బిజెపి అవినీతి 'వ్యాపం'

మధ్యప్రదేశ్‌లో బిజెపి ఏలుబడిలో వ్యవస్థీకృతమైన వ్యాపం కుంభకోణం భారతీయ కుంభకోణాల్లోకెల్ల అసాధారణం. దశాబ్దం పాటు అప్రతిహతంగా సాగిన భారీ అవినీతి పుట్ట పగిలి యావత్‌ దేశాన్ని విస్తుగొల్పుతోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఒక్కొక్కరు ఒక్కో విధంగా మరణించడం హరర్‌ సినిమాను తలపిస్తోంది. మాఫియా మూలాలు ఆక్టోపస్‌లా అన్ని దిక్కులకూ విస్తరించాయని దర్యాప్తు చేపట్టిన తర్వాతనే తెలిసొచ్చింది. వైద్య కళాశాలల్లో ప్రవేశాలు, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కిందకు రాని పలు ప్రభుత్వ పోస్టుల భర్తీ కోసం ఏర్పాటైన వృత్తి పరీక్షల మండలి (పిఇబి/వ్యాపం)లో చోటు చేసుకున్న అక్రమాలు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన అక్రమాలను తలదన్నేలా ఉన్నాయి. అక్రమార్కులు భారీ ఎత్తున ముడుపులు తీసుకొని మెడికల్‌, పిజి మెడికల్‌ కాలేజీల్లో వందలాది మంది అనర్హులకు ప్రవేశాలు కల్పించారు. కానిస్టేబుల్‌, టీచర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, తదితర ప్రభుత్వ నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి భారీగా సొమ్ము చేసుకున్నారు.

