బ్రాండిక్స్‌ కార్మికుల సమస్యలపై రాష్ట్రస్థాయిలో పోరాటం

              కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తామని వామపక్ష నాయకులు స్పష్టం చేశారు. బ్రాండిక్స్‌ కార్మికులకు మద్దతుగా బుధవారం అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట, హరిపాలెం, పూడిమడక గ్రామాల్లో వారు పర్యటించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ముఖ్యమంత్రి ఏజెంటుగా పని చేస్తున్నారని, జీతాలు పెంచమంటే నాలుగైదు నెలలు పడుతుందని చెబుతున్నారని తెలిపారు. పోలవరం కాలువకు సంబంధించి జిఒల కంటే ఎక్కువగా బిల్లులు ఇచ్చారని, కాని ఇక్కడ మహిళా కార్మికులకు జీతాలు పెంచడానికి జిఒల పేరుతో తప్పించుకుంటున్నారని విమర్శించారు. విధులకు వెళ్లిన మహిళలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. 3,000 మంది మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామని వారితో ఒప్పందం కుదుర్చుకొని ఆ నాడు బ్రాండిక్స్‌ యాజమాన్యం పైపులైన్‌ వేసిందని, ఉపాధి కల్పించకుండా ఒక్కో మత్స్యకార కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఇచ్చి చేతులు దులుకుందని విమర్శించారు. పైపులైన్‌ ద్వారా రసాయనిక వ్యర్థాలు సముద్రంలో విడిచిపెట్టడం వల్ల మత్స్య సంపద నాశనమై చేపలు దొరకడం లేదని తెలిపారు. 
              సిపిఐ రాష్ట్ర సహయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ సంఘం ఏర్పాటు చేసి ఐక్యంగా, సమిష్టిగా ప్రభుత్వం, యాజమాన్యంతో పోరాడాల్సి ఉందన్నారు. ఏప్రిల్‌ 30న ఒప్పందం మేరకు చర్చలకు వెళ్తున్న మహిళలపై దాడులు చేయించడం విచారకరమన్నారు. విదేశీ కంపెనీల పరిరక్షణ పట్ల చూపుత్ను శ్రద్ధ మహిళా కార్మికులపై చూపకపోవడం దారుణమన్నారు. రూ.10వేలు జీతం ఇవ్వడం యాజమాన్యానికి కష్టమేమీ కాదని, ఇవ్వడానికి యాజమాన్యం సిద్ధపడినా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని విమర్శించారు. 
              సిపిఐ న్యూ డెమోక్రసీ కొండయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి తమ ప్రజలను వదిలేసి శ్రీలంక కంపెనీకి అనుకూలంగా పని చేయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేలకు భారీగా వేతనాలు పెంచి, కార్మికులకు వేతనాలు పెంచాలంటే జిఒలు అడ్డువచ్చాయా అని ప్రశ్నించారు. సిపిఐఎంఎల్‌ నాయకులు గణేష్‌ పాండా మాట్లాడుతూ మహిళా కార్మికుల పట్ల పోలీసులు పైశాచికంగా వ్యవహరించడం దారుణమన్నారు. సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు కె.లోకనాథం, స్టాలిన్‌ మాట్లాడుతూ కర్ణాటక, మద్రాసు గార్మెంట్స్‌లో పని చేసే కార్మికులు ఇక్కడ కన్న ఎక్కువ వేతనాలు పొందుతున్నారని తెలిపారు. మహిళలపై జరిగే దాడులకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. ఈ పర్యటనలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.బాలకృష్ణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.రమేష్‌, ఉపాధ్యక్షులు రొంగలి రాము, ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రి అప్పారావు, ఎపి మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొవిరి అప్పలరాజు, నిర్వాసితుల సంఘం నాయకులు బుద్ద రంగారావు, కె రామసదాశివరావు, కూండ్రపు సోమునాయుడు, శరగడం రామునాయుడు, సిపిఐ నాయకులు ఎంఎ మాధవరావు, మత్స్యకార నాయకులు చోడపిల్లి అప్పారావు, చేపల తాత, పి రాములమ్మ, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.