ప్రశ్నిస్తేనే..!

న్నెన్నో మాయలు చేసినవాళ్ళు మహాత్ములుగా బతికిపోతున్న కాలంలో మనిషిగా, మంచి మనిషిగా బతకడమే కష్టమైన విషయం అంటాడు కబీరు. మంచి మనిషిగా బతకడమంటే మౌనంగా తన దారిన తాను బతకడం కాదు. తన కళ్ళెదుటే దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే కళ్ళప్పగించి చూడటం కాదు. తానొవ్వక, నొప్పింపక, తప్పించుకు తిరిగే లౌక్యం చూపడమూ కాదు. మాయలపేరిట, మంత్రాల పేరిట మూఢత్వంలోకి లాక్కెళ్ళే కుతంత్రాలను ప్రశ్నించాలి. మనిషికి క్షేమకరం కాని చెడు మీద తిరగబడే తత్వాన్ని ప్రదర్శించాలి. హేతువుకు నిలవని విషయాలను సవాల్‌ చేయాలి. హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని ప్రపంచానికి అందించాలి. తన చుట్టూ ఉన్న ప్రజలలో ప్రశ్నించే తత్వాన్ని పాదుకొల్పాలి. ఇవాళ భూమి బల్లపరుపుగా ఉందని చెప్పడానికి ఎవరూ సాహసించరు. కానీ కొన్ని శతాబ్దాల కిందట భూమి గుండ్రంగా ఉందని ప్రపంచం చేత ఒప్పించడానికి కోపర్నికస్‌ వంటి ఎందరో ప్రాణాలకు తెగించి పోరాడాల్సి వచ్చింది. 
నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. అందుకని అంతవరకు మాట్లాడకుండా ఉండలేం. అబద్ధాలు రాజ్యం చేస్తున్న చోట అసలు నిజాలేవో తెలిసినప్పుడు నిక్కచ్చిగా చెప్పాల్సిందే. నిజాల నిప్పుల మీద నడక అనివార్యమైతే నడిచి చూపాల్సిందే. నిజంగానే నిప్పుల మీద నడిచి సత్యసంధతను చాటారు హేతువాదులు, భౌతికవాదులు. ఎదుటివారి నమ్మకాలతో నిమిత్తం లేకుండా హేతురాహిత్యాన్ని నిలదీసే సంప్రదాయం ఈ దేశంలో ఏనాటి నుంచో ఉంది. అయితే హేతువు లేనిదే దేన్నయినా ఎందుకు నమ్మాలనే భావాల అభివ్యక్తి ఇప్పుడు పెనుసవాల్‌గా మారింది. తెలియని ఏ అతీంద్రియ శక్తులో నడిపిస్తే నడిచే కాలం కాదిది. కార్యాకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు. ప్రతి పరిణామానికి మూలాలు, కారణాలు ఉంటాయి. అయినప్పటికీ స్వామిజీల ప్రసంగాలకు, బాబాల జిమ్మిక్కులకు వేలు, లక్షలుగా జనం తలలూపుతున్నారు. జాతి జీవితంలో హేతువు కొరవడటమే ఈ దుస్థితికి మూల కారణం. అతీతశక్తులు, భూతాలున్నాయని నిరూపిస్తే లక్ష రూపాయలు ఇస్తానని ఎటి కోవూర్‌ దాదాపు యాభై ఏళ్ళ కిందటనే సవాల్‌ విసిరారు. కానీ ఇంతవరకు ఎవరూ ఆ సవాల్‌ను స్వీకరించలేకపోయారు.
దురుద్దేశాలతో మూఢనమ్మకాలను ప్రచారం చేయగలరు. కానీ వాటిని నిరూపించలేరు. తిమ్మినిబమ్మిని చేయడం శాస్త్రం ముందు సాధ్యం కాదు. మాటలు చెప్పి బురిడీ కొట్టించడం కాదు. సాధికారికంగా రుజువు చేయాలి. ఇది సాధ్యం కానివారే దౌర్జన్యానికి దిగుతారు. ప్రశ్నించినందుకు, ప్రశ్నల సవాళ్ళు విసిరినందుకు మనుషులను భౌతికంగా నిర్మూలించడానికి తెగబడతారు. హేతువు వైపు నిలబడినవారిని భయకంపితులను చేయాలనుకుంటారు. బెదరగొట్టి నోళ్ళు మూయించాలని చూస్తారు. తాము ఏకీభవించకున్నా ఎదుటివారికి అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉందనే ప్రజాస్వామ్య సూత్రాన్ని విస్మరిస్తున్నారు. అందుకే ఈ దేశంలో మూఢత్వాన్ని, ఛాందసవాదాన్ని ప్రచారం చేసేవారు బాహాటంగా తిరుగుతున్నారు. వారికి అన్ని రకాల రక్షణలు లభిస్తాయి. సహేతుక దృష్టితో, శాస్త్రీయ ఆలోచనతో వ్యవహరించేవారు మాట్లాడటానికి సైతం జంకే పరిస్థితులు నెలకొంటున్నాయి. వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతకాల్సి వస్తున్నది.
శాస్త్రీయ దృక్పథాన్నీ, ప్రశ్నించే జిజ్ఞాసనీ పౌరుల్లో పెంపొందించాలని మన రాజ్యాంగం చెబుతోంది. ఇదే పని రచయితలు, మేధావులు, హేతువాదులు, భౌతికవాదులు చేస్తుంటే మతోన్మాదశక్తులు అడ్డుకుంటున్నాయి. వాటిని అదుపు చేయాల్సిన పాలకవర్గమే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊతమిస్తోంది. వెనక ఉండి నడిపిస్తోంది. భయానక వాతావరణాన్ని సృష్టించినంత మాత్రాన నిజాలు మాసిపోవు. శాస్త్రీయ ఆలోచన ఆగిపోదు. ఎందుకంటే ప్రపంచమంతా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగమిస్తున్నప్పుడు ప్రతి పరిణామాన్నీ హేతుదృష్టితోనే చూస్తారు. ముఖ్యంగా మంచివైపు నిలబడేవారు ప్రతి విషయాన్నీ, పరిణామాన్నీ, నిర్ణయాలను హేతుబద్ధమైన ప్రశ్నలకు గురిచేసి అనుకూలమైన సమాధానాలు వస్తేనే ఆచరిస్తారు. మంచిని ప్రేమించాలంటే చెడును ద్వేషించాలి. మనిషికి క్షేమకరం కాని దుర్మార్గపు భావాల మీద ఆగ్రహం ప్రకటించాలి. మనుషుల స్వేచ్ఛకూ, గౌరవానికీ భంగం కలిగించే భావాలను పరిమార్చాలి. అణచివేతకూ, అవమానాలకూ వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రకటించాలి. ఇది మంచి మనుషుల లక్షణం. మానవ పురోగతికి అడ్డునిలిచే శక్తుల్ని ప్రతిఘటించడం అవసరమైన తక్షణ కర్తవ్యం. ''ప్రతి వ్యక్తి తత్వమూ ఒక విశాల మానవత్వం అయిననాడు, ప్రతి వ్యక్తి జీవిత లక్ష్యమూ మానవులందరి సంక్షేమం, ప్రగతి అయిననాడు ఒకరిని ఒకరు ద్వేషించుకునే ప్రశ్న ఉదయించదు'' అంటారు పెరియార్‌. ఇలాంటి తత్వమే అసలుసిసలు మానవత్వం. ఇది వర్గరహిత సమాజంలోనే సాధ్యం. అలాంటి సమాజ సాకారం కోసం జరిగే పోరాటాల్లో భాగమే ప్రశ్నించడం, ప్రశ్నలను సంధించడం. ప్రశ్నించే తత్వాన్ని ప్రతి తరానికీ అలవరచడం. ఇది అనేక రకాలుగా, అనేకానేక రూపాల్లో జరగడం ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణానికి దోహదం చేస్తుంది. ప్రశ్నల లక్ష్యం నెరవేరుతుంది.