బాక్సైట్‌ తవ్వకాల జి.వో.నెం.97ను వెంటనే రద్దు చేయాలి. ట్రైబల్‌ అడ్వజరీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి.-సిపియం

            

బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు, ప్రజాతంత్ర వాదులు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజన ప్రజలు తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ ఉద్యమం యొక్క తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని బాక్సైట్‌ తవ్వకాల జి.వోను వెంటనే రద్దు చేసేలా 16న జరిగే రాష్ట్ర క్యాబినేట్‌లో నిర్ణయం చేయాలని సిపియం పార్టీ డిమాండ్‌ చేస్తుంది. లేనియెడల సిపియం పార్టీ ప్రజా సంఘాలు, సంస్థలు బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడే ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని విశాల ఉద్యమానికి సన్నిద్ధం అవుతుంది.

                బాక్సైట్‌ తవ్వకాలు చేపడితే  జికెవీధి, చింతపల్లి, అరకు, అనంతగిరి మండలాల్లోని 247 గ్రామాలు, 9312 ఆవాసాలకు ప్రమాదం ఏర్పడుతుంది. దాదాపు లక్ష మందికి పైగా గిరిజనులు నిర్వాసితులౌతున్నారు. జర్రెల, సప్పర్ల, జికెవీధి, గాలికొండ, చిట్టింగొంది కొండలను తొలిచేయడంతో పరిసర ప్రాంతాల్లోని వందలాది గ్రామాలు నివాసయోగ్యానికి పనికిరాకుండాపోతాయి. లక్ష మంది కాఫీ రైతులు నష్టపోతారు అటవీ ఉత్పత్తులపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది గిరిజనులకు జీవనాధాం లేకుండాపోతుంది.

                గిరిజన ప్రాంతమే కాకుండా  మైదాన ప్రాంతంలో వున్న సాగు, తాగునీటి అవసరాలు తీర్చుతున్న శారద, తాండవ, గోస్తనీ, తాటిపూడి, రైవాడ నదులు కలుషితంకానున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు త్రాగు, సాగునీరుకు దూరమౌతారు. అడవిని నమ్ముకొని బతికే గిరిజనులకు జీవనాధారం లేకుండాపోతుంది. మన సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతాయి. పర్యావరణానికి తీవ్రహాని ఏర్పడనుంది. పచ్చని పంటపొలాలు బీడు భూములుగా మారనున్నాయి. బాక్సైట్‌పై అధ్యయనం చేసిన ఢల్లీకి చెందిన ఎనర్జీస్‌ రిసోర్సు ఇనిస్టిట్యూట్‌ తన నివేదికలో వేల కోట్ల రూపాయల విలువైన పర్యావరణ సంపదకు నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. బాక్సైట్‌ ఒప్పందాలను కాగ్‌ సైతం తప్పుపట్టింది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసం గిరిజనుల జీవితాలను చంద్రబాబు ప్రభుత్వం ఫణంగా పెట్టేందుకు సిద్ధపడ్డారు. దీనిని గిరిజనులు ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించరు.

                ఏజెన్సీలో చింతపల్లి, జర్రెల బ్లాకులోని బాక్సైట్‌ ఖనిజాన్ని అన్‌రాక్‌ కంపెనీకి అప్పగించేందుకు 3,030 ఎకరాల్లో ఎపిఎండిసికి లీజు అనుమతులు మంజూరు చేస్తూ 5-11-15న జి.వో. ఇచ్చింది. చంద్రబాబు పానలో 1999లో బాక్సైట్‌ తవ్వకాలకు ప్రారంభమైన ప్రయత్నాలు మళ్లీ ఆయన ఏలబడిలోనే మరో అడుగుముందుకుపడింది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకించి, అధికారంలోకి వచ్చిన తరువాత ఎపిఎండిసికి లీజు అనుమతులు కట్టబెట్టడం శోచనీయం. గ్రామసభల్లోనూ, స్థానిక సంస్థల వేదికల్లోనూ బాక్సైట్‌ వ్యతిరేక తీర్మానాలు చేశారు. 1/70, పీసా వంటి చట్టాలు, సమతా తీర్పును ఉ్లంఘించి ఎపిఎండిసిని అడ్డంపెట్టి కార్పొరేట్‌ కంపెనీలకి బాక్సైట్‌ను అప్పగించి గిరిజనుల జీవితాలను ఛిద్రం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడ్డాయి.

                ఏజెన్సీలో అరుకులోయ, అనంతగిరి మండలాల్లో ఉన్న బాక్సైట్‌ను జిందాల్‌కు కట్టబెట్టేందుకు 2005 జులై 1న గత ప్రభుత్వం ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. జికెవీధి, చింతపల్లి, కాటంరాజు కొండు, గుర్తేడు కొండకు సంబంధించి 2007 ఫిబ్రవరి 14 అన్‌రాక్‌ అల్యూమినా కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాలు గిరిజన చట్టాలు, ప్రయోజనాలకు భిన్నంగా జరగడంతో గిరిజనులను ఐక్యం చేసి సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. అరకు గ్రూపులో 6,115 ఎకరాల్లోని 24 కోట్ల టన్నుల బాక్సైట్‌ నిల్వలను జిందాల్‌కు, చింతపల్లి గ్రూపులోని జర్రె ప్రాంతంలో 3,030 ఎకరాల్లోని 24 కోట్ల టన్ను బాక్సైట్‌ నిల్వలను అన్‌రాక్‌కు కేటాయించింది. ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా కూడా నిర్విరామంగా పోరాటాలు చేస్తున్నారు. నవంబర్‌ 7న జరిగిన ఏజెన్సీ సంపూర్ణంగా విజయవంతం అయ్యింది. గిరిజనుల మనోభావాలు వ్యతిరేకంగా బాక్సైట్‌ తవ్వకాలు తవ్వొదని పదేపదే ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా  మళ్ళీ ఇప్పుడు గిరిజనుల మనోభావాలకు అనుగుణంగా తవ్వకాలు చేపడతామని విడ్డూరంగా ప్రకటనలు చేస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థకు అనుగుణంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. వెంటనే ట్రైబల్‌ అడ్వజరీ కమిటీ ఏర్పాటు చేసి గిరిజన ప్రజాప్రతినిధు అభిప్రాయాలు తీసుకోవాని, జి.వో.నెం.97ను రద్దు చేయాలని సిపియం పార్టీ డిమాండ్‌ చేస్తుంది. ఈ ప్రెస్ మీట్లో సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.రమేష్, బి.ప్రభావతి పాల్గొన్నారు.