భగత్‌సింగ్‌ త్యాగం వృథా కానీయరాదు..

విప్లవానికి మారు పేరు భగత్‌సింగ్‌. పోరాటాలకు నిలువెత్తు నిదర్శనం. స్వాతంత్య్ర పోరాటంలో యువ రక్తంతో దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన త్యాగశీలి. నేటి యువతకు ఆదర్శప్రాయుడే కాకుండా రోల్‌ మోడల్‌. ఇటువంటి విప్లవనేత జయంతిని పురస్కరించుకుని పాలకుల వినాశకర విధానాలపై గళం విప్పేందుకు యువత నడుంబిగించాలి. సువిశాల భారతదేశంలో 1907 సెప్టెంబర్‌ 27న పంజాబ్‌ రాష్ట్రం రాయల్‌పూర్‌ జిల్లా బంగా ప్రాంతంలో భగత్‌సింగ్‌ జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఈ యువకిశోరం ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనే నినాదంతో స్వాతంత్య్ర పోరాటానికే వన్నెతెచ్చారు. దేశాన్ని ఉత్తేజింపజేశారు. తన 13వ ఏటనే గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి ప్రభావితుడయ్యారు. బ్రిటీష్‌ ప్రభుత్వానికి ఎదురు తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు, బ్రిటీష్‌వారు దిగుమతి చేసిన దుస్తులను తగలబెట్టి స్వాతంత్య్రోద్యమంలోనే యువ విప్లవోద్యమానికి తెరలేపారు. 1928లో సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో లాలాలజపతిరారుని హతమార్చిన ఘటన భగత్‌సింగ్‌ను ఎంతో కలచివేసింది. 1929లో బ్రిటీష్‌ అసెంబ్లీలో పొగబాంబు విసిరిన సంఘటనలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేశ్‌లు బ్రిటీష్‌ పాలకులనే గడగడలాడించారు. ఈ పోరాటంలో విప్లవం వర్థిల్లాలి, శ్రామికవర్గం వర్థిల్లాలి, సామ్రాజ్యవాదం నశించాలి, సోషలిజం వర్థిల్లాలనే ఉత్తేజింపజేసే నినాదాలను కూడా రూపొందించారు. ''ఎవర్నో హతమార్చేందుకు ఈ చర్యకు మేము ఉపక్రమించలేదు. ప్రజాగ్రహాన్ని చెవికెక్కించుకోలేని బ్రిటీష్‌ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే'' అని కూడా హింస పట్ల తన వైఖరిని భగత్‌సింగ్‌ వెలిబుచ్చారు. తనకు ఉరి ఖాయమని తెలిసినా ఎక్కడా అధైర్యపడకుండా నిత్యం జైల్లో సైతం అనేక గ్రంథాలను అధ్యయనం చేశారు. అనేక వ్యాసాలను తన డైరీల్లో పొందిపర్చారు. ప్రపంచానికి సోషలిజమే మార్గమనే సిద్ధాంతాన్ని చెప్పిన మహోన్నత వ్యక్తులైన మార్క్స్‌, ఏంగెల్స్‌, లెనిన్‌ సిద్ధాంతాన్ని వంటబట్టించుకున్నారు. ఆ ముద్రే తన తుదకంటూ ఉండాలనే కృతనిశ్చయంతో ''మార్క్సిస్టు''గా ప్రకటించుకున్నారు. మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా నిలిచిన భగత్‌సింగ్‌ ''నేను ఎందుకు నాస్తికుడినయ్యాను!'' అనే దానిపై ఒక స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారు. 23 ఏళ్ల వయస్సుకే 1931 మార్చి 23న ఉరికంబమెక్కి దేశానికే ఆదర్శప్రాయుడయ్యాడు. ఆయన మరణం వృథా కాలేదు. అనంతరం ఎందరో యువకిశోరాలు స్వాతంత్య్ర పోరాటంలోకి వచ్చారు. ఉద్యమించారు.
భగత్‌సింగ్‌ వంటి మహోన్నత ఆదర్శప్రాయుని స్ఫూర్తిని నేటి యువత స్మరించుకుంటేనే చాలదు. ఆ స్ఫూర్తితో అవినీతి, మతోన్మాదం, అశ్రితపక్షపాతంతో నిండిపోయిన మన పాలకుల ఉచ్చులో నుంచి యువతను బయట పడేయకుంటే దేశం మరో 100 ఏళ్లు వెనక్కుపోతుందేమోనన్న ఆందోళన కలిగిస్తుంది. స్వాతంత్య్ర సాధనకు 200 ఏళ్లు పడితే, దాని ఫలాలు అందరికీ అందడానికి ఎన్నేళ్లు పట్టాలని నేటి పాలకులను నిలదీసే స్థాయికి నేటి యువత తన పయనాన్ని నిర్దేశించుకోవాలి. భగత్‌సింగ్‌ కాలంలో సామ్రాజ్యవాదం ఒక కోణంలోనే తన దోపిడీని సాగిస్తే, నేడు పెట్టుబడిదారీ సమాజం తన సామ్రాజ్యవాద దాహాన్ని జెడలు విప్పి వందల కోణాల్లో తన దోపిడీని పీడిత ప్రజలపై ఎక్కుపెడుతున్నది. దీన్ని గమనించాల్సిన యువతరం చూసీచూడనట్లు, తన వ్యాపకమే చూసుకుంటే భవిష్యత్తరాలు క్షమించవు!
ఇప్పటి వరకు స్వేచ్ఛా, స్వాతంత్య్రం వరకే నినదించిన ప్రపంచం, సామ్యవాదం వైపు చూడక తప్పదని ప్రపంచంలోని లాటిన్‌ అమెరికా, యూరప్‌ ఖండాల పరిణామాలు ఋజువు చేస్తున్నాయి. దీనికి ధీటుగానే దేశీయంగా ప్రస్తుత మతోన్మాద పాలకుల చర్యలను, ప్రపంచబ్యాంకు విధానాలు నెత్తినెక్కించుకున్న నేతల తలరాతలను మార్చాల్సింది కూడా భగత్‌సింగ్‌ వారసులుగా నేటి యువతరమే. విద్యను కాషాయీకరణ దిశగా, చరిత్రను వక్రభాష్యాలు అద్దించడానికి ప్రయత్నిస్తున్న ఉన్మాద చర్యలను అనునిత్యం ఎదిరించాలి. దేశ సంపదను కొల్లగొట్టే చర్యలపై ఒక కన్నేసి ఉంచాలి. అందరికీ విద్య, ఉపాధి సాధన తక్షణ కర్తవ్యంగా ఉంటూనే, దేశ సంపదను ప్రజలందరికీ చెందేలా ఉవ్వెత్తున ఉద్యమించడమే భగత్‌సింగ్‌ లాంటి విప్లవ కిశోరాలకు మనమిచ్చే నిజమైన నివాళి. ఆయన త్యాగాన్ని వృథా కానీయకుండా ఈ దేశానికి ఒక దశ, దిశ నిర్దేశించే విధంగా ఈ 109వ జయంతి రోజున యువత ప్రతినబూనాలి. 
- వివి శ్రీనివాసరావు
(వ్యాసకర్త డివైఎఫ్‌ఐ విశాఖ జిల్లా కార్యదర్శి)