'బాక్సైట్‌'పై ఐక్య ఉద్యమం, ఏజెన్సీలో నిర్బంధం ఆపి కేసులు ఎత్తివేయాలి - గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాబూరావు

ప్రజా ప్రయోజనాల పేరుతో గిరిజనుల జీవితాలను ఫణంగా పెట్టి కార్పొరేట్‌ శక్తుల లాభాల కోసం బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న పాలకుల నిరంకుశ చర్యలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావు పిలుపునిచ్చారు. విశాఖ నగరంలోని నార్ల వెంకటేశ్వరరావు భవన్లో 'జువార్‌ నేస్తం' పుస్తకాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం 'బాక్సైట్‌ తవ్వకాలు-గిరిజనుల భవితవ్యం' అంశంపై ఎపి గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు వి.తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత విస్తృతపర్చేందుకు గిరిజనులంతా ఏకోన్ముఖంగా కదలాలన్నారు. బాక్సైట్‌ తవ్వకాలు అన్‌రాక్‌ కంపెనీ యాజమాని లాభాలు కోసం తప్ప గిరిజనుల ప్రయోజనాలు, జాతి ఉద్ధరణ కోసం కాదని పేర్కొన్నారు. బాక్సైట్‌ తవ్వకాలు వల్ల ఆర్థిక, సామాజిక, పర్యావరణపరంగా గిరిజన ప్రాంతానికి తీవ్ర హాని కలుగుతుందని నిపుణుల హెచ్చరకలను ప్రభుత్వాలు బేఖాతరు చేస్తున్నాయన్నారు. ఐదో షెడ్యూల్‌లో గిరిజన ప్రయోజనాలను పరిరక్షిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ వాదనలను సమర్ధించేందుకు ఏర్పాటు చేసిన కలా కమిటీ సైతం గ్రామసభలు ఏర్పాటు చేయాలని, గిరిజనుల భాగస్వామ్యంతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించదని, వాటిని కూడా విస్మరిస్తున్నాయని అన్నారు. ప్రజల
వాదనలకు జవాబు చెప్పలేని ప్రభుత్వం మొండిగా బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టాలని చూస్తుందన్నారు. గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. జర్రెల మాజీ సర్పంచ్‌ వెంకటరమణను మావోయిస్టులు హత్య చేసిన ఘటనను అడ్డంపెట్టుకొని బాక్సైట్‌ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములైన గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి గిరిజనులను భయబ్రాంతులకు గురిజేయడం దుర్మార్గమన్నారు. అక్రమ కేసులు ఎత్తివేసి భేషరతుగా గిరిజనులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 
బాక్సైట్‌ మైనింగ్‌ వ్యతిరేక ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్‌ ఒ.రామ్మూర్తి మాట్లాడుతూ జిఒ 97 రద్దు కానంతవరకు గిరిజనుల మెడపై బాక్సైట్‌ కత్తి వేలాడుతున్నట్లేనని అన్నారు. బాక్సైట్‌ తవ్వకాలు చేపడితే గిరిజనుల జీవితాలకు పెను ప్రమాదం ఏర్పడనుందని, బాక్సైట్‌ వ్యతిరేక పోరాటంలో చురుకైనపాత్ర పోషిస్తున్న గిరిజన సంఘంతో కలిసి పోరాడతామని చెప్పారు. బాక్సైట్‌ తవ్వకాల వల్ల గిరిజన ప్రాంతంలోని నీటివనరులన్నీ దెబ్బతినడం ద్వారా మైదాన ప్రాంతంలో తాగు, సాగునీటితో పాటు పరిశ్రమలకు నీటి సమస్య ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నష్టం జరగకుండా జిఒ 97ను చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసింది తప్ప చిత్తశుద్ధితో కాదన్నారు. గిరిజనుల పట్ల ప్రేమవున్నట్లు చెబుతున్న చంద్రబాబు తాను దత్తత తీసుకున్న పెదలబుడు అభివృద్ధికి ఎందుకు చర్యలు తెలుసుకోవడం లేదని ప్రశ్నించారు. 
ఎపి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.చిన్నంనాయుడు మాట్లాడుతూ బాక్సైట్‌ తవ్వకాలు వల్ల జరిగే నష్టాలను వివరించి గిరిజనులను ఉద్యమాల్లో భాగస్వాములు చేసేందుకు జువార్‌ నేస్తం సంచిక ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమాన్ని బలహీనపర్చేందుకు ప్రభుత్వం పెట్టే ప్రలోభాలకు తలొగ్గకుండా గిరిజన ప్రయోజనాల పరిరక్షణకు ఉద్యమించాలని కోరారు. ఈ సదస్సులో స్టీల్‌ప్లాంట్‌ కో-ఆపరేటివ్‌ స్టోర్‌ డైరెక్టర్‌ బి.తౌడన్న, కోరాబు సత్యనారాయణ, ఎస్‌.దామోదర్‌, తోటపల్లి చిట్టిబాబు, పి.జగన్నాధం, ఎం.కృష్ణయ్య, యు.భాంజుబాబు, పి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.