బ్రాండిక్స్‌ వద్ద రాత్రంతా ఉద్రిక్తత

visakha rural

- నిద్రహారాలు మాని ఆందోళన కొనసాగించిన మహిళలు
- బెదిరింపులకు దిగిన యాజమాన్యం
- తాగునీరు నిలుపుదల
- భారీగా పోలీసు పికెట్‌ 
- అయినా వెనక్కు తగ్గని కార్మికులు
- ఈ నెలాఖరు వరకూ గడువు కోరిన మేనేజ్‌మెంట్‌ ఆందోళన తాత్కాలిక విరమణ

సుమారు 3 వేల మంది మహిళా కార్మికులు. వీరిలో శుక్రవారం ఉదయం 4 గంటల షిఫ్ట్‌కు హాజరైన వారు ఉన్నారు. ఇంటి దగ్గర పిల్లలు ఉండిపోయారు. తిండీ తిప్పలు లేవు. అయినా వారి పట్టుదల ముందు అవేవీ కనిపించలేదు. అతి తక్కువ జీతాలిస్తూ తమ చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్న, వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్న బ్రాండిక్స్‌ యాజమాన్యంపై ఎక్కుపెట్టిన పోరాట బాణాన్ని వారు కిందకు దించలేదు. రాత్రంతా తమ ఆందోళనను కొనసాగించారు. ఈ క్రమంలో యాజమాన్య ప్రతినిధులు బెదిరింపులకు దిగారు. తాగునీటిని నిలుపుదల చేశారు. జిల్లాలోని మొత్తం పోలీసు బలగాలను దించారు. అయినా వారు వెనక్కు తగ్గలేదు. చివరికి యాజమాన్యం దిగొచ్చి సమస్య పరిష్కారానికి ఈ నెలాఖరు వరకూ గడువు కోరింది. దీంతో మహిళా కార్మికులు తాత్కాలికంగా ఆందోళనను విరమించారు.
తమకు జీతాలు పెంచాలని, పిఎఫ్‌ చెల్లించాలని, వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం బ్రాండిక్స్‌ కంపెనీ ఎదుట మహిళా కార్మికులు భారీగా ఆందోళనకు దిగిన విషయం విధితమే. అయితే ఆర్‌డిఒ పద్మావతి యాజమాన్యం, కార్మిక ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదు. దీంతో కార్మికులు రాత్రంతా నిద్రహారాలు మాని పట్టుదలతో ఆందోళనను కొనసాగించారు. ఈ క్రమంలో యాజమాన్యం ప్రతినిధులు బెదిరింపులకు దిగారు. తాగునీటిని నిలుపుదల చేశారు. అయినా వారు వెనక్కు తగ్గలేదు. ఎడిసి పాండా, ఆర్‌డిఒ పద్మావతి, ఎఎస్‌పి, తహశీల్దారు, పోలీసు అధికారులు కంపెనీలోపలే ఉన్నారు. తాము తిండీతిప్పలు మాని ఆందోళన చేస్తుంటే కనీసం పట్టించుకోకుండా, తాగునీరు కూడా ఇవ్వకుండా చేస్తారా అంటూ కార్మికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో కంపెనీ వద్ద తీవ్ర ఉద్రికత్త నెలకొంది. తెల్లవారిని తరువాత జిల్లాలోని అన్ని స్టేషన్ల నుంచి భారీగా పోలీసు బందోబస్తు దించారు. అయినా కార్మికులు వెనుకడుగు వేయలేదు. తమ డిమాండ్లపై యాజమాన్యం స్పందించే వరకూ ఆందోళన విరమించేది లేదని మహిళా కార్మికులు స్పష్టం చేశారు. తమపైనున్న సూపర్‌ వైజర్లకు ఎంత మేరకు జీతాలు పెంచుతున్నారో అదే రీతిలో కార్మికులకు కూడా పెంచాలని వారు డిమాండ్‌ చేశారు. పిఎఫ్‌ సొమ్ము తమ అవసరాలకు తగ్గట్టుగా చెల్లించాలని పట్టుబట్టారు. దీంతో యాజమాన్యం దిగొచ్చింది. కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు ఈ నెలాఖరు వరకూ గడువు కావాలని యాజమాన్య ప్రతినిధులు కోరారు. ఈ నెల 22 నుంచి 30 లోపు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్ల దృష్టికి కార్మికుల సమస్యలను తీసుకెళ్తామని, అంత వరకూ ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన కార్మికులు అంత వరకూ తాము పనిలోకి వచ్చేది లేదని, ఈ కాలంలో జీతాల చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అందుకు అంగీకరిస్తూ రాతపూర్వకంగా యాజమాన్యం ప్రతినిధులు హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు తాత్కాలికంగా ఆందోళనను విరమించారు.
జీతాలు పెంచే వరకూ పోరాటం ఆగదు : సిఐటియు
బ్రాండిక్స్‌ యాజమాన్యం కార్మికులకు జీతాలు పెంచే వరకూ పోరాటం ఆగదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.రమేష్‌ తెలిపారు. కార్మికులకు వెంటనే జీతాలు పెంచాలని, పాత పద్ధతిలోనే పిఎఫ్‌ చెల్లించాలని, కార్మికులపై వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. బ్రాండిక్స్‌ యాజమాన్యం ఎంఎన్‌సి కంపెనీ వలే కాకుండా చిల్లర బట్టల కొట్టు మాదిరిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం రూ.10,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సూపర్‌ వైజర్లకు, ఆ పైతరగతులకు వేలల్లో జీతాలు పెంచి మిషనిస్టులకు వందల్లో జీతాలు పెంచడం దారుణమన్నారు. 30లోపు సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రొంగలి రాము, జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రి అప్పారావు, సిఐటియు మండల నాయకులు కూండ్రపు సోమునాయుడు, గంగరాజు, దేముడునాయుడు తదితరులు పాల్గొన్నారు.