బలవంతపు భూసేకరణ ఆపాలి

           సబ్బవరం మండలం, వంగలి రెవెన్యూ పరిధిలోని అసైన్డ్‌ భూముల్లో బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం హెచ్చరించారు. బలవంతపు భూసేకరణను నిరసిస్తూ, రీసర్వే నిర్వహించాలని కోరుతూ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన వంగలి గ్రామ రైతులు తహశీల్దారు కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. వారికి మద్దతు తెలియజేసిన లోకనాథం మాట్లాడుతూ వంగలి ప్రాంతంలో అసైన్డ్‌ భూములపై ప్రభుత్వం కన్నుపడిందని, అర్బన్‌ అగ్లమిరేషన్‌ పేరుతో పట్టాలు ఇవ్వకుండా బలవంతంగా భూములు సేకరణ చేసి, రైతులను భూముల నుండి వెళ్ళగొట్టాడానికి రంగం సిద్ధం చేస్తున్నారని, తెలిపారు. మోసాల సర్వేతో భూములను లాక్కొవడం దారుణమన్నారు. అధికారులు ప్రకటించిన జాబితాలో రైతుల పేర్లు లేక పోవడంతో వారు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడ భూసేకరణ జరపాలన్నా 80శాతం మంది రైతుల అభిప్రాయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. రైతుల అభిప్రాయంతో సంబంధం లేకుండా గ్రామంలోని కొంతమంది బడాబాబుల అభిప్రాయం తీసుకొని భూములు లాక్కొవడం దుర్మార్గమన్నారు. మరోవైపు భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న రైతులపై అణిచివేతకు పూనుకోవడం దారుణమన్నారు. రాజకీయలకు అతీతంగా రైతులంతా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అక్రమ భూ సేకరణపై వెంటనే సర్వేలు జరిపి రైతులకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు.