ప్రభుత్వ హత్యలే..

ఇవి తొక్కిసలాట మరణాలు కావు, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలు. గోదావరి పుష్కరాలు జరుపుతున్నాం రండి, రండి అని వేలాది మంది ప్రజలను రప్పించి నిర్లక్ష్యంతో సర్కారు చేసిన హత్యలివి. గొప్ప పరిపాలనా దక్షునిగా తనకు తానే కితాబులిచ్చుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో జరిగిన హత్యలివి. 
రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 31 మంది మృత్యువాత పడ్డారన్న వార్త విన్నప్పుడు వెంటనే వచ్చే ప్రశ్న ఈ ఘటన ఎలా జరిగింది, దీనికి బాధ్యులెవరు అని. మూడు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి.
మొదటిది, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక పుష్కరఘాట్‌లు ఏర్పాటు చేసినా ప్రజలు రాజమండ్రికి పెద్ద ఎత్తున తరలి వస్తారని ప్రభుత్వానికి తెలుసు. రాజమండ్రి కేంద్రంగానే పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యక్రమాలు జరిగాయి, ప్రచారమూ జరిగింది. రాజమండ్రిలో కూడా ఎక్కువమందికి తెలిసింది పుష్కరఘాట్‌. అన్ని వేల మంది ప్రజలు రాజమండ్రికి తరలి వచ్చినప్పుడు ప్రజలను నియంత్రించే యంత్రాంగమే ఎక్కడా కనిపించకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించింది. 
రెండవది, పోలీసులుగానీ, ప్రభుత్వ యంత్రాంగం గానీ ప్రజలను ఎందుకు నియంత్రించలేక పోయింది? 19వేల మంది పోలీసులను పుష్కరాలకోసం ప్రత్యేకంగా తరలించారు. కానీ వారంతా ఏమైనారు? తొక్కిసలాట ఘటనకు ముందుగానీ, తరువాత చాలా సేపటివరకుగానీ ఎక్కడా పోలీసులూ, అధికారులూ కనిపించకపోవడానికి కారణమేమిటి? వారంతా విఐపిల సేవలో తరిస్తున్నారు. ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులూ వందల సంఖ్యలో రాజమండ్రి చేరుకున్నారు. పోలీసు యంత్రాంగానికి వారి బందోబస్తు, వారిని పుష్కరఘాట్‌లకు తరలించడం, మళ్లీ విడుదలకు పంపించడం, అక్కడ సేవలు చేయడంతోనే సరిపోయింది. 
మూడవది, చంద్రబాబు నాయుడు తాను దగ్గరుండి పుష్కర పనులు పర్యవేక్షిస్తానని చెప్పారు. కానీ ఒక రకంగా ఆయన వల్లే పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉదయం ముఖ్యమంత్రిగారు కుటుంబ సమేతంగా పుష్కర స్నానానికి వస్తున్నందున పుష్కర ఘాట్‌లోకి ప్రజలను వదలకుండా దాదాపు గంటన్నర సేపు పోలీసులు ఆపేశారు. ఆయన వెళ్లిపోయిన వెంటనే అందరినీ ఒక్కసారిగా విడిచిపెట్టారు. దాంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది.
పుష్కరాలకు వచ్చే ప్రజల భద్రతమీద, సదుపాయాలమీద దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం దాన్ని వదిలేసి పుష్కరాలకు ప్రజలను రప్పించడం ఎలా అన్నదానిమీద ఎక్కువ కేంద్రీకరణ చేయడం అనర్ధం తెస్తుందని ప్రజాశక్తి ముందునుండే హెచ్చరిస్తూ వచ్చింది. ప్రభుత్వం అనేది వేల సంఖ్యలో ప్రజలు ఒకేచోట సమీకృతమయ్యేటప్పుడు వారికి సదుపాయాలు చేసి, వారి భద్రతను పర్యవేక్షించే లౌకిక వ్యవస్థేగానీ అది ప్రజలను తీర్థయాత్రలకు ప్రేరేపించే ధార్మిక సంస్థకాదు. కానీ చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని మరిచిపోయారు. తన ప్రభుత్వం ఒక ధార్మిక సంస్థలాగా, తానో ఆధ్యాత్మిక నేతలాగా మొదటినుండీ వ్యవహరిస్తూ వచ్చారు. ప్రభుత్వ యంత్రాంగాన్నీ అదే మార్గంలో నడిపించారు. అందుకే అలౌకిక విషయాల మీద కేంద్రీకరించిన ప్రభుత్వం లౌకిక విషయాలమీద దృష్టి పెట్టలేకపోయింది. లౌకిక విషయాలమీద దృష్టిపెట్టిన మేరకు కూడా విఐపీలు, వారి బందోబస్తు, సేవలగురించి పట్టించుకున్న యంత్రాంగం ప్రజలను పట్టించుకోలేకపోయింది.
