
ప్రభుత్వం ప్రయివేట్ విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడుతుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.లక్ష్మణరావు ఆరోపించారు. ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ శనివారం విజయవాడలో జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రయివేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయటం కోసం కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపిందన్నారు. దీనిని ఎస్‌ఎఫ్‌ఐ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో జిల్లాకి ఒక ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించకుండా ప్రయివేట్ యూని వర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలపటం సరైన విధానం కాదన్నారు. ప్రయివేట్ యునివర్సిటీల ఏర్పాటుకు మేథావులు, విద్యావేత్తల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం ప్రభుత్వ మొండితనానికి నిదర్శనమన్నారు. ప్రయివేట్ విద్యను ప్రోత్సహించటమే కాకుండా ప్రభుత్వ విద్యను నీరుకార్చే కుట్రకు ప్రభుత్వం తెగబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రయివేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తే ఎస్‌ఎఫ్‌ఐగా అడ్డుకుంటామని హెచ్చరించారు.