బెంగాల్లో స్థానిక నేతలు Vs స్టార్స్

ఎన్నికల దగ్గరకొచ్చేకొద్దీ అన్ని పార్టీలూ స్టార్లను రంగంలోకి దింపుతుంటే సిపిఐ(యం) మాత్రం స్థానిక నేతలకు ప్రాధాన్యతనిస్తోంది. స్టార్లూ వర్సెస్‌ స్థానిక నేతలుగా ప్రచారం సాగుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ సినీ, క్రీడా తారలకు ప్రాధాన్యతనిస్తుండగా... బి.జె.పి, కాంగ్రెస్‌ లోకల్‌ నేతల కంటే జాతీయ నాయకుల వైపే మొగ్గు చూపుతున్నాయి. దీదీ ప్రచార బృందంలో రాజ్‌ చక్రవర్తి, సోహమ్‌ చక్రవర్తి, మిమి చక్రవర్తి, శ్రీకాంతో మెహతా, హిరన్‌ చటర్జీ, యష్‌ దాస్‌ గుప్తాతో పాటు ఫుట్‌ బాల్‌ ఆటగాడు బైచుంగ్‌ భుటియా వంటి స్టార్‌ ప్రచారకులూ వున్నారు. సిపియం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీనియర్‌ నేత ప్రకాష్‌ కరత్‌, బృందా కరత్‌, త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌ ప్రచారంలో వున్నప్పటికీ... ప్రధానంగా పార్టీ జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య ఆరోగ్య కారణాలరీత్యా ప్రచారంలో చురుగ్గా పాల్గొనలేకపోవడంతో సూర్యకాంత్‌ మిశ్రా ఆ పార్టీ  ప్రచారకులయ్యారు.