
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కార్పొరేట్ వ్యాపారుల పక్షమో, కష్టజీవుల పక్షమో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్ రెండున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్రమంతా పర్యటిస్తున్న బస్సుయాత్ర గురువారం రాత్రి ఒంగోలుకు చేరుకుంది. బస్సుయాత్రకు స్ధానిక దక్షిణ బైపాస్ వద్ద ఉన్న జిల్లా పరిషత్‌కార్యాలయం వద్ద వివిధ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి నెల్లూరు బస్టాండ్, కలెక్టరేట్, చర్చి సెంటర్, మిరియాలపాలెం సెంటర్, పాత కూరగాయల మార్కెట్ నుండి అద్దంకి బస్టాండ్ వరకు బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చీరాగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కార్మికవర్గంపై కక్షగట్టి వ్యవహరిస్తున్నాయన్నారు. అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నాయని విమర్శించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు లక్ష రూపాయల జీతం పెంచుతున్న ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వమంటే డబ్బులు లేవని చెపుతున్నాయన్నారు. ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ రెండున జరిగే సమ్మె ప్రారంభం మాత్రమేనని, ప్రభుత్వాలు విధానాలను మార్చుకోకుంటే మరిన్ని సమ్మెలు జరుగుతాయని హెచ్చరించారు. సెప్టెంబర్ రెండున జరిగే సమ్మెను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని నేతలు పిలుపునిచ్చారు.