
దళిత స్కాలర్ రోహిత్ వేముల చివరగా రాసిన ఆత్మహత్య లేఖను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఆ లేఖను ఫోరెన్సిక్‌కు పంపినట్లు తెలుస్తోంది. అయితే రోహిత్ మృతితో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో మిగతా నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ నిలిపివేశారు. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. రోహిత్ మృతికి కారణమైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, హెచ్‌సియూ వైస్ ఛాన్స్ లర్ అప్పారావును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రోహిత్ సూసైడ్ పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ లేఖలో మధ్య పేరాలో కొన్ని అక్షరాలు కొట్టేసి ఉన్నాయి. అందులో అసలు విషయం ఏదైనా ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల అనంతరం పూర్తి సమాచారం వెలుగు చూడనుంది.