బిజెపి కుహనా ఆధ్యాత్మికత..

నిషేధం, దుందుడుకు ధోరణులు, ఆజ్ఞలు, మూసివేతలు లాంటివి సహనస్ఫూర్తినీ లేదా మన రాజ్యాంగాన్ని ప్రతిధ్వనిం చవు. అసహన రాజకీయాలకూ, సహన సిద్ధాంతాన్ని ప్రవచించే జైన మత ఆచారాలకు ముడిపెట్టడం హాస్యాస్పదం. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చే చిన్నచిన్న వార్తలన్నింటినీ పాఠకులు కలిపి చూడాలి. జైనులు ఆచరించే పర్యూషన్‌ (ఉపవాసదీక్ష వేడుక) సందర్భంగా మాంసం విక్రయంపై విధించిన నిషేధానికి సంబంధించి పత్రికలలో వచ్చిన కథనాల తీరు నన్ను బాగా ఆందోళనకు గురిచేసింది. బిజెపి కార్యక లాపాలు ఎవరినీ నొప్పించని విధంగా సున్నితం గా ఉన్నాయని వ్యాఖ్యాతలు విశ్లేషించారు. మెజారిటీ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే బిజెపికి తప్పని పరిస్థితి అని మరో వ్యాఖ్యాత అన్నారు. మైనారిటీ ప్రజలపై బిజెపి దండు దాడులను కొనసాగించ వచ్చునన్న భానవ దానిలో ఉంది. ఎద్దు కొమ్ములను కత్తిరించాల్సిన సమయం ఇదేనని నేను భావిస్తు న్నాను. అలాగే బిజెపిది కుహనా ఆధ్యాత్మికత అని చెప్పదలచుకున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం ఎల్‌కె అద్వానీ 'బూటకపు లౌకికవాదం' అని నిందించి గట్టి దెబ్బే తిన్నారు. ఇప్పుడు బిజెపి, దాని ఉపాంగాలు ప్రవచించే మెజారిటీ మత భావనలను ప్రతిఘటించవలసిందే. జైనుల ఉపవాసదీక్ష సమయం, నిషేధం విధించిన సందర్భం ఒకటే కావడం కూడా కుట్రే. బిజెపి, దాని వందమాగధులు తరచుగా నిర్ణయాలు చేసి ఔరంగజేబు, శివాజీ, రాణాప్రతాప్‌, వలసపాలనలాంటి వాటిని ఉదహరిస్తుం టారు. ఏ చారిత్రక సమయంలో బిజెపి పనిచేస్తున్నదని ఆశ్చర్యం వేస్తుంది. అది మొఘలుల దుష్పరిపాలనకు స్పందిస్తుందా లేక ప్రస్తుతం అన్యాయాన్ని సరిదిద్దుతుందా!
విశ్వాసం విస్మరణ
విశ్వాసానికి సంబంధించిన అంశాలను, విశ్వాసం వెనుక గల తర్కాన్ని బిజెపి తీవ్రంగా తీసుకోదు. అదే విచారకరమైన విషయం. మార్కెటింగ్‌ ఏజెన్సీల వలే విశ్వాసానికి సంబంధించిన అంశాలను పరిశీలించకుండానే ప్రవర్తనను నియంత్రించాలనేది బిజెపి లక్ష్యం. గొప్ప సహన భావజాలాల్లో జైన మత గ్రంథ సూత్రాలూ ఉన్నాయి. జైనులు సంతార నాటి నుంచి ఉపవాస దీక్ష వరకు తమ వల్ల ఇతరులకు తక్కువ నష్టం ఉండాలన్న లక్ష్యంతో నోటికి పలుచటి గుడ్డను కట్టుకుంటారు. జైనుల 'పింజ్రాపోల్స్‌' (ఆశ్రయాలు) ముసలి పశువులకు చివరకు యజమానులు పోషించలేని లేదా ప్రకృతి విపత్తుల సమయాలలోని పశువులకు ప్రధాన కేంద్రాలుగా ఉంటాయి. జైనులలో సహనం అనేది పైకి చెప్పే మాట లేదా పైమెరుగులాంటి క్రతువు కాదు. అది వారి మతంలో అంతర్భాగంగా ఉంటుంది.
