ప్రైవేటుకు ప్రభుత్వాస్పత్రులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినెట్‌ ఆగస్టు 8 సమావేశంలో వైద్య విద్య సమీక్ష పేరుతో ఇప్పటికే చిత్తూరు జిల్లా ఆస్పత్రిని 'ఆపోలో'కు అప్ప గించిన విధంగానే ఆంధ్ర ప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రు లను ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లా ప్రభుత్వ వైద్యశాలను ప్రైవేటు వైద్య కళాశాలలకు అప్పగించడం దుర్మార్గం. ఇది జాతి సంపదను ప్రైవేటు వారికి అప్పగించడమే. సుమారు రూ.1,000 కోట్ల విలువ చేసే జిల్లా ప్రభుత్వ వైద్యశాలలను అప్పనంగా ప్రైవేటుకు కట్టబెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఏ ప్రభుత్వమైనా ప్రజా సంపదను కాపాడాలి తప్ప హరించడం అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం ఏ స్వార్థ ప్రయోజనంతో ప్రైవేటు వారికి అప్పగిస్తున్నదో ప్రజలకు సమాధానం చెప్పాలి. మన రాష్ట్రంలోని చిత్తూరు, నంద్యాల, ప్రొద్దుటూరు, హిందూపురం, తెనాలి, మచిలీపట్నం, ఏలూరు, రాజ మండ్రిల్లోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలు నేటికీ సామాన్య ప్రజ లకు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాథమిక వైద్యం తీవ్రంగా దెబ్బతింటోంది. పేద లకు ప్రభుత్వ వైద్యశాలలే దిక్కుగా ఉన్నాయి. ఇప్పటికీ వందల సంఖ్యలో ప్రతిరోజూ ఒపి ఉంటున్నది. వీటిని ప్రైవేటు కళాశా లలకు అప్పగిస్తే ప్రైవేటు పెత్తనం ఈ ఆస్పత్రులపై ఉంటుంది. దీని ప్రభావంతో ప్రజలపై తీవ్ర భారాలు పడక తప్పదు.
ప్రజల ఆరోగ్య బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పించుకోవడంలో భాగమే ఇలా ప్రైవేటు కళాశాలలకు అప్పగించడం. వందల కోట్లు పెట్టి నిర్మించవలసిన ఆస్పత్రి ఖర్చు నుంచి ప్రైవేటు యాజమాన్యాలు తప్పించుకుంటాయి. మరోవైపు ప్రజల నుంచి యూజర్‌ ఛార్జీలు దండిగా వసూలు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలు పొందుతున్న ఉచిత మందులు, ల్యాబ్‌ ఖర్చులు అన్నీ ఖరీదవుతాయి. డబ్బులు చెల్లించి మాత్రమే సేవలు పొందాలనే విధానాలు అమల్లోకి వస్తాయి. 'అందరికీ ఆరోగ్యం' అనే ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్మానాన్ని భారతదేశం కూడా ఆమోదించింది. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో అందరికీ ఆరోగ్యం అందించడం ప్రభుత్వాల బాధ్యతగా కృషిచేశాయి. సరళీకరణ విధానాలతో తర్వాత కాలంలో ప్రభుత్వ వైద్యానికి తిలోదకాలివ్వడం ఆరంభమైంది. ప్రైవేటు వైద్యాన్ని చాలా గొప్పగా ప్రభుత్వమే నేడు చిత్రీకరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య శాఖ మంత్రి పుట్టపర్తి హాస్పటల్‌కు వెళ్లి రక్తదానం చేశారు. హాస్పిటల్‌ చూసి ముగ్ధుడై రక్తదానం చేశానని పత్రికల్లో ఫొటో వేయించుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను పుట్టపర్తితో పోల్చడం సరికాదు. లక్షల మందికి రక్తాన్ని అందించిన చరిత్ర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉంది. సామాన్యులను వైద్యంలో అన్ని విధాలా ఆపదలో ఆదుకునేవి ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రమే. ప్రభుత్వ ఆస్పత్రులను కించపరచడం, ప్రైవేటును పొగడడం నేడు పరిపాటి అయ్యింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలుకల సంఘటనను ఆసారాగా తీసుకుని వైద్యులను, సిబ్బందిని ప్రభుత్వమే బలిపశువులుగా చేసింది. భవనాల మరమ్మతులు చేయకపోవడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. కానీ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ ప్రభుత్వ ఆస్పత్రులను నిరంతరం నిందించి ప్రజలను తృప్తిపరచాలని చూస్తున్నారు. 1990 వరకూ ప్రజలకు వైద్యాన్ని ఎనభై శాతం వరకూ ప్రభుత్వ వైద్యశాలలే అందించాయి. సరళీకరణ విధానాల ఫలితంగా నేడు అది 35 శాతానికి తగ్గింది. ఇదే కాలంలో ప్రైవేటు వైద్యం 65 శాతానికి పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య, ఆరోగ్య రంగాలకు తగినంత ఖర్చు పెట్టకపోవడమే దీనికి ప్రధాన కారణం. నేడు వైద్య, ఆరోగ్య రంగానికి స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 1.2 శాతం మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. కానీ కనీసం 5 శాతం పైగా భరించాలి.
మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎమ్‌సిఐ) ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తోంది. ఒక జిల్లాలోని రెండు, మూడు మెడికల్‌ కాలేజీలకు ఒకేసారి అనుమతులు ఇస్తున్నారు. ఎమ్‌సిఐకి ఛైర్మన్‌గా పనిచేసిన కేతన్‌ దేశారు వందల కోట్ల రూపాయలతో సిబిఐకి పట్టుబడ్డాడు. కానీ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పచ్చి అవినీతిపరుడైన కేతన్‌ దేశారునే తిరిగి నియమించింది. ప్రైవేటు వైద్యకళాశాలల్లో యాజమాన్యాలు మెడికల్‌ సీట్లు తెగబడి అమ్ముకుంటున్నారు. మెడిసిన్‌ సీటు ఒక్కింటికి రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకూ, పిజి సీట్లు కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ అమ్ముకుంటున్నారు. ప్రైవేటు వైద్య కళాశాల స్థాపనలో వ్యాపార లక్ష్యం తప్ప వైద్య సేవాతత్పరత ఏమీ ఉండదు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టే విద్యార్థులకు డబ్బు సంపాదన ధ్యాస తప్ప ప్రజలకు వైద్య సేవలందించాలన్న ఆలోచన ఉంటుందా? ప్రైవేటు వైద్యంతో ప్రజల ఆరోగ్యం మంటగలిసిపోతుంది. ఇప్పటికే దేశంలోని 21 పెద్ద రాష్ట్రాల్లో ఆరోగ్యంలో ఆంధ్రప్రదేశ్‌ 11వ స్థానంలో ఉంది. ప్రైవేటుకు పెద్ద పీట వేయడం వల్ల ఆరోగ్యం మరింత దిగజారే ప్రమాదం ఉంది. మన రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,100 పైగా డాక్టరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5,200 నర్సింగ్‌ పోస్టులు నేటికీ నింపడం లేదు. ప్రభుత్వ వాగ్దానాలే మిగిలిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డాక్టరు పోస్టులు నింపినప్పుడు వారికి అదనపు మార్కులు కలవడం వల్ల పిజి సీట్లకు వీరు అర్హులవుతారు. గ్రామీణ ప్రాంతంలో మలేరియా, డెంగ్యూ, డయేరియా వ్యాధులు తీవ్రంగా ప్రబలుతున్నా డాక్టరు పోస్టులు నింపకుండా ప్రభుత్వం మొద్దునిద్ర పోతున్నది. ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేటుపరమైతే ఇప్పటి వరకూ జిల్లా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. ఉద్యోగులకు జీతాలు ఎవరు చెల్లిస్తారనేది ప్రశ్నార్థకం అవుతుంది. కాంట్రాక్టు అవుట్‌సోర్సింగు పనుల పేరుతో ఉద్యోగులకు ఎటువంటి భద్రతా ఉండదు. ప్రభుత్వ రిక్రూట్‌మెంటు ఈ రంగంలో పూర్తిగా ఆగిపోతుంది. ఫలితంగా ప్రమోషన్లు ఉండవు. ఉద్యోగులకు బడ్జెట్‌ కేటాయింపులు, నిధుల మంజూరు ఉండదు.
ఏదీ ఉచితంగా ఉండరాదనే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయబోతున్నది. అందుకే జిల్లా వైద్యశాలలను ప్రైవేటుకు అప్పగించి ఫీజులు దండిగా వసూలు చేయాలని భావిస్తున్నది. ఇప్పటి వరకూ ఉచితంగా ఇచ్చిన మందులు ఇక ఉండవు. వాస్తవంగా వైద్య ఖర్చుల్లో వైద్యం కంటే మందుల ఖర్చులు ఎక్కువ. దీనివల్ల మనదేశంలో ప్రతి సంవత్సరం వైద్యం, మందుల ఖర్చులు భరించలేక ఎనిమిది కోట్ల మంది పేదరికంలోకి నెట్టబడుతున్నారు. ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య నిధుల్లో 25 శాతం 'ఆరోగ్యశ్రీ'కి కేటాయిస్తున్నారు. ఈ నిధులు ప్రైవేట్‌ కార్పొరేటు ఆస్పత్రులకే లాభాలు చేకూరుస్తున్నాయి. ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా రోగుల్లో కేవలం 2 శాతం మందికి మాత్రమే వైద్యం అందుతున్నది. ప్రైవేటు వైద్య కళాశాలలకు ఉచితంగా ఆస్పత్రులను అప్పగించడం, యూజర్‌ ఛార్జీలు వసూలు చేసుకోవడానికి, మందులు, ల్యాబ్‌ ఖర్చుల పేరుతో భారీగా లాభాలు గడించడానికి రాష్ట్రం ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వైద్యం నుంచి తమ బాధ్యతలను తప్పించుకోవడం వల్ల ప్రజలపైనా పెనుభారాలు మోపబడతాయి. ఇటువంటి ప్రజావ్యతిరేక విధానాలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతున్నాం.
- సిహెచ్‌ నరసింగరావు
(వ్యాసకర్త సిపిఐ(ఎమ్‌) ప్రజారోగ్య సబ్‌ కమిటీ ఆంధ్రప్రదేశ్‌ కన్వీనర్‌)