బాక్సైట్‌పై చంద్రబాబు కపటనాటకం

       విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాల విషయంలో గిరిజనుల మనోభావాలను గౌరవిస్తామని చెబుతున్న చంద్రబాబు, దానికి సంబంధించిన జిఒ 97ను రద్దు చేయకుండా కపట నాటకం ఆడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 18న జరిగిన రాష్ట్ర మంత్రివర్గంలో బాక్సైట్‌కి సంబంధించి రాజశేఖరరెడ్డి ప్రభుత్వ కాలం నాటి, కాలం చెల్లిన 222, 289 జిఒలను రద్దు చేసి గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం మరోసారి గిరిజనులను మోసం చేస్తోందని, నిజంగా చిత్తశుద్ధి, గిరిజనుల మనోభావాల మీద గౌరవం వుంటే జర్రెల బ్లాక్‌లో 1212 హెక్టార్ల బాక్సైట్‌ తవ్వకాలకు ఎపిఎండిసికి లీజుకిస్తూ 2015 నవంబర్‌ 5న విడుదల చేసిన జిఒ 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 
బాక్సైట్‌ విష ఖనిజమని, దానిని తవ్వడం వల్ల గిరిజనుల జీవితాలు, భూములు, నీటివనరులు, పర్యావరణం దెబ్బతింటాయని, గిరిజన మనుగడకు విఘాతం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు. గిరిజనుల పోరాటాలను పట్టించుకోకుండా, వారిపై నిర్బంధాలు ప్రయోగించి, అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపిస్తున్నారని తెలిపారు. ఎలాగైనా బాక్సైట్‌ తవ్వి పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చి తమ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు తహతహలాడుతున్నారని విమర్శించారు.