బిజెపి దిగజారుడుతనం

కాదేదీ విద్వేషానికి అనర్హం అని గట్టిగా భావించే బిజెపి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సైతం దీనికి వాడుకోవాలని చూడడం జుగుప్సాకరం. యోగా డే వేడుకల్లో ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఎందుకు పాల్గొన లేదో సమాధానమివ్వాలని బిజెపికి డెప్యుటేషన్‌పై వచ్చిన ఆరెస్సెస్‌ ప్రచారక్‌ రామ్‌ మాధవ్‌ ట్విట్టర్‌లో ప్రశ్నించడం, ఆయన లేకితనాన్ని బయటపెట్టింది. ఆయన ట్వీట్‌కు మద్దతుగా సంఫ్‌ు పరివార్‌ సైబర్‌ యోధులూ విజృంభించడంతో ఆ వార్త క్షణాల్లో దేశమంతటికీ పాకింది. ఇది నిజమే కాబోలు అని అనుకునేలా ఈ గోబెల్స్‌ ప్రచారం సాగింది. యోగాను శారీరక, మానసిక సామర్థ్యాన్ని పెంపొందించే ఒక వ్యాయామ ప్రక్రియగా కాక, హిందూత్వ ప్రాజెక్టుగా సంఫ్‌ు పరివార్‌ చూడడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ యోగాను వ్యాపారమయం చేస్తుండడంపై బోలెడంత ఆవేదన వ్యక్తం చేశారు. మంచిదే. కానీ, ఆ యోగాను తన సొంత పార్టీవారే హిందూత్వ ప్రాజెక్టుగా మార్చి, అనవసరపు రాద్ధాంతం సృష్టిస్తుంటే ఇది తప్పు అని మోడీ చెప్పలేకపోవడం ఆయన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. దేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరుడు అయితే, ఆయన తరువాత అంతటివాడు ఉప రాష్ట్రపతి. అటువంటి గౌరవనీయ స్థానంలో ఉన్న వ్యక్తిని ఇటువంటి విద్వేషపూరిత రాజకీయాల రొంపిలోకి బిజెపి, సంఫ్‌ు పరివార్‌ లాగాలని చూశాయి. ఈ యత్నాలు తమకే ఇలా ఎదురుతంతాయని వారు ఊహించలేకపోయారు. బిజెపి చేసిన విమర్శకు ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందిస్తూ ప్రభుత్వం ఆహ్వానించనందునే ఆయన ఈ ఉత్సవాల్లో పాల్గొనలేదని స్పష్టం చేసేసరికి బిజెపి, ప్రభుత్వం రెండూ ఇరకాటంలో పడ్డాయి.