
ప్రయివేటు రంగంలో దామాషా పద్ధతి (జనాభా నిష్పత్తి)లో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రయివేటు రంగంలో రిజర్వేషన్స్ పోరాట సాధన కమిటీ సలహాదారు కె.ఎస్.చలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో 'ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి' అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. కెవిపిఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి డి.గణేష్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో కె.ఎస్.చలం మాట్లాడారు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను అనుసరించి ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సామాజిక వైరుధ్యాలను తగ్గించడానికి దళిత, గిరిజనులకు ప్రయివేటు రంగంలో భాగస్వాములను చేయాలన్నారు. అసమానతల మూలంగా సంఘర్షణలు వస్తున్నాయని తెలిపారు. సామాజిక అసమానతలు పెంచి పోషించే ఆర్థిక వ్యవస్థ దేశంలో ఉందని చెప్పారు. ప్రయివేటు రంగంలోనూ దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సరళీకృత ఆర్థిక విధానాల వల్లే...
సరళీకృత ఆర్థిక విధానాల వల్ల దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు పోరాట సాధన కమిటీ కన్వీనర్ దడాల సుబ్బారావు తెలిపారు. సంపదను ప్రతిభగా గుర్తించి, ప్రయివేటు, కార్పొరేట్ రంగాల్లో ఉన్నత వర్గాలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. శక్తి, సామర్థ్యాలను ప్రతిభగా గుర్తించి, దళిత, గిరిజనులకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్‌సి, ఎస్‌టిలలో ప్రతిభను గుర్తించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఉద్యోగావకాశాలు ప్రయివేటు రంగంలో కోల్పోతున్నారన్నారు. ప్రపంచీకరణలో భాగంగా ప్రభుత్వ రంగం కుదించుకుపోయి, ప్రయివేటు రంగం విస్తరిస్తుందన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీని అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారని విమర్శించారు. దీన్ని సాధించుకోవడం కోసం మార్చి రెండో తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని వెల్లడించారు.
ప్రొఫెసర్ కెపి సుబ్బారావు మాట్లాడుతూ సమాజంలో హెచ్చుతగ్గులు ఉన్నంత వరకూ రిజర్వేషన్లు ఉండాలన్నారు. దళిత, గిరిజనులు హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ రెక్టార్ మిరియాల చంద్రయ్య 'ప్రజాస్వామ్య ఉద్యమం' అనే అంశంపై, ప్రొఫెసర్ జి.తులసీరావు 'దళితులపై అత్యాచారాలు - నివారణ చర్యలు' అనే అంశంపై మాట్లాడారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హెచ్‌సియు విద్యార్థి రోహిత్ మృతికి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సదస్సులో విజికె మూర్తి, దళిత ఐక్యవేదిక నాయకులు కె.రాంగోపాల్, బరాటం కామేశ్వరరావు, చంద్రావతి, బాణ్ణ రాము, బి.ప్రభాకర్, ఎస్‌వి రమణమాదిగ, వై.నారాయణరావు, బి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కమిటీ ఎన్నిక
జిల్లా స్థాయిలో ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు పోరాట సాధన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీకి ప్రధాన కన్వీనర్‌గా డి.గణేష్, కన్వీనర్లుగా కె.రాంగోపాల్, కృష్ణయ్య, ఎస్‌వి రమణ, బరాటం కామేశ్వరరావు, బోనెల అప్పారావు, బాణ్ణ రాముతోపాటు 16 మందిని ఎన్నుకున్నారు. కమిటీకి సలహాదారులుగా ప్రొఫెసర్ మిరియాల చంద్రయ్య, గుంట తులసీరావు, సాకేటి నాగభూషణం, బలగ చంద్రావతి వ్యవహరిస్తారు.
ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సంతకాల సేకరణ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎమ్‌పిలకు వినతిపత్రాలు అందజేయడం, 25 నుంచి 29వ తేదీ వరకు రౌండ్‌టేబుల్ సమావేశాలు, మార్చి ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు రెవెన్యూ కార్యాలయాల వద్ద నిరాహార దీక్షలు చేపట్టడం, ఐదో తేదీ నుంచి 10 వరకు మండల కేంద్రాలు, పట్టణాల్లో సైకిల్‌జాతా, బైక్ ర్యాలీలు, శాసనసభ సమావేశాల సందర్భంగా చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని సదస్సులో తీర్మానించారు.