
రైల్వే ప్రయాణీకులకు కావల్సింది బుల్లెట్ రైళ్లు కాదని, ప్రయాణంలో వారికి భద్రత కల్పించాలని అని సిపిఎం పొలిట్‌బ్యూరో కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికింది. మంగళవారం అర్ధరాత్రి మధ్యప్రదేశ్‌లోని జరిగిన జంట రైలు ప్రమాదాలపై పొలిట్‌బ్యూరో దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. రైల్వేలలో తరచు జరుగుతున్న ఈ ప్రమాదాలలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా రైల్వే శాఖ పరిస్థితులపైన, భద్రతా ప్రమాణాలపైన ప్రభుత్వం ఇంకా కళ్లు తెరవటం లేదని, షరామామూలుగా భద్రతా కమిషనర్‌తో కంటితుడుపు దర్యాప్తునకు ఆదేశాలుజారీ చేసిందని విమర్శించింది. బుల్లెట్ రైళ్లు, హైస్పీడ్ రైళ్లు అంటూ పగటి కలలు కనటం మాని రైల్వే వ్యవస్థను గాడిన పెట్టి ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని, తక్షణమే ట్రాక్, సిగలింగ్ పరికరాలను ఆధునీకరించాలని డిమాండ్ చేసింది. ఈ విషాద ఘటనలో ఆప్తులను కోల్పోయిన వారికి సిపిఎం పొలిట్‌బ్యూరో తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసింది.