బిజెపి రెండేళ్ల పాలనలో సాధించింది శూన్యం

గత ప్రభుత్వం కంటే భిన్నంగా పరిపాలిస్తామని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన బిజెపి.. తన రెండేళ్ల పాలనలో వైఫల్యాలు తప్ప సాధించిందేమీ లేదని, ప్రజలపై మరిన్ని భారాలు మోపుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లలో దేశ ఎగుమతులు 15 శాతం తగ్గి దిగుమతులు పెరిగాయన్నారు. బుడగ మాదిరి ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు బద్దలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని సాక్ష్యాత్తు ఐక్యరాజ్య సమితే తన నివేదికలో పేర్కొందన్నారు. జిడిపి వృద్ధిరేటు విషయంలో కేంద్రం పచ్చి అబద్దాలు చెబుతోందని, అన్ని రంగాల్లో రెండు శాతమే వృద్ధి ఉంటే జిడిపి ఏడు శాతం ఉందని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంతో పోలిస్తే 40 లక్షల టన్నుల మేర ధాన్యం దిగుబడి తగ్గిందని, పారిశ్రామిక అభివద్ధీ ఏమీ లేదన్నారు. రెండేళ్లలో 1.35 కోట్ల మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే 1.30 లక్షల మందికే కేంద్రం ఉద్యోగాలిచ్చిందని వివరించారు. కీలక రంగాల్లో వంద శాతం విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించటం బిజెపి దివాళాకోరు విధానాలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు రాజధాని సెంటిమెంట్‌ను ఆధారం చేసుకుని మభ్యపెడుతూ ప్రజాసమస్యలను పట్టించుకోవట్లేదని విమర్శించారు. వేలాది ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లను మూసేస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని పిలుపుని చ్చారు. దళితుల శ్మశాన వాటికలు, ఉపాధి హామీ కూలీల సమస్యలపై పోరాడాలన్నారు.