బడి నవ్వుతోంది..!

కార్పొరేట్‌, ప్రయివేటు కళాశాలల్లోనూ, పాఠశాలల్లోనూ జీవో నెం.1(94) ప్రకారం యాజమాన్య కమిటీలు నియమించాలి. అధిక ఫీజుల తగ్గింపు, విద్యా ప్రమాణాల పెంపుదల, కనీస సౌకర్యాలు ఏర్పాటు విషయం ఆ కమిటీల్లో చర్చించి నిర్ణయాలు చేయాలి. ప్రజా ప్రతినిధులు తలో ఒక ప్రభుత్వ పాఠశాలను స్మార్ట్‌ స్కూల్‌గా చేయటానికి దత్తత తీసుకోవాలి. ప్రభుత్వ మెడికల్‌, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలనూ, ఐటిఐలనూ నేటి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి. వెనుకబడిన ప్రాంతాలలో గురుకుల పాఠశాలలు ప్రారంభించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలను ఒక కిలోమీటరు పరిధిలో ఏ స్కూలుఉందో దానిలో చేర్పించుకోవాలి. ఏదో ఒక బడిలో చేర్చాలి. కార్పొరేట్‌ స్కూళ్లు, కళాశాలల్లో పేద విద్యార్థుల కోసం ప్రత్యేకించాల్సిన 25 శాతం సీట్లను కేటాయించి వారి ఫీజులను ప్రభుత్వమే చెల్లించేలా ప్రొసీజర్లు ఖరారు చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'బడి పిలుస్తోంది' కార్యక్రమానికి సార్థకత ఏర్పడుతుంది.
               బడి గంటలు గణగణమన్నాయి. అంతటా విద్యా కోలాహలం ప్రారంభమైంది. కానీ.. వాటి చుట్టూ ముసురుకున్న సమస్యలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన 'బడి పిలుస్తోంది' కార్యక్రమం తీరుతెన్నులు చూసి బడి పగలబడి నవ్వుతోంది. ఇంకా అనేకచోట్ల శిథిల పాఠశాలలు, ఫర్నీచర్‌లేని తరగతి గదులు, పైకప్పుల్లేని మరుగుదొడ్లు, గోడలు పడిపోయిన మూత్రశాలలు, తాగునీటి కొరత, భర్తీకాని ఉపాధ్యాయుల ఖాళీలు, పుస్తకాలందని పిల్లలను చూస్తుంటే 'బడి పిలుస్తోందా!' లేక ఈ దుస్థితి చూసి 'బడి నవ్వుతోందా!' అని సందేహం కలగక మానదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకూ 'బడి పిలుస్తోంది' అనే కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇటీవలనే ముఖ్యమంత్రి దానిపై విద్య, వైద్య, మున్సిపల్‌, తదితర శాఖల మంత్రులను కూర్చోబెట్టుకొని సమీక్ష చేసి 15 నుంచి బ్రహ్మాండంగా పాఠశాలలను ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. ఇంకా పాఠశాలల్లో పదివేల పోస్టులను భర్తీ చేయవలసే ఉంది. డిఎస్‌సి సెలక్షన్స్‌ అయ్యాయి. నియామకాలకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డొచ్చిందని చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎదురవుతుందని నాలుగు నెలల ముందటే పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. టీచర్ల నియామకాలు జరగక ముందే పాఠశాలలు మొదలయ్యాయి. అప్పటికే ప్రయివేటు విద్యాసంస్థలు ఇల్లిల్లూ తిరిగి పిల్లల్ని చేర్పించుకున్నాయి. ఆ తరువాత 'బడి పిలుస్తోంది' అంటే ఎవరొస్తారు?
