బాక్సైట్‌ తవ్వకాలు ప్రైవేట్ వారికి వద్దు..

విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు కేంద్ర పర్యావరణ, మంత్రిత్వశాఖ అనుమతులు ఇవ్వడం దారుణమని, దీనిని తక్షణమే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ నర్సింగరావు డిమాండ్‌ చేశారు. మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ నాయకులు ప్రజలను మభ్య పెట్టారనే విషయం ఈ జీవోతో వెల్లడైందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం బాక్సైట్‌ తవ్వకాలకు మార్గం సుగమం అయిందని, ఈ జీవోలో 1212 హెక్టార్లలో బాక్సైట్‌ తవ్వకాలు చేపడితే దానికి రెట్టింపు హెక్టార్లలో మొక్కలు నాటాలని చెబుతున్నారని అన్నారు. టిడిపి, బిజెపి ప్రభుత్వాలు మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు ప్రైవేటు వ్యక్తులకు సర్వ హక్కులూ ఇస్తున్నాయని, బాక్సైట్‌ వల్ల ప్రభుత్వానికి 0.5 శాతం మాత్రమే లబ్ధి చేకూరుతుందని చెప్పారు. బాక్సైట్‌ తవ్వకాలను సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, దీనికి నిరసనగా శుక్రవారం నుండి దశలవారిగా ఆందోళన చేయనున్నట్లు చెప్పారు. అవసరమైతే మన్యం బంద్‌ చేపడతామని అన్నారు.