బహుళజాతి కంపెనీపై తొలి తిరుగుబాటు

ఎత్తయిన గోడలు, చుట్టూ ముళ్ల కంచెలు, ఈగ సైతం లోపలకు వెళ్లలేనంతగా భద్రత... ఇదీ... ఓలం ఆగ్రా ఇండియా లిమిటెడ్‌ (ఒఎఐఎల్‌) బహుళజాతి కంపెనీ విశాఖ జిల్లాలో ఏర్పాటైన ప్రాంతం... అధికారంలో ఉండే రాజకీయ నాయకుల అండదండలు, కార్మిక శాఖ ఉన్నతాధికారుల చల్లని చూపులు రక్షణ కవచాల్లా ఓలం కంపెనీకున్నాయి. ఈ స్థితిలో లోపల ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలియని పరిస్థితి. విశాఖ జిల్లాలో శాఖోపశాఖలుగా విస్తరించిన ఓలం జీడిపిక్కల కంపెనీ అన్ని కార్మిక చట్టాలనూ తుంగలో తొక్కుతూ పబ్బం గడుపుకుంటోంది...
90 శాతం మహిళా శ్రామికులే...
దీంట్లో పనిచేసే వేలాదిమందిలో 90 శాతం మహిళలే. దీంతో మహిళల శ్రమను కారు చౌకగా దోచుకుంటున్నది. దాదాపు 12 సంవత్సరాల క్రితం బహుళజాతి కంపెనీకి చెందిన ఓలం ఆగ్రా ఇండియా లిమిటెడ్‌ జీడిపిక్కల కర్మాగారాలను నెలకొల్పింది. ఆ తర్వాత కాలంలో సన్‌ఫుడ్‌, ప్రశాంతి, విజయ లక్ష్మి, వైజాగ్‌ ఎక్స్‌పోర్ట్స్‌, సౌభాగ్య ఎక్స్‌పోర్ట్స్‌, తదితర పేర్లతో సుమారు 50కి పైగా కంపెనీలు విశాఖ జిల్లాలో నెలకొల్పారు. 15 వేలకు పైగా మహిళలు ఈ కంపెనీల్లో పని చేస్తున్నారు. మహిళలు అధికంగా పనిచేయడమే గాకుండా, హక్కుల కోసం పోరాడేందుకు అవకాశాలు తక్కువన్నదే నేటి బహుళజాతి కంపెనీల ఆలోచనగా ఉంది. 2015 ప్రారంభం వరకు పనులన్నీ కార్మికుల చేత చేయించేవారు. తర్వాత పని విభజన చేశారు. దోపిడీని కూడా పని విభజనతో అధికం చేశారు.
ఆధునీకరణ పేర శ్రమదోపిడీ...
ఓలం కంపెనీ 2015లో ఆధునీకరణ పేరుతో భారీగా యాంత్రీకరణ చేపట్టింది. ఫలితంగా కార్మికుల వేతనాలు తగ్గాయి. కటింగ్‌, గ్రేడింగ్‌, సీలింగ్‌, తదితర పనులు చేసే వారికి వారానికి రూ.2,500 వేతనం లభించేది. యాంత్రీకరణ తర్వా త రూ.1,100లకు వారి ఆదాయం పడిపోయింది. అప్పటి వరకు రోజుకు ఇస్తున్న రూ.54 డిఎను రద్దు చేసింది. కిలో జీడి పిక్కలు కటింగ్‌ చేసినందుకు రూ.15.50 నుంచి రూ.5.15కు తగ్గించింది. తగ్గిన వేతనాలతో జీడిపప్పు కార్మికు లకు పూటగడ వడం గగనంగా మారింది. ఓలం కంపెనీకి జిల్లాలో ఎనిమిది శాఖలున్నాయి. సుమారు మూడు వేల మంది వివిధ రకాల పనులు చేస్తున్నారు. 90 శాతం మహిళలు పని చేసే ఈ కంపె నీల్లో ప్రసూతి సెలవులు అమలు కావడం లేదు. వేతనంతో కూడిన సెలవులు ఇవాల్సి వస్తుంది కాబట్టి గర్భం దాల్చిన మహి ళలు కంపెనీలో పనిచేస్తే అబార్షన్‌ అవుతుందని అశాస్త్రీయ మైన గ్లోబెల్స్‌ ప్రచారం చేసి ఉద్యోగాలు మాన్పిస్తు న్నారు. కనీస వేతనాలు, పిఎఫ్‌, కార్మిక చట్టాలు, ఇతర సౌకర్యాలు సక్రమంగా అమలు కావడం లేదు. కార్మికుల పిఎఫ్‌ డబ్బులు ఖాతాలో జమచేయకుండా కోట్లాది రూపాయలు స్వాహా చేశారు.
తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. గుర్తింపు కార్డులు లేవు. భద్రతా పరికరాలు (ఆయిల్‌, గ్లౌజ్‌, మాస్క్‌లు, షూలు, ఇయర్‌ప్లగ్‌లు) లేవు. ''గోరుచుట్టుపై రోకలి పోటులా'' కొత్త యంత్రాలు తెచ్చి ఉన్న ఉపాధిని దెబ్బకొట్టింది. మిషన్‌లో రెండుసార్లు వేసిన తర్వాత కటింగ్‌ కాని పిక్కలను (అన్‌కట్‌ పిక్కలు) కట్‌ చేయడం మహిళలకు కష్టంగా మారింది. దీంతో పాటు బ్రాయిలర్‌ కళాశీలు, ఇతర డైలీ వేజ్‌ కార్మికులకు జీవో ప్రకారం రూ.285 ఇవ్వాల్సి ఉండగా రూ.150 నుంచి రూ.200 మాత్రమే ఇస్తున్నది. కనీస వేతనం ఇవ్వమని అడిగినందుకు సెప్టెంబర్‌ 9 నుంచి గేటు బయట పెట్టింది. కంపెనీలను మూసేస్తామని, 12 సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని దౌర్జన్యానికి పాల్పడింది. పోలీసు బలగాలను మోహరించి కేసులు పెడతామని బెదిరించింది. స్థానిక రాజకీయ నాయకులను, పెద్దలను లొంగదీసుకొని బరితెగించి కొత్త కార్మికులను పెట్టి పని చేయించుకోవాలని కుట్ర పన్నింది.
కాజూ ప్రాసెసింగ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ జీవో 49ని సవరిస్తూ వేతనాలు పెంచుతూ జీవో 414ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం కార్మికులకు వేతనాలు పెరిగాయి. దీని ప్రకారం వేతనాలు చెల్లించలేమని అన్ని కంపెనీలకు చెందిన యాజమాన్యాలు కోర్టుకెళ్లి స్టే తెచ్చాయి. ఆరు సంవత్సరాలకొకసారి పెరిగిన వేతనాలను సైతం యాజమాన్యాలు చెల్లించేందుకు సిద్ధపడటం లేదు. కార్మికుల శ్రమతో ఉత్పత్తి చేసిన జీడిపప్పును దేశ, విదేశాలకు ఎగుమతి చేసి కోట్లాది రూపాయల లాభాలు గడిస్తున్న యాజమాన్యాలు ఆ లాభాలకు కారణమైన కార్మికులకు మాత్రం ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల జీవో అమలు కాకుండా కోర్టుకెళ్లి స్టే తీసుకురావడం కార్మికుల శ్రమను నిలువునా దోపిడీ చేయడమే. కనీస వేతనాలు అమలు చేయని యాజమాన్యాలపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ప్రభుత్వం యజమానుల సేవలో మునిగితేలుతోంది. చట్టాలు అమలు చేయాలని కార్మిక శాఖ అధికారులు యజమానులపై కనీసం ఒత్తిడి కూడా తేలేదు.
ఈ పరిశ్రమలలో పని చేస్తున్న కార్మికుల ప్రాణాలకు రక్షణ లేదు. భద్రతా పరికరాలు లేవు. మాస్క్‌లు ఇవ్వకపోవడం వల్ల శ్వాసకోస వ్యాధులు మహిళలను పట్టి పీడిస్తున్నాయి. గ్లౌజు, ఆయిల్‌ ఇవ్వకపోవడం వల్ల చర్మ వ్యాధులు వస్తున్నాయి. మిషన్‌ పక్కనే పని చేస్తున్న కార్మికుల చెవులు చిల్లులు పడేలా శబ్దం వస్తున్నా ఇయర్‌ ప్లగ్‌లు ఇవ్వడం లేదు. బ్రాయిలర్‌ వద్ద పని చేస్తున్న కార్మికులకు షూ లేదు. మహిళలకు రెస్ట్‌ రూమ్‌లు, క్రెచ్‌లు, మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాలు లేవు. సబ్సిడీతో కూడిన క్యాంటీన్‌ సదుపాయాలు లేవు. మహిళలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. కటింగ్‌ చేసేటప్పుడు చేతివ్రేళ్లు తెగిపోతే ఎలాంటి నష్టపరిహారం ఇవ్వక పోగా ఉద్యోగం మాన్పించి ఇంటికి పంపుతున్నారు.
స్ఫూర్తిదాయక పోరాటం
ఓలం జీడిపిక్కల కార్మికులు 15 రోజుల పాటు మహత్తర మైన పోరాటం నిర్వహించి యాజమాన్యం మెడలు వంచారు. అపూర్వ ఐక్యతతో ఎన్నో గ్రామాలకు చెందిన కార్మికులు ఉద్యమించడం జిల్లాలో చర్చనీయాంశమయింది. ప్రదర్శనలు, వంటావార్పు, రాస్తారోకో, ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా, చలో కలెక్టరేట్‌, సామాజిక నిరాహార దీక్షలు లాంటి కార్యక్రమా లతో పాటు మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిని ముట్టడించారు. పోలీస్‌ స్టేషన్‌ ముట్టడి లాంటి మిలిటెంట్‌ కార్యక్రమాలు నిర్వహించారు. వీరోచితంగా పోరాడి పోలీసు నిర్బంధాలను, అరెస్టులను సైతం ఎదుర్కొన్నారు. దీంతో జాయింట్‌ కలెక్టర్‌, ఆర్‌డిఒలు జోక్యం చేసుకొని యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఆర్‌డిఒ, లేబర్‌ అధికారుల సమక్షంలో రాతపూర్వక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం చారిత్రాత్మకమైనది. పోరాడి కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలు సాధించుకొని ఓలం జీడిపిక్కల పరిశ్రమ కార్మికులు చరిత్ర సృష్టించారు. 2015 సెప్టెంబర్‌ 23న సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు. అన్ని రంగాల కార్మిక వర్గానికి ఈ పోరాటం స్ఫూర్తిదాయకం.
ఒప్పందంలోని అంశాలు
అన్ని కేటగిరీల కార్మికులకు 20 రోజులు పని చేస్తే నెలకు రూ.500, 15 రోజులు పని చేస్తే రూ.200 అటెండెన్స్‌ బోనస్‌ చెల్లించడానికి, కొత్త మిషన్‌ వల్ల కటింగ్‌ కార్మికులకు గతం కంటే తగ్గిన ఆదాయానికి నెల రోజుల పాటు రోజుకు రూ.300 తగ్గకుండా భర్తీ చేయడానికి, అన్ని రకాల కార్మికుల పీస్‌ రేట్లు జనవరి 2016లో పెంచడానికి, కేజీల టార్గెట్‌తో సంబంధం లేకుండా ప్రతి రోజూ డిఎ రూ.55 చెల్లించడానికి, పిఎఫ్‌ సమస్యలన్నీ నెల రోజుల్లో పరిష్కరించడానికి, ప్రతి నెలా పిఎఫ్‌ చెల్లించిన వివరాలను నోటీసు బోర్డులో పెట్టడానికి, పిఎఫ్‌ స్లిప్‌లు క్రమం తప్పకుండా ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. అలాగే కార్మికులకు గుర్తింపు కార్డులు, మస్టర్‌ కార్డులు, పేమెంట్‌ స్లిప్‌లు ఇవ్వడానికి, కార్మికులందరికీ భద్రతా పరికరాలు ఆయిల్‌, గ్లౌజులు, మాస్క్‌లు, ఇయర్‌ ప్లగ్స్‌, షూస్‌, తదితర అవసరమైన పరికరాలు ఇవ్వడానికి, మంచినీరు, మరుగుదొడ్లు, రెస్ట్‌ రూమ్‌, భోజనశాలలు, భోజన విరామం, తదితర సౌకర్యాలు కల్పించడానికి, కార్మికులకు మెడికల్‌ సౌకర్యం, ట్రైనీ నర్స్‌ను పెట్టి వైద్యం అందించడానికి, నెలకొకసారి మెడికల్‌ చెకప్‌లు చేయడానికి, ప్రమాదాలకు యాజమాన్యమే బాధ్యత వహించి వైద్యం అందించడానికి, ప్రసూతి, పండుగ, ఇతర సెలవులు ఇవ్వడానికి, కార్మికులపై కక్ష సాధింపు చర్యలు, వేధింపులు లేకుండా ఉండేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఇవే కాక మరికొన్ని సమస్యలు పరిష్కరించేందుకు యాజమాన్యం అంగీకరించింది. 
 - జి కోటేశ్వరరావు 
(వ్యాసకర్త సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్షులు)