
విద్యలో మితిమీరిన కేంద్ర జోక్యానికి, హిందూత్వ భావాలు చొప్పించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతుండడం పట్ల ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ వెలిబుచ్చిన ఆందోళన మామూలు విషయం కాదు. అమర్త్యసేన్ రాజకీయ నాయకుడు కాదు. ప్రతిపక్షానికి చెందినవాడు అసలే కాదు. ప్రభుత్వ ప్రమాదకర పోకడను చాలా దగ్గర నుంచి పరిశీలించిన ఆర్థికవేత్త. అలాంటి వ్యక్తి ఎన్‌డిఎ ప్రభుత్వ ధోరణిని నిలదీశారంటే పరిస్థితులు ఎంతగా చేజారాయో ఆలోచించాలి. తాజాగా తాను రచించిన 'ది కంట్రీ ఆఫ్ ఫస్ట్ బార్సు' గ్రంథంలో సర్కారు వైఖరిని సేన్ నిరసించారు. విద్యా విషయాల్లో రాజకీయ జోక్యం పరాకాష్టను దాటిందని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలన్నింటినీ హిందూత్వ వ్యక్తులతో నింపేయడం ప్రణాళికాబద్ధంగా జరుగుతోందని ఇప్పటికే ఎంతోమంది ప్రగతిశీలురు, మేధావులు గొంతెత్తగా, ఇప్పుడు అమర్త్యసేన్ ఆ పని చేశారు. భారత చరిత్ర పరిశోధన మండలి (ఐసిహెచ్‌ఆర్) ఛైర్మన్‌గా యల్లాప్రగడ నియామకాన్ని సేన్ తప్పుబట్టడమే కాకుండా, ఆయన చరిత్ర పరిశోధన కంటే హిందూత్వ భావజాలాన్ని దూర్చడంలో సిద్ధహస్తుడని పేర్కొనడం గమనార్హం. భారత సాంస్కృతిక సంప్రదింపుల మండలి కొత్త అధిపతిగా నియమితులైన లోకేశ్ చంద్ర భగవంతుని అవతారంగా మోడీని కీర్తించడం జుగుప్సాకరం. ఈ విషయాన్నే సేన్ తన పుస్తకంలో చేర్చి సమకాలీన పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం విద్య కాషాయీకరణకు ప్రయత్నించడం ప్రమాదకరం. విభిన్న మతాలు, జాతులు, భాషలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్న లౌకిక రాజ్యంలో బలవంతంగా హిందూత్వ భావాల చొప్పింపు సర్కారీ అఘాయిత్యం. భావి పౌరులుగా ఎదగాల్సిన బాలల లేత మనస్సుల్లో మతతత్వ విష బీజాలు నాటేందుకు ప్రభుత్వమే కంకణం కట్టుకోవడం దారుణం. వాజ్‌పేయి హయాంలో విద్య కాషాయీకరణ చాప కింద నీరులా సాగగా మోడీ ప్రభుత్వంలో బహిరంగంగా బరితెగించి ఆందోళనకర స్థాయికి చేరిందనే విషయాన్ని ప్రపంచం గుర్తిస్తుందనేదానికి సేన్ వంటి మేధావుల ప్రకటనలు తార్కాణం.
బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు మతతత్వ భావజాల వ్యాప్తికి విద్యా వ్యవస్థను ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాయి. బోధనాంశాలు, పాఠ్యపుస్తకాల్లో హిందూ మత సారం ఎక్కిస్తూ విద్యా విధానం రూపొందుతోంది. చరిత్రను తిరగరాయడం నుంచి సంస్కృతానికి అధిక ప్రాధాన్యమివ్వడం వరకు అంతా ప్లాన్ ప్రకారం సాగుతోంది. ఉన్నత విద్య, పరిశోధనల అత్యున్నత విధాన నిర్ణయ అధిపతులుగా హిందూత్వ వాదులను నియమిస్తున్నారు. ప్రతిష్టాత్మక పుణే ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్‌గా గజేంద్ర చౌహాన్ నియామకం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమైనాయి. చౌహాన్ అర్హత బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లకు సన్నిహితుడు కావడమే. ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఉద్యమమే చేపట్టారు. గిరీశ్ కర్నడ్, శశికపూర్, అనుపమ్‌ఖేర్ వంటి ప్రముఖులు విద్యార్థుల ఆందోళనలకు మద్దతివ్వగా వారందర్నీ హిందూ విరోధులుగా ఆర్‌ఎస్‌ఎస్ విషం చిమ్మింది. మృణాల్‌సేన్, శ్యాం బెనగళ్‌లను కూడా ఆ జాబితాలోకి నెట్టడం ఫాసిస్టు ధోరణికి తార్కాణం. అంతటితో ఆగకుండా ఐఐటిలు హిందువులకు, భారతదేశానికి వ్యతిరేకమైనవంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో హిందూత్వను వ్యతిరేకించే కార్యక్రమాలను రద్దు పర్చుతూ హుకుం జారీ చేస్తున్నారు. మాంసాహార నిషేధం, పూజలకు అనుమతి కోసం 'పరివారం' నానా యాగీ మోడీ సర్కారు అండ చూసుకొనే.
ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రధాని మొదలుకొని గల్లీ కార్యకర్త వరకు సమాజంలో శాస్త్రీయ అవగాహనకు బదులు అంధ విశ్వాసాలను పాదుకొల్పడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆందోళనకరం. వేదాల్లోనే శస్త్ర చికిత్సలున్నాయని ఆలిండియా సైన్సు కాంగ్రెస్ వేదికపై మోడీ వల్లె వేయడం శాస్త్రీయతకు, పరిశోధనలకు, భౌతిక వాదానికి, పరిణామ క్రమానికి వ్యతిరేకమైన అశాస్త్రీయ భావజాల ప్రచారం. సూపర్‌స్పెషాలిటీల స్థానంలో ఆయుష్ ప్రమోషన్, జనరిక్ ఔషధాల కంటే మూలికా వైద్యానికి ప్రాధాన్యతనివ్వడం కూడా హిందూత్వ భావాల ప్రచారం కోసమే. విద్యా సంస్థల్లో జ్యోతిష్యం, యోగా సైతం అందులో భాగమే. ముంబయి ఐఐటి డైరెక్టర్ల నియామకంలో మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ జోక్యం చేసుకుంటున్నారని ప్రముఖ అణుశాస్త్రవేత్త అనిల్ కాకోద్కర్ చేసిన విమర్శకానీ, విశ్వవిఖ్యాత నలందా విశ్వవిద్యాలయ కులపతి పదవి కోసం దరఖాస్తు చేసిన అమర్త్యసేన్‌ను కాదని సింగపూర్ వ్యక్తి నియామకం కానీ హద్దుల్లేని సర్కారు జోక్యానికి మచ్చుతునకలు. ఢిల్లీ ఐఐటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశానికి యోగా గురువు రాందేవ్ బాబాను ఆహ్వానించారంటే పరిస్థితి ఎంతగా అదుపు తప్పిందో తెలుస్తుంది. విద్యా సంస్థల స్వయంప్రతిపత్తికి విఘాతం కలిగించే చట్టం కోసం ఉవ్విళ్లూరుతోంది ఎన్‌డిఎ సర్కారు. మతతత్వ భావజాల వ్యాప్తికి ప్రభుత్వమే నడుం కడింది. ఇలాంటి స్థితిలో లౌకిక శక్తులు మరింత చురుకుగా, ఐక్యంగపీ అశాస్త్రీయ భావజాలాన్ని ఎదుర్కోవాలి.