ఒకరి తరఫున మరొకరితో పరీక్షలు రాయించడం, పరీక్షా కేంద్రాల్లో సీటింగ్‌లో మార్పులు, ఒఎంఆర్‌ షీట్లు మార్చడం అక్రమాల్లో మచ్చుకు కొన్ని మాత్రమే. కనీస విద్యార్హతలు లేక పోయినా వేలాది మంది డబ్బులు పెట్టి ఉద్యోగాలు, మెడికల్‌ ప్రవేశాలు పొందడం ఆందోళన కలిగించే అంశం. అర్హులైన, సమర్థులైన విద్యార్థులు, అభ్యర్థులు తమ ఉజ్వల భవిష్యత్తును కోల్పోవడం విషాదాల్లోకెల్ల విషాదం. వ్యాపం కుంభకోణంలో చేతులు మారింది రెండు వేల కోట్ల రూపాయలని కథనాలు వెలువడుతున్నా, వాస్తవ విలువ దానికి ఎన్నో రెట్లుంటుందని అది విస్తరించిన తీరునుబట్టి తెలుస్తుంది. వ్యాపం కుంభకోణంపై వార్తలు సేకరిస్తున్న ఒక టీవీ చానెల్‌ జర్నలిస్టు అక్షరుసింగ్‌ శనివారం అనుమానాస్పదంగా మరణించడంతో స్కాం ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించడమే కాకుండా దిగ్భ్రాంతి కలిగించింది. తరువాత 48 గంటల్లోనే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న వైద్యాధికారి అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీనిపై దేశమంతా దిగ్భ్రాంతినుండి కోలుకోకముందే 24 గంటల్లో ఈ కుంభకోణంతో సంబంధమున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ట్రయినీ అనామికా సికర్వాల్‌ చనిపోవడం కుంభకోణం మాఫియా కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ కుంభకోణాన్ని సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సిబిఐ చేత విచారించాలని మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరుసింగ్‌ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేయడం, వామపక్షాలు సమరశంఖం పూరించడంతో రాజకీయ ప్రాధాన్యత వచ్చింది.
               ఒక వైద్యుడు, ఒక సామాజిక కార్యకర్త వేర్వేరుగా 2013లో బయటపెట్టే వరకు వ్యాపం స్కాం రహస్యమే. ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బావమరిదిపై ఆరోపణలు రావడంతో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టిఎఫ్‌)కు దర్యాప్తును అప్పగించారు. కాగా ఎస్‌టిఎఫ్‌ దర్యాప్తుపై పర్యవేక్షణ కోసం మాజీ జస్టిస్‌తో ప్రత్యేక విచారణ బృందం (సిట్‌)ను హైకోర్టు నియమించాకనే విచారణ ఊపందుకుంది. అప్పటి వరకు కేవలం మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్ల వరకే అనుకున్న అవకతవకలు, ఇతర పరీక్షల్లోనూ జరిగాయని వెల్లడైంది. వ్యాపం స్కాంలో ఇప్పటి వరకు రెండు వేల మందిని అరెస్టు చేశారు. మరో 800 మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. అరెస్టయిన వారిలో బిజెపి నేత, విద్యాశాఖ మాజీ మంత్రి, ఆయన పేషీ అధికారి, సిఎంకు అత్యంత సన్నిహితుడు, మైనింగ్‌ కింగ్‌, గవర్నర్‌ ఆఫీస్‌ ఒఎస్‌డి, డిఐజి, డజన్ల సంఖ్యలో ఐపిఎస్‌లు, ఐఎఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు, దళారులు ఉన్నారు. రాష్ట్ర గవర్నర్‌ రాం నరేశ్‌ యాదవ్‌ కుమారుడు ఈ కేసులో నిందితుడు. అంతేకాదు అటవీశాఖలో నియామకాలకు గవర్నర్‌ ఐదుగురి నుంచి లంచం తీసుకున్నారని ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గవర్నర్‌కు ఉన్న రాజ్యాంగ హక్కుల వలన ఆ ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టేసింది. లేకపోతే గవర్నర్‌ కూడా వ్యాపం కేసులో నిందితుడయ్యేవారు.
వ్యాపం కుంభకోణంలో భీతిగొల్పే కోణం మరొకటుంది. స్కాంలో నిందితులు, సాక్షులు వరుసగా మరణించడం. ఇప్పటి వరకు ఆ విధంగా పాతిక మంది చనిపోయారని అధికారిక లెక్కలే తెలుపుతున్నాయి. అనధికారిక సమాచారం ప్రకారం 42 మంది మృతి చెందారు. ఆ మరణాలన్నీ అసహజ, అనుమానాస్పదమైనవి. కేసులో నిందితుడిగా ఉన్న గవర్నర్‌ తనయుడు సైతం అనుమానాస్పద స్థితిలో మరణించడం పరాకాష్ట. జర్నలిస్టు మృతిని బట్టి అవన్నీ హత్యలుగానే పరిగణించాల్సి ఉంటుంది. కుంభకోణం వెలుగు చూడకుండా, పెద్దల పేర్లు బయటికి రాకుండా ఉండేందుకు చేస్తున్న ఖూనీలుగా కనబడుతున్నాయి. స్కాంను బయటపెట్టిన సామాజిక కార్యకర్తతో పాటు దర్యాప్తు అధికారులకు సైతం అంతు చూస్తామంటూ బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. తమకు రక్షణ కల్పించాలని పలువురు కోర్టులను ఆశ్రయించారంటే ఎంతటి భయానక పరిస్థితులున్నాయో అర్థమవుతుంది. వ్యాపం కుంభకోణం పక్కా రాజకీయ అవినీతి. కాగా దీన్ని క్రిమినల్‌ గ్యాంగ్‌లకు, మాఫియాకు అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది.

        2004లో వ్యాపం అక్రమాలు మొదలై 2007 నుంచి తీవ్రమయ్యాయి. మధ్యప్రదేశ్‌లో 2003 డిసెంబర్‌ నుంచి బిజెపినే అధికారంలో ఉంది. ప్రస్తుత సిఎం శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 2005 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తమ ప్రభుత్వం నీతికి, నిజాయితీకి మారు పేరని చౌహాన్‌ చేసుకుంటున్న ప్రచారం మోసమని తేలిపోయింది. వ్యాపం కుంభకోణంలో గవర్నర్‌, ముఖ్యమంత్రిపై నేరుగా ఆరోపణలొచ్చినా బిజెపి అగ్ర నాయకత్వం, ప్రధాని నరేంద్ర మోడీ మిన్నకుండిపోవడం హేయం. పలువురు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నాయకులు నిందితుల జాబితాలోకెక్కినా మౌనమే. ఆరోపణలెదుర్కొంటున్న ముఖ్యమంత్రి, గవర్నర్‌, ఇతర నేతలు పదవులను పట్టుకొని వేలాడటం అనైతికం. అవినీతి రహిత పాలన అందిస్తామని అధికారంలోకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ తక్షణం వారిని బర్తరఫ్‌ చేయాలి. సస్పెన్స్‌ థ్రిల్లర్‌, హారర్‌ సినిమాలను తలదన్నుతున్న వ్యాపం కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలి.