బిజెపిని ఎందుకు నిలదీయరు..?

  ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని, కలిసి వస్తామంటున్న ప్రతిపక్షాలనొదిలి కేంద్రంతో ఎందుకు లాలూచీ పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఓ ఛానల్లో జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కావాలనే మౌనం పాటిస్తోందని అన్నారు. ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా చంద్రబాబు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని తెలిపారు. ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ప్రత్యేకహోదా తీసుకొస్తామంటే అదన్నా చేయాలని, అది కూడా ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సూటిగా అడిగుంటే ఈపాటికి కేంద్రం తన నిర్ణయాన్ని సూటిగా చెప్పేదని ఆయన అన్నారు. అవేమీ చేయకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రతిపక్షాలు చేసేవి విమర్శలైతే అదన్నా చెప్పాలనీ, లేకపోతే వాస్తవాన్ని గమనించి మాట్లాడాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పార్లమెంటులో ప్రకటన చేసే సమయంలో అందరూ సహకరించాలని కోరారని, దాన్ని చట్టబద్ధమైన అంశంగా తీసుకోవాలని అన్నారు. అదే సమయంలో దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రణాళికా సంఘానికీ సూచించారని తెలిపారు. బిజెపి కూడా దీన్ని బలపరిచిందని పేర్కొన్నారు. అప్పట్లో మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ప్రత్యేకమని, ఆర్థికవనరులున్న హైదరాబాద్‌ విడిపోయిందని, రాజధాని నగరం లేదని అటువంటి సమయంలో ఇవ్వడం న్యాయసమ్మతమేనని బిజెపి నాయకులూ చెప్పారని గుర్తు చేశారు. హోదా ఇవ్వకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదనీ చెప్పారన్నారు. ఇప్పుడు అవసరం లేదని అంటున్నారని, ఎందుకు అవసరం లేదో చెప్పాలని ఆయన అన్నారు. ప్రకటన చేసిన బిజెపి నాయకులకు దీనిపై సరైన అవగాహన ఉండి మాట్లాడారా ? లేక మాట్లాడారా ? అనే విషయాన్నీ స్పష్టం చేయాలని కోరారు. ఈ విషయంలో అడగాల్సిన తెలుగుదేశం, వాగ్దానం చేసిన బిజెపి రెండూ వెనక్కు పోతున్నాయని తెలిపారు. ప్రణాళికా సంఘం రద్దయిందంటున్నారని, ప్రత్యామ్నాయం లేకుండానే రద్దు చేశారా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పాలని ఆయన కోరారు. ప్యాకేజీ ఇస్తామంటున్నారని, అది హోదాకన్నా ఎక్కువ లాభం కలిగించేందయితే ఎవరూ హోదా అడగరని తెలిపారు. ఇచ్చే ప్యాకేజీ ఏమిటో ఎవరికీ తెలియదని అన్నారు. ఏడు జిల్లాలకు కలిపి రూ.350 కోట్లు ఇచ్చారని, ఈ నిధులు చిన్న చిన్న పనులు చేయడానికి, రాజకీయ నాయకుల జేబులు నింపడానికి తప్ప దేనికీ పనికిరావని అన్నారు. ముష్టివేసినట్లు విదిల్చారని చెప్పారు. ఒకవేశ ఇవ్వాలనుకుంటే 'ఇస్తామన్న మూటేదో విప్పి చూపిస్తే' అందరికీ నమ్మకం కలుగుతుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజీ అంటే నమ్మించడం తప్ప మరొకటి కాదని అన్నారు. విభజన సమయంలోనే రెవెన్యూలోటు పూడుస్తామని స్పష్టంగా పేర్కొన్నారని, ఇప్పుడు అన్నిటికీ కలిపి రూ.12 వేల కోట్లొస్తాయని చెబుతున్నారని, అయినా మూడువేల కోట్ల ఆర్థికలోటుందని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు కావాలంటున్నారని, నిపుణులతో కమిటీ వేసి ఎంత అవసరమో స్పష్టం చేయాలని అన్నారు. రాష్ట్రానికి మేలు చేస్తారనుకుని తెలుగుదేశం పార్టీని గెలిపించారని, అయినా సంవత్సర కాలంలోనే విశ్వాసాన్ని కోల్పోయిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితి బాగోలేదని, పరిశ్రమలు రావడం లేదని, రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిందని ఈ స్థితిలో రాష్ట్రం ఆర్థికంగా పుంజుకోవడం సాధ్యం కాదని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే రాయితీలొస్తాయని పరిశ్రమాధిపతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధులు సమానంగా వస్తాయని కేంద్రం చెబుతోందని, ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రానికి ఆ నిధులు సరిపోవని అన్నారు. దీనిపై ప్రభుత్వం అందరినీ కలుపుకుని కేంద్రాన్ని నిలదీస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని అన్నారు