విపరీతం ఏమంటే బిజెపి విధించిన నిషేధం అసహన వాతావరణాన్ని, వివాదాన్ని సృష్టించాయి. బిజెపి తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా ప్రతి సంవత్సరం కొన్ని అంశాలను లేవనెత్తి, వాటికి గుర్తింపునిచ్చి విభేదాలను సృష్టిస్తుంది. విశ్వాసానికి గల ప్రామాణికతను గౌరవించేందుకు బదులు ఎన్నికల జిమ్మిక్కుగా ఇలా ఆ పార్టీ వ్యవహరిస్తుంది. జైనులు అనుసరించే సహన మార్గం ఆలోచింపదగింది. ఉపవాస దీక్షలు, ధ్యానం లాంటి వాటితోపాటు తమలో సమభావాన్ని, నిర్వికారతను కోరుకుంటారు. పర్యూషన్‌ పండుగ క్షమకు చిహ్నం. ఈ గుణం తోటి మానవులలోనే కాదు, చైతన్యమున్న జీవులన్నింటిలోనూ ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి దృక్పథం ఉన్నవారు ఇతరుల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుంటారు, ఇతరులు ఆచరించే ఆచార వ్యవహారాలను నిషేధించాలని గానీ లేదా వారిని హింసించాలని గానీ కోరుకోరు. 
ఈ జీవన విధానంతో ఇతర మానవుల పట్లనే కాదు, వారి ఆహార విహారాలపైన కూడా చాలా దయగా ఉంటారు. మాంసం విక్రయంపై నిషేధం రాజకీయం. జైనులనే విభ్రాంతికి గురిచేసింది. నిషేధం భావన, దుందుడుకు ధోరణులు, ఆజ్ఞలు, మూసివేతలు, సహన స్ఫూర్తిని ప్రతిధ్వనించవు. సహన తాత్వికత అసహన రాజకీయాలలో చిక్కుకుపోవడం విచారకరం. నిజమైన విశ్వాసమున్న వారు ఇలాంటి అస్పష్టతలు కలిగి ఉండరు. ఆధ్యాత్మిక నియమాలను నెరవేర్చుకునేందుకు ఒక మతం మరో మతంపై హింసకు పాల్పడవలసిన అవసరం ఉందని నేను విశ్వసించను. వివాదాన్ని సృష్టించేందుకు ఒక మైనారిటీ మతాన్ని మరో మైనారిటీ మతంపైకి రెచ్చగొట్టింది. ప్రస్తుత మెజారిటీ మత రాజకీయాలలో ఇది బిజెపి ఆడిన బూటకపు ఆధ్యాత్మికత నాటకానికి నిదర్శనమని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.
బిజెపి పాలకులు విధించిన నిషేధం వాస్తవంగా ఆలోచించవలసిన అంశమేనని మానవ ఆహార వ్యవహారాలు, ఆచారాల అధ్యయనవేత్తలు భావిస్తున్నారు. ఆహార రాజకీయాలు, వర్గీకృత తరహా ఆలోచన మాత్రమేకాదు, వారసత్వ రాజకీయాలు కూడా. శాకాహారులకు ఎద్దు, ఆవు మాంసం అంటే గిట్టదు. అసహ్యించుకుంటారు. వాస్తవంగా ఇటీవల విధించిన నిషేధం నుంచి చేపలను మినహాయించారని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే కొలి జాతి ప్రజలకు చేపలు మహా ఇష్టం. ఈ జాతి ఓటర్లు ముంబయిలో శక్తివంతమైన ఓటింగ్‌ కలిగిన గ్రూపు. వారిని దూరం చేసుకోకుండా ఉండేందుకే చేపలను మినహాయించారని పరిశీలకులు తెలిపారు. ఎంతో వైవిధ్యం గల సమాజంలో ఆహారం గురించిన చర్చ విస్తృతంగా జరుగుతుందని ప్రభుత్వం ఆలోచించలేదు. భావాలను, సంకేతాలను పరస్పరం తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఏకపక్షంగా నిషేధం విధింపు భావన మెజారిటీ మత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాననుకొనే ప్రభుత్వం తన పోలీసింగ్‌ ధోరణిపై ఆలోచించాలి.
న్యాయపరమైన గందరగోళం
పూర్తిగా విధివిధానాలపై శ్రద్ధ వహించిన కోర్టులు తమ వంతు గందరగోళం సృష్టించాయి. స్వల్పకాలిక నిషేధాలు అంత సమస్యాత్మకం కాదంటూ కోర్టు తన ఉత్తర్వుల్లో సూచించడం ద్వారా న్యాయం కాస్త ఒక పక్కకు జరిగి పనిచేస్తోందని చెప్పవచ్చు. మొదటిసారి విధించిన ఈ నిషేధం జైన మతస్తుల విశ్వాసానికి, ఆచరణలకు సాధారణమైన చర్యగానే పరిగణించారనిపిస్తుంది. దీర్ఘకాలిక నిషేధాలు వారి జీవనోపాధిని దెబ్బతీస్తాయి. నిషేధం విధించిన రోజుల సంఖ్యను తరువాత పెంచవచ్చు. అదొక రాజకీయ క్రీడగా మారవచ్చు. ఎవరు ఎక్కువ కాలం నిషేధం విధించగలరనే పోటీ రాజకీయాలకు దారితీస్తుంది. అది కూడా అప్పుడప్పుడూ దశలవారీగా అమలుచేయడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. సుప్రీంకోర్టు తీర్పులోనూ ఏదో కొంత పొరపాటు ఉందనిపిస్తుంది. 
గుజరాత్‌లో నిషేధం చెప్పుకోదగినంత ఎక్కువ కాలం లేదనీ, అదీగాక, జైనుల గౌరవార్థం ఆ తొమ్మిది రోజులు మాంసాహారులు సైతం శాకాహారులుగానే ఉంటారనీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ వాదించారు. హక్కులు ఒక మతానికి చెందినవిగా ఈ వాదన ఉంది. అయితే నిషేధం విధించిన సందర్భం కోర్టుకు గల విశిష్ట హక్కుగా అనిపిస్తుంది. బిజెపి కుహనా ఆధ్యాత్మికత ప్రజలను కష్టాలుపాలు చేయడమే కాదు; అలాంటి ధోరణి రాజ్యాంగాన్ని కూడా బద్దలు కొడుతుంది. హక్కులు అంతర్భాగంగానే ఉండాలి. వాస్తవంగా ఎలాంటి పవిత్ర భావన లేకపోయినా, హక్కులకు నెమ్మది నెమ్మదిగా చాపకింద నీరులాగా చేస్తున్న హానిని నిలువరించడం సాధ్యమా! రాజ్యాంగం, మత గ్రంథాలు అనుల్లంఘనీయ మైనవనీ, పవిత్రమైనవనే భావన ఉంది. అయితే బిజెపి పనులు దెబ్బతిన్న పైపు లైనుకు అతుకులు వేస్తున్నట్టుగా ఉన్నాయి. ఇది భవిష్యత్‌కు ఏమాత్రం మంచిదికాదు.
