బిజెపి అండతోనే బెంగాల్ లో తృణమూల్‌ అరాచకం

కేంద్రంలోని మతోన్మాద బిజెపి అండతోనే పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ అరాచక పాలన సాగిస్తున్నారని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి మధు, కె.రామకృష్ణ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌ ప్రజలపై అక్కడి పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు సాగిస్తున్న దాడిని నిరసిస్తూ బీసెంట్‌ రోడ్డులోని మహంతి మార్కెట్‌ సెంటర్లో ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం నేతృత్వం వహించింది. తొలుత సిపిఎం కార్యాలయమైన సుందరయ్య భవన్‌ నుండి ప్రదర్శన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆ పార్టీకి చెందిన పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ధర్నాలో మధు మాట్లాడుతూ.. అనేక ప్రజా పోరాటాల ఫలితంగా సాధించుకున్న భూములను తిరిగి భూ స్వాములకు కట్టబెట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. దానిని అడ్డుకుంటున్న ప్రజలపైనా, ప్రతిపక్ష పార్టీలపైనా, వామపక్షాల నేతలపైనా తృణమూల్‌ గుండాలు దాడులు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేరీతిలో అక్కడ పాలన సాగుతున్నా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కనీస వేతనాలు కోరుతున్న కార్మికులపై కూడా పాశవికంగా దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. బెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి అరాచకం పెరిగిపోయిందన్నారు. పోలీసుల సాయంతో సామాన్యులను వేధిస్తోందన్నారు. ధర్నాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ గుండాల పాశవిక దాడులు, దాడుల్లో గాయపడిన వారి చిత్రాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు సిహెచ్‌ బాబూరావు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాధ్‌, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి పాల్గొన్నారు.