ప్రమాదంలో ప్రభుత్వ విద్య: SFI

ప్రభుత్వ విద్యారంగాన్ని నూతన విద్యాసంస్కరణల పేరుతో టిడిపి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10 రోజులపాటు నిర్వహించిన 'విద్యాపరిరక్షణ సైకిల్‌యాత్ర' ముగింపు సభ ఆదివారం స్థానిక జగన్నాథపురం చర్చిస్క్వేర్‌ వద్ద జరిగింది. సభలో రాము మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. నూతన సంస్కరణల పేరుతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయని విమర్శించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం చంద్రబాబు మారిన మనిషికాదని, కార్పొరేట్‌ నాయకులకు లొంగిపోయిన మనిషని ఎద్దేవా చేశారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి చులకన భావం ఉందన్నారు. ఆ భావాన్ని మార్చుకోకపోతే ఉద్యమాలు తప్పవని రాము హెచ్చరించారు.