నగరాలలో పరిస్థితి
హక్కులు, ఆధ్యాత్మికత అలా ఉంచి నగరాల సంస్కృతిని గురించి ఆలోచించాలి. నగరం అనేక సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు జీవిస్తుంటారు. బహుళ మతాల వారుంటారు. సహజంగానే ఆహార అలవాట్లలో బహుళత్వం ఉంటుంది. జీవనోపాధిని వెతుక్కుంటూ వచ్చిన యువత అన్ని రంగాలలోనూ కలిసిమెలిసి ఉంటారు. నిషేధ రాజకీయాలు కేవలం జీవనోపాధికి ముప్పు కలిగించడమే కాదు, లౌకికతత్వమున్న నగరంలో బహుళ సంస్కృతులకూ ముప్పుగా పరిణమిస్తుంది. నగరాలు రాజ్యాంగపరంగా మాత్రమే కాదు, పౌరసమాజం కూడా ఆదర్శంగా ఉంటాయి. భిన్నాభిప్రాయాలను నగరం అనుమతిస్తుంది. నిషేధ రాజకీయాలు ఎన్నికలలో ప్రయోజనం పొందే రాజకీయ క్రీడలో భాగం. సంకుచిత నియంతృత్వానికీ దారితీసి నగరంలో కల్లోలం సృష్టిస్తుంది. హక్కులకు సంబంధించి కోర్టు కొద్దిగా నిర్లక్ష్యం వహించిందనిపిస్తోంది. ఈ అంశాన్ని నిర్ణయించాల్సింది మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేనో లేదా బిజెపినో కాదు. రాజ్యాంగం పరిధిలోవారు ప్రత్యేకం కాదు. దీన్ని ధిక్కరించి ఎన్నికలలో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించరాదు.
అంతేకాదు, నిషేధం తర్కం ఇతరులకూ నిర్నిరోధంగా పాకింది. దీంతో ఆయా రాష్ట్రాలు ఒక్కొక్క మతాన్ని దగ్గరకు తీస్తున్నాయి. ఇదొక పెద్ద ఫార్సుగా తయారైందని భావించవచ్చు. ఇక అధికార యంత్రాంగం ధోరణి అల్లరి పిల్లవాడిలాగా ఉంది. వాస్తవంగా ఆహారం సమస్య గుర్తింపు కోసం, సమాజంలో తమ స్థానం కోసమూ హిందువులు-దళితులు, గిరిజనుల మధ్య తరచుగా పోరాట వేదికగా తయారైంది. బ్రాహ్మణిజంలో భాగమైన అహింసా నైతిక సూత్రాలు దళిత గ్రూపులపై కులాధిపత్యంతో బలవంతంగా రుద్దడంవల్ల గాఢమైన హింసకు వాహకంగా తయారయ్యాయి. అంతిమంగా ఆహారం ఒక మతానికి ప్రధాన చర్చగా తయారైంది. అందువల్ల ఆహారానికి సంబంధించిన ముఖ్యాంశాలను రాజ్యాంగంలో చేర్చాలి. భవిష్యత్‌లో ఆహారాలు ఏవైనా అంటరానివిగా ఉండే అవకాశం లేదు. పోషక విలువలు, పర్యావరణ కాలుష్యం, ఆహార కొరతలు ఇందుకు కారణమవుతాయి. అన్ని రకాల ఆహారాలూ తీసుకోవలసిన అనివార్యత ఏర్పడవచ్చు. నిషేధాలు, ఆంక్షలు విధించడం కంటే ప్రభుత్వం ఇలాంటి అనిశ్చితమైన పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమం.
అధికార బిజెపి నిషేధాన్ని ఒక ఆయుధంగా ఇష్టపడుతోందని ఇటీవల జరుగుతున్న చర్చలు తెలియజేస్తున్నాయి. అది ఆహారం కావచ్చు, పుస్తకాలు, సినిమాలు లేదా బట్టలు ధరించడం లాంటివి కావచ్చు. వాటిని ఆయుధంగా మలుచుకొంటుంది. ఏ అంశాన్నైనా ఆయుధంగా వాడుకుంటోంది. ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆలోచనలేకుండా ఆహారంపై నిషేధం విధించారు. ఇది మతానికి, రాజ్యాంగానికీ, ప్రజాస్వామ్యానికీ, వాస్తవంగా జీవన విధానానికీ దోహదం చేసే సంస్కృతికి సైతం ముప్పు కలిగిస్తుంది. బిజెపి పైకి చూపించే నమ్రత, వాస్తవం అన్న వాదన బూటకపు ఆధ్యాత్మికత హింసకు దారితీస్తుంది. ఇది కాంగ్రెస్‌ బూటకపు లౌకికతత్వం కంటే ఎక్కువ హాని కలిగిస్తుంది.
- శివ్‌ విశ్వనాథన్‌ 
(రచయిత జిందాల్‌ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీలో ప్రొఫెసర్‌)