'బ్రాండిక్స్‌' వైఖరిపై భగ్గుమంటున్న మహిళా కార్మికులు

( visakha rural) ;   బ్రాండిక్స్‌ యాజమాన్యం మహిళలు పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కార్మికులు ఉద్యమించారు. చాలీచాలని వేతనాలతో సంవత్సరాలు తరబడి పనిచేస్తున్నప్పటికీ నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని బ్రాండిక్స్‌ మెయిన్‌ గేట్‌ వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. పిఎఫ్‌, గ్రాట్యూటీ, జీతాల పెంపు వంటి సమస్యలను పట్టించుకోలేదన్నారు. కార్మికశాఖ అధికారులు యాజమాన్యానికి తలొగ్గారన్నారు. పలు పర్యాయాలు జీతాలు పెంచాలని డిమాండ్‌ చేసిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం మొండి వైఖరి నశించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. టార్గేట్ల పేరుతో రోజురోజుకు పనిభారం పెంచుకుంటూ పోతున్నారని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులలో, క్యాంటిన్‌లో, మలమూత్ర విసర్జన సమయాలలో వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. జీతాలు పెంచాలని, పిఎఫ్‌, గ్రాట్యుటీ అమలు చేయాలని, వేధింపులు, టార్గేట్లను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఒక సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలమంచిలి సర్కిల్‌ ఇన్‌స్పెక్టరు వెంకటరావు సిబ్బందితో వచ్చి శాంతిభద్రతలను పర్యవేక్షించారు.
                            మహిళల ఆందోళనకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.రమేష్‌ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా మహిళలతో వెట్టిచాకిరి చేయించడంలో బ్రాండిక్స్‌ ముందంజలో ఉందని చెప్పారు. కార్మికుల రక్తాన్ని తాగేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.