బీహార్‌ ఎన్నికలు నేర్పుతున్న పాఠాలు

రాజకీయ విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని మహా కూటమి ఘనవిజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు బిజెపికి ప్రత్యేకించి మోడీ, అమిత్‌ షాల నాయకత్వాలకు పెద్ద ఎదురు దెబ్బ. అన్నిటినీ మించి సంఘ పరివార్‌ దేశంపై రుద్దాలనుకున్న సనాతన, భూస్వామ్య సంస్కృతి, వారి అనాగరిక చర్యలకు ఇది బీహార్‌ ప్రజల సమాధానం. కులం, ఉప కులం పేరుతో ప్రజలను చీల్చాలనుకోవడం, ప్రజల్లోని భక్తి భావాలను రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే దృష్ట యత్నాలకు దీన్ని ప్రతిఘటనగా భావించవచ్చు. స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి పాత్రా లేని ఆరెస్సెస్‌, మహాత్మా గాంధీని హత్య చేసిన ఆరెస్సెస్‌, సంఘ పరివార్‌ ఫాసిస్టు పోకడలకు ఇది అడ్డుకట్ట. దేశభక్తి, జాతీయత, మతం వంటి ముసుగులను కప్పుకొని వారు ఆడిన కపట నాటకం బట్టబయలయింది. రచయితలు, శాస్త్రవేత్తలు, కళాకారులు, ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చేసిన బహిరంగ తిరుగుబాటు ఆరెస్సెస్‌ కళ్లు తెరిపించలేకపోయినా సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం తమ ఓటు ద్వారా సంఘీభావం తెలిపారు. రిజర్వేషన్లు ఎత్తివేసి సామాజిక న్యాయానికి తూట్లు పొడవాలనే వారి కుయుక్తులు చెల్లవని ప్రజలు తీర్పునిచ్చారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా బిజెపి విధానాలకు, మోడీ నాయకత్వానికి ప్రజలిచ్చిన తీర్పు ఇది. గత దశాబ్దకాలంలో బీహార్‌లో జరిగిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలకు ఈ మార్పు అద్దం పడుతోంది. అందువల్లనే బిజెపి సోషల్‌ ఇంజనీరింగు పని చేయలేదు. అన్ని కులాలు, మతాల్లోని పేదలు దాన్ని సంపన్నవర్గాల పార్టీగా భావించారు. 
ఈ ఫలితాల అనంతరం మీడియాలో రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులు స్పందించారు. వీటిని విశ్లేషించి చూస్తే కొన్ని అంశాలు మనకు అర్థమౌతాయి. ఒకటి, మోడీ హిందూత్వ ఎజెండాను పక్కన పెట్టి ఆర్థిక సంస్కరణల ఎజెండాను ముందుకు తీసుకుపోవాలి. రెండు, ముఖ్యమైన బిల్లులు, చట్టాలు చేయడానికి అన్ని పార్టీల మద్దతును కూడగట్టడం. మూడు, బిజెపికి వ్యతిరేకంగా లౌకిక పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని సందేశం. ఈ అంశాలు చూడటానికి బాగానే అనిపించినా అంతర్లీనంగా బడా కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాలను కాపాడటం, ప్రజానుకూల ప్రత్యమ్నాయాన్ని రాకుండా నిరోధించడమనే ద్వంద్వ వ్యూహం దాగి ఉంది. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు కూడా దానికి అనుకూలంగానే వస్తున్నాయి. 
ఇది సెక్యులర్‌ శక్తుల విజయం అనటంలో సందేహం లేదు. కానీ అదే సమయంలో ప్రజల దైనందిక సమస్యలకు ప్రతిస్పందన కూడా. 2014 ఎన్నికల్లో మోడీ అభివృద్ధి మంత్రం పేరుతో ప్రజల ముందుకొచ్చారు. యువతకు ఉపాధి కల్పన చేస్తామని, నల్ల డబ్బు వెలికి తీసి అందరికీ పంచుతామని, అవినీతిని నిర్మూలిస్తామని, బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇలాంటివి ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు. అధికారానికి వచ్చి 500 రోజులు దాటుతున్నా ఇంతవరకు ఒక్క వాగ్దానాన్నీ నెరవేర్చలేదు. విదేశాలు పట్టుకొని బడా కార్పొరేట్‌ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయటం తప్ప సాధించిందేమీ లేదు. ఈ విషయాన్ని బీహార్‌ ప్రజలు, ప్రత్యేకించి యువతరం- ఎవరైతే 2014లో మోడీకి బ్రహ్మరథం పట్టారో వారే- నేడు అడ్డం తిరిగారు. మరోవైపు నితీశ్‌ కుమార్‌ గత పదేళ్లలో తీసుకొచ్చిన కొన్ని మార్పులు ప్రత్యేకించి గ్రామాలకు ప్రాథమిక సౌకర్యాల కల్పన, చదువుకునే ఆడపిల్లలకు సైకిళ్లు, పాలనా సంస్కరణలు, మాఫియా అరాచకాలను అడ్డుకొని శాంతిభద్రతలకు పెద్దపీట వేయటం, తదితర చర్యలు ప్రజలను ఆకట్టుకొన్నాయి. మోడీతో పోల్చుకుంటే నితీశ్‌ పాలనే మెరుగన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రజలకు ఆయనిచ్చిన వాగ్దానాలలో సంక్షేమ పథకాలకే పెద్దపీట వేశారు. బిజెపి అభివృద్ధి జపాన్ని వదిలేసి మతోన్మాద ఎజెండాను పట్టుకుంది. దానికి భిన్నంగా నితీశ్‌ ఆధ్వర్యంలో మహాకూటమి నిరుద్యోగులకు రెండు సంవత్సరాల పాటు నెలకు వెయ్యి రూపాయల చొప్పున భృతి ఇస్తామని, ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు, ప్రతి ఇంటికీ 24 గంటల కరెంటు, మంచినీరు, టాయిలెట్‌ నిర్మాణం, పక్కా రోడ్లు, మెడికల్‌, ఇంజనీరింగ్‌ ఉన్నత విద్యా సంస్థల స్థాపన వంటి ప్రజలను ఆకట్టుకునే నినాదాలు ఇచ్చారు. తమ వైఫల్యాన్ని గుర్తించిన బిజెపి ఎన్నికల ప్రకియ మొదలవ్వగానే రూటు మార్చి మతోన్మాద నినాదాలతో హిందువుల ఓట్లపై కన్నేశారు. అగ్ర కులాలను ఆకట్టుకునే వ్యూహలను పైకి తీసుకొచ్చారు. యావత్తు దేశాన్ని ఈ చర్చలోకి లాగింది. ఫలితంగా ప్రజల్లో విద్వేషాలు, ఘర్షణలు పెరిగాయి. అయినా బీహర్‌ ప్రజలు వీరి ఎత్తులకు లొంగలేదు. తమ జీవితాలను మెరుగుపరిచే అంశాలకే ఓటు వేశారు. 
ఈ వాస్తవాన్ని కార్పొరేట్‌ మీడియా కావాలనే దాచేస్తోంది. ఇది లౌకికత్వానికి ఇచ్చిన తీర్పు అంటూ బిజెపికి మెత్తగా మెట్టికాయలు వేసింది. మోడీ ఆర్ధిక విధానాలకు ఈ తీర్పు వ్యతిరేకం కాదని వాదిస్తోంది. మతోన్మాద ఎజెండాను పక్కన పెట్టి సంస్కరణలు వేగవంతం చెయ్యమని మోడీకి హితబోధ చేస్తోంది. ఏ సంస్కరణలైతే ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేశాయో, నిరుద్యోగాన్ని పెంచాయో, రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యాయో వాటినే అమలు చెయ్యమని కోరుతోంది. కాంగ్రెస్‌ను, నితీశ్‌ కుమార్‌ను కూడా ఈ విధానాల అమలుకు మోడీతో సహకరించమంటోంది. ఇటు నితీశ్‌, అటు కాంగ్రెస్‌, మధ్య ఉన్న మహాకూటమి అందరూ ఒక్కటై సంస్కరణలను బలపరిస్తే తమ లాభాలకు ఢోకా ఉండదని వారి భరోసా. అందుకోసమే లౌకిక పార్టీలన్నీ ఒక్కటి కావాలని ముందుకు తోస్తోంది. తద్వారా సంస్కరణలకు ప్రతిఘటన లేకుండా చేయాలన్నది వారి ప్రయత్నం. 
బీహార్‌ ఎన్నికల్లో బిజెపి, మహాకూటములకు ప్రత్యామ్నాయంగా ఆరు పార్టీలతో కూడిన వామపక్ష కూటమి దాదాపు అన్ని సీట్లకూ పోటీ చేసింది. ఈ మహాయజ్ఞంలో మొదటిసారి వామపక్షాలన్నీ కలసి పోటీ చేశాయి. 3.5 శాతం ఓట్లతో మూడు స్థానాలు (ఎంఎల్‌ లిబరేషన్‌) గెల్చుకొన్నాయి. గత అసెంబ్లీలో వామపక్షాలకు ఒక్క సీటే (సిపిఐ) ఉంది. 2010 కన్నా ఓట్లు కూడా పెరిగాయి. ఇంత ఒత్తిడిలో కూడా స్వతంత్రంగా తమ ఉనికి కాపాడుకోవడమే కాకుండా ఈ రెండు కూటములకు విధానపరమైన సవాలు విసిరింది. ఒక్క విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇంత గాలిలో కూడా 24 శాతం ఓటర్లు రెండు కూటములకు కాకుండా వామపక్షాలకు సహా ఇతరులకు ఓటేశారు. మహాకూటమికి 42, బిజెపి కూటమికి 34 శాతం వచ్చాయి. ఈ ఫ్రంట్‌ ఇలానే కొనసాగితే ప్రజల్లో మరింత విశ్వసనీయతను పెంచుకోగలదనటంలో సందేహం లేదు.