పుష్కరాలకు ఎంతమంది ప్రజలు వస్తారు, వారిలో మొదటి రోజు ఎంతమంది వస్తారు అనేది శ్రద్ధ పెడితే ప్రభుత్వానికి తెలియని విషయం కాదు. రాజమండ్రిలోని ఘాట్‌ల సామర్ధ్యం ఎంతో తెలుసుకుని, వచ్చిన ప్రజలను ఆయా ఘాట్‌లకు ఒక పద్ధతి ప్రకారం తరలించడం అంతపెద్ద యంత్రాంగానికి సాధ్యం కాకపోవడం అనే ప్రశ్నే లేదు. కానీ యంత్రాంగం మొత్తం పక్షవాతం వచ్చినట్లు అయిపోవడానికి కారణం ప్రభుత్వ ప్రాధామ్యాల్లో లోపం, ప్రజల పట్ల క్రూరాతి క్రూరమైన నిర్లక్ష్యం.
పుష్కరాలన్ని రోజులూ తాను రాజమండ్రిలోనే ఉండి ప్రజల బాగోగులు చూస్తానని చంద్రబాబు చెప్పారు. ఉండి ఆయనేం చేశారు? తొలిరోజే డజన్ల కొద్దీ ప్రజలు విగతజీవులవడానికి ప్రభుత్వాధినేతగా తానే కారణమైనారు. ఇది ప్రభుత్వమూ, ముఖ్యమంత్రిగా ఆయనా సిగ్గుతో తలదించుకోవలసిన విషయం. కానీ జరిగిన దానికి క్షమాపణ చెప్పకుండా మంత్రులూ అధికారులూ ప్రజలమీదకే తప్పు తోసేయడానికి ప్రయత్నించడం ఘోరం. భక్తులు తొలిరోజే పెద్ద ఎత్తున వచ్చినందువల్ల, ఒక్కసారిగా తోసుకుంటూ రావడం వల్ల తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. పుష్కరాలకు తరలి రావాలని అంతంత పెద్ద ప్రకటనలు ఇచ్చింది ఎవరు? బస్సుల్లో, వాహనాల్లో ప్రజలను తరలించమని కలెక్టర్లను ఆదేశించింది ఎవరు? వచ్చిన ప్రజలను నియంత్రించాల్సింది ఎవరు?
ప్రభుత్వం ప్రచారం మీద చూపించిన యావలో వందో వంతు ఆచరణలో చూపించి వుంటే ఈ ఘోరం జరిగివుండేది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం సాకులకోసం వెతకకుండా జరిగిన దాంట్లో తన తప్పేమిటో తెలుసుకోవాలి. ప్రజలముందు చెంపలేసుకోవాలి. మళ్లీ అటువంటి తప్పులు జరగకుండా రానున్న 11 రోజులైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలి. ప్రభుత్వం అంటే ఒక్క చంద్రబాబు నాయుడే అన్నట్లు కాకుండా వివిధ విభాగాలు తమ పనులు స్వేచ్ఛగా చేసుకేట్లు, జవాబుదారీగా ఉండేట్లు చూడాలి. ప్రజలు, ప్రజా సంస్థలు, ప్రతిపక్షాలను భాగస్వాములను చేయాలి. నిర్లక్ష్యం మత్తువీడి ప్రజల తీర్ధయాత్ర సజావుగా జరిగేట్లు చూడాలి.

-- ఎస్‌.వెంక‌ట్రావ్‌