బడులు తెరిచేనాటికి పిల్లలకు పుస్తకాలు కూడా ప్రభుత్వం అందించలేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సగం పుస్తకాలు కూడా ముద్రణ కాలేదు. ముద్రణ అయిన వాటినీ ఇంకా సూళ్లకు తీసుకువెళ్లి పిల్లలకు సరఫరా చేయడమూ ఆలస్యమవుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పదో తరగతి వరకూ చదివే విద్యార్థులకు 2.83 కోట్ల పాఠ్యపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకూ అందులో సగం కూడా ముద్రణ జరగలేదు. ఆగస్టులో మొదలెట్టాల్సిన ముద్రణా ప్రక్రియను మార్చిలో ప్రారంభించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రకారంగా చూసినప్పుడు.. మరో నాలుగు నెలలైనా పుస్తకాల పంపిణీ పూర్తవుతుందా అనే సందేహం కలగకమానదు. గతేడాది విద్యాశాఖ కమిషనర్‌గా ఉన్న పూనం మాలకొండయ్య ఏప్రిల్లోనే పుస్తకాలను పూర్తి స్థాయిలో సూళ్లకు సరఫరా చేయించారు. ఈ యేడాది పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. యూనిఫారాలు కూడా సూళ్లు తెరిచే నాటికే అందించాల్సి ఉంది. అయితే అదీ సవ్యంగా సాగడం లేదు. ఇన్ని సమస్యలతో బడులు కొట్టుమిట్టాడుతున్నా.. బ్రహ్మాండంగా స్కూళ్లు ప్రారంభం కాబోతున్నాయని ముఖ్యమంత్రి అంటున్నారు. అసలు స్కూలుకు వెళ్లాలనే వాతావరణాన్నే కలిగించకుండా స్కూళ్లు బ్రహ్మాండంగా ప్రారంభమైతే ఉపయోగం ఏమిటి? ఉండాల్సిన అందరు టీచర్లూ లేని బడికి ఎవరైనా పిల్లల్ని పంపుతారా? ప్రజా ప్రతినిధులెవరైనా వారి బిడ్డలను ఇలాంటి స్కూలుకు పంపగలరా? ఓట్లప్పుడు చెప్పింది ఏమిటి, ఇప్పుడు చేసింది ఏమిటి? ప్రస్తుతం పాఠశాలల్లో ఖాళీల భర్తీ పెద్ద సమస్యగా ఉంది. అన్ని రకాల ఖాళీలు పది వేల వరకూ ఉన్నాయి. వాటిని త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అసలే ఖాళీల కొరతను ఎదుర్కొంటుంటే, బదిలీలు, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. ప్రభుత్వం అందుకు తగిన చర్యలు నేటికీ తీసుకోలేదు. అసలీ కార్యక్రమాలు వేసవి సెలవుల్లో నిర్వహిస్తే మధ్యలో ఆటంకం లేకుండా ఉండేది కదా.
పాఠశాలలు ప్రారంభమయ్యాక టీచర్లను బోధనేతర కార్యక్రమాలకు ప్రభుత్వం వినియోగించడం జరుగుతోంది. ఇలా వినియోగించడం విద్యార్థులకు నష్టదాయకం కనుక ఆ విధానం ఎత్తేయాలి. క్రమబద్ధీకరణ (రేషనలైజేషన్‌) పేరుతోనూ పాఠశాలలు మూత వేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో స్కూళ్ల సంఖ్యను కుదించే యోచన చేస్తూ... 'బడి పిలుస్తోంది' కార్యక్రమం మొదలెట్టాం అంటే అర్థం ఏమిటి? ప్రతి గ్రామంలో తరగతికి ఒక టీచరు, ఓ గది ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక పాఠశాల పరిధిలోనే 'పూర్వ విద్య' (ప్రీప్రైమరీ) తరగతులనూ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. 50 మంది లోపు విద్యార్థులుండే హాస్టళ్లను మూసివేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని విరమించుకొని అన్ని హాస్టళ్లలోనూ మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నత పాఠశాలల్లో కంప్యూటరు విద్యాబోధన కోసం కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. కానీ నిధులు లేవని గత సంవత్సరం వారిని తొలగించారు. ఉన్న ఫ్యాక్టల్టీలను తొలగించారు. ఇప్పుడు మళ్లీ నియామకాలు జరిపి విద్యార్థులకు కంప్యూటరు విద్యనందించేదెప్పుడు? మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్‌ వంటి ప్రయివేటు సంస్థలకు అప్పగించకుండా, ఏజెన్సీలకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన హామీలూ, సుప్రీంకోర్టు తీర్పులూ ఉన్నా టాయిలెట్లు, తాగునీరు లేని పాఠశాలలు అనేకం ఉన్నాయి. అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టాయిలెట్లు నిర్మించాలి. తాగునీరూ, ఇతర మౌలిక వసతులూ కల్పించాలి. ఈ పరిస్థితి విద్యార్థినులకు చాలా ఇబ్బందిగా ఉంది.
ప్రజల్లో ఆంగ్ల భాషపై ఉన్న ఆసక్తికి అనుగుణంగా ఆంగ్ల మాధ్యమం పాఠశాలలు ప్రవేశపెట్టాలంటే, ఒక క్రమపద్ధతిలో 6 లేదా 8వ తరగతి నుంచి ప్రారంభించాలి. ఓ శాస్త్రీయ విధానం లేకుండా ఉన్నట్లుండి తెలుగు మాధ్యమం విద్యార్థులందరినీ ఆంగ్ల మాధ్యమంలోకి మార్పుచేసి వారి మీద రుద్దడం సరికాదు. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. ప్రాథమిక పాఠశాలను మాతృభాషా మాధ్యమంతోనే ప్రారంభించి ఆంగ్ల బోధనకు ఓ ఉపాధ్యాయుణ్ణి నియమించి ఆ తర్వాత క్రమంగా ఆంగ్ల మాధ్యమంలోకి మార్చాలి.
