు రెట్లు పెంచాలనీ కమ్యూనిస్టు ప్రభుత్వం నిర్ణయించింది. దానికనుగుణంగానే అది చర్యలు తీసుకుంటోంది. అందువల్ల చైనాలో ఆర్థికాభివృద్ధి ప్రస్తుతం 7 శాతం దగ్గర ఉండడం అనేది ఆ ప్రభుత్వం తీసుకున్న ప్రణాళికా బద్దమైన చర్యల్లో ఒకటి. దాన్నీ, భారత దేశంలోని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థనూ పోలిక పెట్టి ప్రచారం చేయడం, ఇదంతా మోడీ ప్రభుత్వ ప్రతాపమేనని చెప్పడం ప్రజలను మోసం చేయడానికే. ఇక్కడ ఆర్థికాభివృద్ధి 7 శాతం కాదుగదా 10 శాతం పెరిగినా పేదల బతుకుల్లో మార్పురాదు. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో అభివృద్ధి ఫలాలన్నీ కొద్దిమంది శతకోటీశ్వరులైన పెట్టుబడిదారుల వద్ద కేంద్రీకృత మవుతాయి. అందుకే మన దేశం ఒకవైపు ఆర్థికాభివృద్ధిలో ఉరకలు పెడుతుంటే, మరోవైపు అన్నార్తుల ఆకలి కేకలూ పెరుగుతున్నాయి. అందువల్ల మోడీలూ, చంద్రబాబులూ చెబుతున్న జిడిపి సంఖ్యలు సామాన్య ప్రజలకు ఎండమావుల్లాంటివే.