ఫాసిస్టు దాడి..

ముంబయిలో రచయిత సుధీంద్ర కులకర్ణిపై శివసేన మూకలు చేసిన దాడి సభ్య సమాజం వేనోళ్ల ఖండించాల్సిన దుర్మార్గ చర్య. మన దేశంలో మతోన్మాద శక్తులు అధికార పీఠాన్ని అధిరోహించిన తరువాత భావ ప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడుల పరంపరలో ఇది తాజాది. పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షీద్‌ మహ్మద్‌ కసూరి పుస్తకావిష్కరణ సందర్భంగా ఫాసిస్టు మూకలు రెచ్చిపోయి కులకర్ణిపై నల్ల పెయింట్‌తో జరిపిన దాడి మేధో జగత్తును విస్మయానికి గురిచేసింది. కేంద్ర ప్రభుత్వంలోను, మహా రాష్ట్ర ప్రభుత్వంలోను బిజెపికి భాగస్వామిగా వున్న శివసేన విద్వేషపూరిత రాజకీయాలకు పేరుమోసింది. గత వారం ముంబయిలో జరగాల్సిన పాకిస్తానీ గజల్‌ గాయకుడు గులాం అలీ సంగీత కచేరిపై దాడి చేస్తామని బెదిరించి ఆ కార్యక్రమం రద్దయ్యేలా చేసింది. ఇప్పుడు భారత్‌- పాకిస్తాన్‌ మధ్య సంబంధాల మెరుగుదలకు దౌత్య యత్నాలు చేస్తున్న కసూరి పుస్తకావిష్కరణను అడ్డుకోజూసింది. పుస్తకావిష్కరణను అనుమతించేది లేదని రంకెలేేసింది. వాజ్‌పేయి ప్రధానిగా వున్నప్పుడు పిఎంఓలో కీలకపాత్రధారిగా, అద్వానీకి సలహాదారుగా వ్యవహరించిన మాజీ పాత్రికేయడు కులకర్ణి ఒక రకంగా అధికార పార్టీ మిత్రుడే. ఆయన మధ్యేవాద మితవాద రాజకీయాలకు చెందిన వ్యక్తి. కాకుంటే భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని వాదించే వ్యక్తి. ఈ కార్యక్రమానికి ముందు ఉద్ధవ్‌ థాకరేను కలిసి పుస్తకావిష్కరణకు అనుమతించాలని ప్రాధేయ పడ్డాడు. ప్రజాస్వామ్యంలో తమకు నచ్చని అంశంపై నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికీ వుంటుంది. శివసేన కూడా శాంతియుతంగా నిరసన తెలియజేసుకోవచ్చు అని విన్నవించాడు. విద్వేషం, అసహనం తలకెక్కిన శివసేన నాయకత్వానికి ఈ ఉపదేశాలు, హితబోధలు తలకెక్కుతాయా? భారత్‌-పాకిస్తాన్‌ మధ్య వైరాన్ని పెంచి, దాని నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు బిజెపి వంటి మతతత్వ శక్తులతో పోటీ పడుతున్న శివసేన కులకర్ణిపై దాడికి తెగబడడంలో ఆశ్చర్యం లేదు. దేశాన్ని పట్టికుదిపేసిన దాద్రి ఘటనపై ఇంతవరకు మౌనంగా వున్న ఎల్‌కె అద్వానీ ఇప్పుడు కులకర్ణిపై దాడి జరిగే సరికి కళ్లు తెరిచారు. బిజెపికి చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా శివసేన చర్య ముంబయి ప్రతిష్టకు మచ్చ తెచ్చేదిగా వుందన్నారు. కులకర్ణి తమ వాడు కావడం వల్లే అద్వానీ వెంటనే స్పందించారు. ప్రభుత్వంలో భాగస్వామిగా వుంటూ చెవిలో జోరీగలా వున్న శివసేనను దారికి తెచ్చేందుకు దీనినొక అవకాశంగా భావించి ఫడ్నవీస్‌ ఆ వ్యాఖ్యలు చేశారు. కులకర్ణిపై దాడి జరగడానికి ముందు ఫడ్నవీస్‌ ఒక ప్రకటన చేస్తూ భారత్‌ వ్యతిరేక ప్రచారానికి ముంబయిని వేదికగా చేసుకోవడానికి ఎవరినీ అనుమతించేది లేదని అన్నారు.
గులామ్‌ ఆలీ కచేరి జరగనివ్వబోమమని శివసేన రంకెలు వేసినప్పుడు ఇది తప్పు అని ఈ బిజెపి నాయకులెవరూ ఖండించలేదు. అప్పుడే గనుక వారు స్పందించి వుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చి వుండేది కాదు. ఏదేమైనప్పటికీ విద్వేష రాజకీయాలను నడపడంలో సిద్ధహస్తుడైన అద్వానీ లాంటి నాయకుడు కూడా సోమవారం నాటి దాడిని ఖండించాల్సి వచ్చిందంటే దేశంలో సాంస్కృతిక ఫాసిజం ఎంతగా పెరిగిపోయిందో అర్ధమవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఎప్పటిలానే ఈ దాడిపైన కూడా మౌనం వహించారు. దాద్రి ఘటనపై కూడా ఆయన ఇదే విధమైన మౌనం వహించారు. భారత్‌- పాకిస్తాన్‌ మధ్య సంబంధాలను దెబ్బతీయాలని కోరుకునే శక్తులకు ఆయన మౌనం ఊతమిస్తుంది. ఇరు దేశాల మధ్య రావణకాష్టంలా నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొనేలా చూడాలన్నదే శివసేన లక్ష్యం. ఇరు దేశాల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లను అడ్డుకోవడానికి పిచ్‌లను తవ్వేయడం, ముంబయి నుంచి మరాఠీయేతరులు వెళ్లిపోండంటూ వారిపై దాడులకు తెగబడిన నీచ నికృష్ట సంస్కృతి శివసేనది. ఇటువంటి విద్వేష సంస్కృతే దేశంలో ముగ్గురు హేతువాద ప్రముఖుల ప్రాణాలు తోడేసింది. 
దాద్రిలో యాభై ఏళ్ల అఖ్లాక్‌ను బలిగొన్నది. ఉధంపూర్‌, మైన్‌పురిలో తాజా మత ఘర్షణలు తలెత్తడానికి దారితీసింది. భావ ప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇంతవరకు 17మంది ప్రముఖ రచయితలు - వారిలో చాలా మంది సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు తమ అవార్డులను వెనక్కి పంపారు. మరి కొందరు సాహిత్య అకాడెమీ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా పంజాబ్‌కు చెందిన దలీప్‌ కౌర్‌ తివానా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిరసన ఉద్యమానికి బుకర్‌ ప్రైజు గ్రహీత ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ బహిరంగంగా మద్దతు పలికారు. హిందూత్వ శక్తుల అసహన సంస్కృతికి వ్యతిరేకంగా స్వతంత భారతంలో ఇంత పెద్దయెత్తున రచయితలు, కళాకారులు, మేధావులు కదలి రావడం ఇదే ప్రథమం. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం గావించాలి. అసమ్మతిని ఏమాత్రమూ సహించలేని ఈ ప్రమాదకర ధోరణికి వ్యతిరేకంగా నూట ముప్పయి కోట్ల గొంతుకలు ఒక్కటై నినదించాలి. మతతత్వ ఫాసిస్టు శక్తులకు ఈ గడ్డపై చోటు లేకుండా చేయాలి.