ఈ విజయం తరువాత నితీశ్‌ కూమార్‌ ముందు అనేక సవాళ్లు నిలిచాయి. కార్పొరేట్‌ శక్తులకు అనుగుణంగా సంస్కణలు అమలుచేస్తూ, ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల వాగ్దానాలను అమలుచేయడం అంత సులభం కాదు. ఇప్పటికే అధిక ధరలు, నిరుదోగ్యం, అవినీతి, వ్యవసాయ సంక్షోభం వంటి సమస్యలతో సతమతమౌతున్న జనం అదనపు వనరుల సమీకరణ పేరుతో పన్నుల భారాన్ని మోయలేరు. గత పాలనలో అందరికీ భూములు పంచుతానని తరువాత భూస్వాముల ఒత్తిళ్లకు లొంగి ఆ ఎజెండాను పక్కకు పెట్టేశారు. తనే నియమించిన బంధోపాధ్యాయ కమిటీ నివేదికను చెత్త బుట్టపాలు చేశారు. ఏక కాలంలో భూస్వాములకు, పేదలకు న్యాయం చేయాలనుకోవడం సాధ్యం కాదు. రేపు ప్రజల్లో వచ్చే అసంతృప్తిని బిజెపి వాడుకొని బలపడదన్న గ్యారంటీ లేదు. లౌకికవాదం పేరుతో వామపక్షాలు నితీశ్‌ కుమార్‌ లేదా అలాంటి పార్టీల సరసన చేరితే మరలా బలపడేది బిజెపినే. అందువల్ల బిజెపి బలపడకుండా ఉండాలన్నా, లౌకికవాదం బలమైన పునాదిపై నిలబడాలన్నా ముందు వామపక్షాలు బలపడాలి. అందుకే బీహార్‌లో వెంటనే ఒక రాజకీయ శక్తిగా కనబడకపోయినా స్వతంత్రంగా పోటీ చేశాయి. ఈ ప్రయత్నం సంతృప్తికరమైన ఫలితాలనే ఇచ్చింది. వామపక్షాలు విడిగా పోటీ చేస్తే బిజెపికి లాభం చేకూరుతుందనే వాదన తప్పని తేల్చింది. విశాఖపట్నంలో జరిగిన సిపిఎం మహాసభల సరికొత్త రాజకీయ ఎత్తుగడలను బీహార్‌ అనుభవం ధృవపర్చింది.
బిజెపి మతోన్మాద ఎత్తులను చిత్తు చెయ్యాలంటే ప్రజల దైనందిన సమస్యలపై కూడగట్టి బిజెపి కుతంత్రాలకు ఎదురు నిలవాలి. ఆ పని జెడియు లాంటి ప్రాంతీయ పార్టీలు చెయ్యలేవు. కాంగ్రెస్‌ అసలే చెయ్యదు. బిజెపి నాయకుడు అరుణ్‌ శౌరి అన్నట్లుగా మనోహ్మన్‌ సింగ్‌ ప్లస్‌ ఆవు కలిస్తే మోడీ. అంటే దీని అర్థం మోడీ, మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక విధానాలు ఒక్కటేనని (మతోన్మాదంలో తప్ప.). ప్రజలకు గొడ్డు మాంసం తినడం హాబీ కాదు, అవసరం. దళితులు, ముస్లింలు లాంటి పేదవారు గొడ్డుమాంసం తినడం ద్వారానే శరీరానికి ప్రొటీన్లు సమకూర్చుకొని బతుకుతున్నారు. లేదంటే ఇలాంటి ఆదిమ కులాలు ఎప్పుడో అంతరించిపోయేవి. గొడ్డు మాంసం తిన్నవారిపై దౌర్జన్యాలు సాగిస్తున్న బిజెపి, వారి పరివారం ప్రత్యామ్నాయంగా పప్పులు కూడా అందుబాటులో లేకుండా కిలో రెండు వందలకు పెంచేసింది. చౌకగా వచ్చే గొడ్డు మాంసం తినొద్దు, పప్పుల ధరలు పెంచేసి అందుబాటులోకి రానివ్వం అనటం ద్వారా బిజెపి ఏం సాధించదల్చుకుందో అర్థమౌతుంది. ఇది మత సమస్య కాదు, ప్రజల దైనందిన సమస్య. అలాగే రిజర్వేషన్లు కూడా. మేము ఉద్యోగాలు ఇవ్వం, రిజర్వేషన్లు కల్పించం అన్నదే వారి అంతరంగం. కార్పొరేట్‌ సంస్థల ప్రాపకం కోసం కార్మిక చట్టాలను సవరించడం, విదేశీ పెట్టుబడులకు స్వేచ్ఛనివ్వటం, పేదవారి భూములను బలవంతంగా గుంజుకొని కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టడం, ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడం, ఇవన్నీ వారి విధానాలు. వీటిపై పోరాడేందుకు ప్రత్యామ్నాయ వేదిక లేకుండా బిజెపి లాంటి మతోన్మాద పార్టీని ఎదుర్కోలేము. అందుకే వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత అవశ్యమని సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకతను బీహార్‌ ఎన్నికల ఫలితాలు మరోసారి రూఢ చేస్తున్నాయి.
- వి శ్రీనివాసరావు
(వ్యాసకర్త సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు)