ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్టులు..

 జిల్లాకు ప్రాణవాయువు లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికా కపోవడంతో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు అది ఒక వరం లాగా మారింది. ప్రతి రాజకీయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించడం ఆనవాయితీగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే లక్షలాది ఎకరాలు పంట భూములుగా సాగులోకి తీసుకురావచ్చునని ప్రకటిస్తున్నారు. కానీ ఇది ఆచరణలో ఎంత సాధ్యమో గత దశాబ్దాల కాలం నుంచి రాజకీయ పార్టీలు చేసిన ప్రకటనలు, వాగ్దానాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమౌతుంది. నాటి ముఖ్యమంత్రి అంజయ్య మొదలుకుని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు మనం పరిశీలన చేస్తే వాళ్ళకు రాజకీయంగా అవసరమైనప్పుడు ప్రజల కోసం ఏదో చేసేస్తున్నట్లు ప్రాజెక్టు వద్ద కొత్తగా శంఖుస్థాపన చేసినట్లుగా కొబ్బరికాయ కొట్టి హడావుడిగా ప్రారంభించడం, బడ్జెట్‌లో నామమాత్రంగా కొన్ని నిధులు కేటాయించి తమ పార్టీకి చెందిన వాళ్ళకు కాంట్రాక్టు ఇచ్చి తూతూమంత్రంగా కొద్ది రోజులు పనులు చేసి కేటాయించిన నిధులు దిగమింగి చేతులు దులుపుకుంటున్నాయి.
దీనిలో భాగంగానే 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తే 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని ఎన్నికల ముందు పదేపదే వాగ్దానం చేసి టిడిపి అధికారంలోకి వచ్చింది. రూ.15 వేల కోట్లు రెవెన్యూ లోటు బడ్జెట్‌ ఉన్నదని చెబుతూనే 2014 మే 31వ తేదీన 30 కోట్లు ఖర్చుపెట్టి చంద్రబాబునాయుడు ఎంతో అట్టహాసంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అధికారంలోకి వచ్చి 16 మాసాలు కావస్తున్నప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రారంభించకుండా మార్చి నెలలో పట్టిసీమ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి తెరపైకి తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా, రాయలసీమకు నీరు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం రాయలసీమలో ఇప్పటికే నిర్మాణాల్లో 75 శాతం పనులు పూర్తి చేసుకొని మధ్యలో నిలిచిపోయిన హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు, నగరి ప్రాజెక్టులను పూర్తి చేస్తే రాయలసీమ ప్రజల నీటి ఎద్దడి సమస్య పరిష్కారం అయి ఉండేది. కానీ నిర్మాణ దశలో నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తిచేయాలని, రాయలసీమ ప్రాంతంలో చాలా కాలం నుంచి ఉద్యమాలు జరుగుతున్నా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగా ప్రభుత్వం తీరు ఉన్నది.
హఠాత్తుగా పట్టిసీమను తెర మీదకు తీసుకురావడంతో గోదావరి జిల్లాల ప్రజలలో ప్రభుత్వం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటికే రూ.490 కోట్లు అవినీతి జరిగిందని ఇటీవల పత్రికల్లో కూడా ప్రచారం జరిగింది. దీనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. పట్టిసీమ ఎత్తిపోతల పనుల్లో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొదటి పంపు ప్రారంభించి ఒక రోజు గడవక ముందే పెదవేగి మండలం జానంపేట వద్ద నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అక్విడెక్టు జాయింట్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో కుడి కాలువ నీరంతా తమ్మిలేరులోకి వృథాగా పోయింది. పూర్తి స్థాయిలో నీరు రాకుండానే అడ్విడెక్టు కుప్పకూలడంతో పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, అవినీతి జరిగిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక మంచి ప్రయత్నం చేసినప్పుడు చిన్నచిన్న ఇబ్బందులు తప్పవని, తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం నానా పాట్లూ పడుతున్నారు. ఆరు నెలల్లో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించడం ఒక చరిత్ర అని నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఊదరగొట్టి హడావుడి చేశారు. ఏదో విధంగా పంపుహౌస్‌ నిర్మాణమైనా పూర్తిచేసి అనుకున్న సమయానికి పట్టిసీమ ప్రారంభించామని చెప్పుకునేందుకు నానాహైరానా పడ్డారు. నిబంధనల ప్రకారం గోదావరి నీటిమట్టం 14.1 అడుగులు ఉంటేనే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీరు ప్రకాశం బ్యారేజీకి మళ్ళించాలి. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 13 అడుగులు మాత్రమే ఉంది. అంటే నీళ్ళు మళ్ళించే అవకాశం ఎట్టి పరిస్థితిలోనూ ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రాజెక్టు పూర్తిగా నిర్మాణం జరిగిందా, లేదా అన్నది కాదు స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించామా, లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా ఉంది ప్రభుత్వ వ్యవహారం. చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ జిల్లా ప్రజలను కొత్త కొత్త హామీలతోనూ, పొగడ్తలతోనూ ముంచెత్తుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని పదే పదే ప్రస్తావిస్తున్నారు. పట్టిసీమపై చూపించిన శ్రద్ధ ఏళ్ళ తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై ఎందుకు చూపడం లేదని ప్రజల మనసుల్లో మెదులుతున్న ప్రశ్న. శాశ్వత పరిష్కారం చూడకుండా, కాల్వ తవ్వకుండా, భూ సేకరణ పూర్తికాకుండా, పంపు సెట్లు లేకుండా, కాల్వలో చుక్క నీరు పారకుండానే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రెండుసార్లు ప్రారంభించిన ఘనత బహుశా దేశంలో ఏ ప్రభుత్వానికీ దక్కని అపూర్వ ఘనచరిత్ర ఈ ప్రభుత్వానికే దక్కిందని చెప్పొచ్చు. ఇప్పటికైనా హైటెక్‌ పాలకులు హడావిడి మానేసి, ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్టులు చేపడితే ప్రజలకు మేలు చేసినవారవుతారు.
- బళ్ళ చినవీరభద్రరావు 
(వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం తణుకు డివిజన్‌ కార్యదర్శి)