మున్సిపల్‌ పాఠశాలల్లో మౌలిక వసతులు, తరగతి గదులు, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలి. పెరిగిన జనాభాకు అనుగుణంగా పట్టణ శివార్లలో నూతన పాఠశాలలను ప్రారంభించాలి. మున్సిపల్‌ పాఠశాలల్లో కొంతమంది మెరిట్‌ విద్యార్థులను గుర్తించి వారికి మాత్రమే కార్పొరేట్‌ విద్యను అందించేలా చర్యలు తీసుకోవడం సరైందికాదు. అలాగే మున్సిపల్‌ స్కూళ్ల విద్యార్థులకు కార్పొరేట్‌ తరహా విద్యనందిస్తామంటూ కొందరికి ప్రత్యేకమైన బోధన గరుపుతూ, మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. కార్పొరేట్‌ విద్యాలయాల్లో ఉన్న పద్ధతులను రుద్దజూపుతున్నారు. మంత్రి నారాయణ ఇదే విధానాన్ని మున్సిపల్‌ సూళ్లలో ప్రవేశపెడుతున్నారు. ఈ విద్యలో కార్పొరేట్‌ జోక్యం విరమించుకోవాలి. ఎయిడెడ్‌ పాఠశాలలు క్రమబద్ధీకరించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. అర్హత ఉన్నవారికి ఉద్యోగోన్నతులు కల్పించడం ద్వారా పోస్టులు భర్తీ చేయాలి. డ్రాప్‌ అవుట్‌ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కెజిబివిలను ఒక్క ఉత్తర్వుతో ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మార్చడం సరైందికాదు. ఇది విద్యార్థులకు నష్టం కల్గిస్తోంది. ఇప్పుడున్నవారు డ్రాప్‌ అవుట్‌ అయ్యే పరిస్థితి ఉంది. కనుక పై నిర్ణయాన్ని విరమించుకోవాలి.
ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన మోడల్‌ స్కూళ్లలోనూ ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఆ పని తక్షణం జరగాలి. అన్ని చోట్లా హాస్టళ్లను ప్రారంభించాలి. టాయిలెట్లు, తాగునీరు, రక్షణ సౌకర్యాలు కల్పించాలి. గురుకులాలతోపాటు మొత్తం విద్యారంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలి. ఎంఇఒ, డివైఇఒ, పర్యవేక్షణాధికారుల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు దశాబ్ద కాలం నుంచీ ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ అమలు జరగడం లేదు. తక్షణం వారిని నియమించాలి. డైట్‌ కళాశాలల్లో అధ్యాపకుల నియామకాలను చేపట్టడంతోపాటు, యూనివర్సిటీ, ప్రభుత్వ కళాశాలల్లోని పోస్టులనూ వెంటనే భర్తీ చేయాల్సిన అవసరమెంతో ఉంది. కాంట్రాక్టు లెక్చరర్లనూ తక్షణమే రెన్యువల్‌ చేయాలి. కళాశాలల్లో మరుగుదొడ్లకూ, భవనాలకూ మరమ్మతులు ఏళ్ల తరబడి సాగడంలేదు. వాటిని వెంటనే చేపట్టి పూర్తిచేయాల్సిన అవసరముంది. స్టూడెంట్స్‌ మేనేజ్డ్‌ హాస్టల్స్‌ (ఎస్‌ఎంహెచ్‌) వెంటనే తెరవాలి. వాటికి పాత బకాయిలు తక్షణమే చెల్లించాలి. కార్పొరేట్‌, ప్రయివేటు కళాశాలల్లోనూ, పాఠశాలల్లోనూ జీవో నెం.1(94) ప్రకారం యాజమాన్య కమిటీలు నియమించాలి. అధిక ఫీజుల తగ్గింపు, విద్యా ప్రమాణాల పెంపుదల, కనీస సౌకర్యాలు ఏర్పాటు విషయం ఆ కమిటీల్లో చర్చించి నిర్ణయాలు చేయాలి. ప్రజా ప్రతినిధులు తలో ఒక ప్రభుత్వ పాఠశాలను స్మార్ట్‌ స్కూల్‌గా చేయటానికి దత్తత తీసుకోవాలి. ప్రభుత్వ మెడికల్‌, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలనూ, ఐటిఐలనూ నేటి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి. వెనుకబడిన ప్రాంతాలలో గురుకుల పాఠశాలలు ప్రారంభించాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలను ఒక కిలోమీటరు పరిధిలో ఏ స్కూలుఉందో దానిలో చేర్పించుకోవాలి. ఏదో ఒక బడిలో చేర్చాలి. కార్పొరేట్‌ స్కూళ్లు, కళాశాలల్లో పేద విద్యార్థుల కోసం ప్రత్యేకించాల్సిన 25 శాతం సీట్లను కేటాయించి వారి ఫీజులను ప్రభుత్వమే చెల్లించేలా ప్రొసీజర్లు ఖరారు చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'బడి పిలుస్తోంది' కార్యక్రమానికి సార్థకత ఏర్పడుతుంది.
- వి కృష్ణయ్య
(రచయిత సిపిఎం విద్యారంగ సబ్‌ కమిటీ కన్వీనర్‌)