బ్రాండిక్స్‌ నిర్బంధంపై చేతులకు సంకెళ్లతో వినూత్న నిరసన

  (visakha rural)          అచ్యుతాపురం బ్రాండిక్స్‌ కార్మికులపై యాజమాన్యం, ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని, వారి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన సోమవారం అడ్డురోడ్డు కూడలి వద్ద చేతులకు సంకెళ్లు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం బ్రాండిక్స్‌ యాజమాన్యానికి తొత్తుగా మారారని విమర్శించారు. బ్రాండిక్స్‌ కార్మికులకు మద్దతు తెలిపిన సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించడం దారుణమన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.అప్పలరావు మాట్లాడుతూ కార్మికుల శ్రమను దోచుకుంటున్న బ్రాండిక్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కార్మికులను భయాందోళనకు గురి చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు డేవిడ్‌రాజ్‌, అర్జునరావు, గద్దే కృష్ణ, సమ్మెంగి నానాజీ, బొండా సత్తిబాబు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. 
నోటికి నల్లగుడ్డలు కట్టుకొని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన
           బ్రాండిక్స్‌ కార్మికులపై పోలీసుల నిర్బంధాన్ని నిరసిస్తూ సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద నోటికి నల్లగుడ్డలకు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్‌ కన్వీనర్‌ జి.నాయనిబాబు మాట్లాడుతూ కనీస వేతనాలు రూ. 10 వేలు ఇవ్వాలని, పిఎఫ్‌ను ఆంక్షలు లేకుండా పాతపద్ధతిలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. 30వ తేదీ నాటికి కార్మికుల సమస్యలు తీరుస్తామని చెప్పి, పోలీసుల ద్వారా అణచివేతకు పూనుకోవడం కోవడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం, పోలీస్‌ యంత్రాంగం కార్మికుల సమస్యల పరిష్కరించకపోగా యాజమాన్యానికి కొమ్ముకాయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రేమ చంద్రశేఖర్‌, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న, ఉపాధి మేట్ల సంఘం జిల్లా కార్యదర్శి మట్టా రమణ, ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి సత్యనారాయణ, ఆర్‌.వెంకట లక్ష్మి, కె.భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు.