బలవంతపు భూసేకరణ ఆపాలి

రాష్ట్రంలో పిసిపిఐఆర్‌ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణ ఆపాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.క్రాంతి డిమాండ్‌ చేశారు. ఈ నెల 9న జరగనున్న చలో విజయవాడ కార్యక్రమానికి భూ సేకరణ బాధితులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల భూమిని బడా కంపెనీలకు, పెట్టుబడుదారులకు దారాదత్తంచేసేందుకు పూనుకుంటోందన్నారు. నక్కపల్లి మండలంలో పిసిపిఐఆర్‌ పేరుతో చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం రైతాంగం కోర్టును ఆశ్రయించారని చెప్పారు. కోర్టులో స్టే వుండగా ఇటు ప్రభుత్వం, అటు అధికారులు రైతులు వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడం దారుణమన్నారు. రైతులు, వృత్తిదారులు, పేదలు వ్యతిరేకిస్తున్నప్పటికీ అక్రమంగా సర్వేలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దళితులకు, పేదలుకు ఇచ్చిన ఢి-ఫారం, డి.కె.టి భూములను లాక్కొనేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. ఈ విధంగా పేదలకు పంచిన భూములు తీసుకోవడం వల్ల దళితులు, పేదలు, వృత్తిదారులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. మినీకోనసీమగా పేరుగాంచిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధిపేరుతో పరిశ్రమలు స్థాపించి కాలుష్య ప్రాంతంగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్ని స్తోందన్నారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేఖంగా ఈ నెల 9న ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. భూములను రక్షించుకు నేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. సిపిఎం నక్కపల్లి డివిజన్‌ కన్వీనర్‌ ఎం.అప్పలరాజు, సిపిఎం నక్కపల్లి మండల కన్వీనర్‌ పి.వెంకటస్వామి, సత్య నారాయణ, కె.దాసు, డేవిడ్‌ పాల్గొన్నారు.